సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ తొలి జాబితాను ఈ నెల 20లోపు ప్రకటించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా స్పష్టం చేశారు. ఈ నెల 16,17 తేదీల్లో మరోసారి ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమవుతుందని వెల్లడించారు. శనివారం ఇక్కడ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థిత్వాల ఖారరుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన ఆశావహుల జాబితాను కమిటీ సభ్యులందరికీ అందించారు. అయితే, ఈ జాబితాలో ఇతర పార్టీల నేతల పేర్లు సైతం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లతో జాబితా సిద్ధం చేసి సెంట్రల్ కమిటీకి పంపించేందుకు మూడు సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. గెలిచేవాళ్లు, పార్టీ విధేయులు, జనాల్లో పాపులారిటీ ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వాలని కమిటీ అభిప్రాయపడింది. కుటుంబానికి ఒక్క టికెట్ చొప్పున పరిశీలన ఉంటుందని, మినహాయింపు విషయంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీదే తుది నిర్ణయమని కమిటీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలిసింది.
ఈ సందర్భంగా పార్టీలో కోహినూర్ వజ్రాల కంటే అమెరికా డైమండ్ల హడావుడి ఎక్కువైందని కొంతమంది నేతలు మాట్లాడటం మిగతా నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యాఖ్యలు ఎవరు ఎవరిని ఉద్దేశించి చేశారన్న దానిపై నేతలు బయటకు చెప్పడంలేదు. మరోవైపు ఎన్నికల కమిటీ సమావేశంపై తమకు సమాచారం లేకపోవడంతో సీనియర్ నేతలు సర్వే సత్యనారాయణ, గీతారెడ్డి అలక బూనినట్టు తెలుస్తోంది. కొంచెం సమాచారంలోపం ఏర్పడిందని, ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని, ఈ సమయంలో యూనిటీగా ఉండాలని భట్టి విక్రమార్క వారికి సర్ది చెప్పినట్టు తెలిసింది. టికెట్ల కేటాయింపులో అనుబంధ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించేలా చూడాలని నిర్ణయించారు.
ముందుగా అభ్యర్థిత్వాల పోటీ లేని స్థానాలు...
తొలిజాబితా వ్యవహారం వేగవంతం చేయాలని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. నియోజకవర్గాల్లో çటెకెట్ కోసం పోటీలేని స్థానాల అభ్యర్థులను ముందుగా ప్రకటించాలని నేతలు నిర్ణయించారు. ఈ పేర్ల జాబితాను త్వరలో సెంట్రల్ ఎన్నికల కమిటీకి పంపించి ఆమోదముద్ర వేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మిగిలిన స్థానాల్లో ముగ్గురు పేర్ల చొప్పున స్క్రీనింగ్ కమిటీకి పంపించి ఆ తర్వాత సెంట్రల్ ఎన్నికల కమిటీకి చేరేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
నాలుగైదు రోజుల్లో స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి రానుందని, ఇంతలోపు షార్ట్ లిస్టు రూపొందించుకోవాలని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచించిన పేర్లను ఏఐసీసీ సెంట్రల్ కమిటీకి చేర్చాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ముందు మాసబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్‌లో కోర్ కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థుల జాబితా, ప్రచార వ్యవహారాలు, ప్రచారం షెడ్యూల్ విడుదలపై కమిటీ చర్చించింది.
కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య
మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఊకే అబ్బయ్య శనివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో సీపీఐలో ఉండగా ఇల్లెందు నుంచి, టీడీపీలో బూర్గూపహాడ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
అందని కూటమి పార్టీల జాబితా
మహాకూటమిగా ఏర్పాటవుతున్న తరుణంలో ఇప్పటి వరకు సీపీఐ నుంచి మాత్రమే అభ్యర్థుల జాబితా వచ్చిందని, టీడీపీ, జన సమితి, ఇతర పార్టీల నుంచి జాబితాలు రాలేదని కమిటీ దృష్టికి నేతలు తీసుకువచ్చారు. త్వరలోనే కూటమి పార్టీలతో కీలక సమావేశం ఏర్పాటు చేసి స్థానాలు, జాబితాపై తుది కసరత్తు చేయాలని కమిటీ నిర్ణయించింది.
సమావేశంలో కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భట్టి, సీనియర్ నేతలు జానా, రేవంత్, పొన్నం, సలీం అహ్మద్, బోసు రాజు, శ్రీనివాసకృష్ణన్, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, పొన్నాల, పి.వినయ్‌కుమార్, వీహెచ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ, మర్రి శశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, కోదండరెడ్డి, నేరెళ్ల శారద, సీతక్క, సుదర్శన్‌రెడ్డి, మల్లు రవి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కటకం మృత్యుంజయం, సంభాని చంద్రశేఖర్, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment