తెలంగాణ అసెంబ్లీకి వచ్చే నెల 7న జరగబోయే ఎన్నికలకు గురువారం నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో బరిలో ఉండబోయే అభ్యర్థులెవరన్న అంశంలో స్పష్టత వచ్చింది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు రెండూ అసంతృప్తుల్ని బుజ్జగించి పోటీనుంచి వారు వైదొలగేలా చేయడంలో విజయం సాధించాయి. దాదాపు అరడజను స్థానాల్లో మినహా మిగిలినచోట్ల రెండు పార్టీలకూ రెబెల్స్ బెడద తప్పిపోయింది. టీఆర్‌ఎస్ గత ఎన్నికల మాదిరే ఈసారి కూడా ఎవరి తోనూ పొత్తు లేకుండా పోరుకు సిద్ధమైంది. కాంగ్రెస్ మాత్రం తెలుగుదేశం, తెలంగాణ జన సమితి (టీజేఎస్), సీపీఐలను కూడగట్టి ప్రజా కూటమిని ఏర్పరిచినట్టు ప్రకటించింది. మరోపక్క బీజేపీ అన్ని స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది.
ఇవిగాక దళిత, బీసీ పార్టీలను కలుపుకుని సీపీఎం బహు జన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్‌ఎఫ్)ను రూపొందించింది. ప్రధాన ప్రత్యర్థిగా ఉండే ప్రజాకూటమి నామినే షన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తున్న సమయానికి కూడా పంపకాలు పూర్తి చేసుకోలేక చర్చోప చర్చల్లో మునిగి ఉండగా...టీఆర్‌ఎస్ నెలన్నరక్రితమే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారంలో సైతం అందరికన్నా ముందుంది. కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన టీజేఎస్‌ను పొత్తు పేరుతో రారమ్మని పిలిచిన కాంగ్రెస్...ఆ పార్టీకి చుక్కలు చూపింది. చేదు అనుభవాన్ని మిగిల్చింది. 8 సీట్లు ఇస్తామని చెప్పి, ఆ పార్టీకి కేటాయించిన స్థానాల్లో సొంత అభ్యర్థులకు బీ ఫారాలిచ్చి, చివరికి నాలుగే మిగిల్చి దాన్ని అయోమయంలో పడేసింది. టీజేఎస్ అధినేత కోదండరాం దీన్ని మోసమనో, నమ్మక ద్రోహమనో అభివర్ణించి ఉంటే ఆ పొత్తు కాస్తా అక్కడితో ముగిసిపోయేది. కానీ ఆయన సంయ మనం పాటించారు. కాంగ్రెస్‌కు కనికరం లేదని, అది తమను అవమానించిందని, ఉద్యమ దిగ్గ జాల భవిష్యత్తును కూడా తాము వదులుకోవాల్సివచ్చిందని వాపోయారు. అయినా జనం కోసం అన్నీ భరిస్తామంటున్నారు. మంచిదే. కానీ కూటమికి సంబంధించిన ‘కనీస ఉమ్మడి కార్యక్రమం’ ఎజెండా బాధ్యతను తీసుకున్నానని చెబుతున్న ఆయన ఆ విషయంలో ప్రజలకు దృఢమైన భరోసా ఇవ్వగలుగుతారా? ఇచ్చినా వారు నమ్మగలరా? సీట్ల పంపకాల్లో మీకు జరిగిందేమిటని, దానిపై ఏం చేయగలిగారని ఎదురు ప్రశ్నిస్తే ఏం జవాబిస్తారు?
ఏడెనిమిదేళ్లుగా రహస్య చెలిమితో కాలక్షేపం చేస్తూ వచ్చిన కాంగ్రెస్, తెలుగుదేశంల మధ్య సీట్ల సర్దుబాటులో సమస్యలు తలెత్తలేదు. తెలంగాణ ప్రజల్లో తమ పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో... అధినేత చంద్రబాబు నాయుడు ఇరుక్కున్న ‘ఓటుకు కోట్లు’ కేసుతో అది ఇంకెంతగా దిగ జారిందో తెలుగుదేశం స్థానిక నాయకులకు బాగా తెలుసు. అందుకే వారు ‘దక్కినకాడికి దక్కుడు’ సూత్రాన్ని పాటించి కిక్కురుమనకుండా ఉండిపోయారు. అయితే గియితే ఈ ‘బహిరంగ చెలిమి’ వల్ల నష్టపోయేది కాంగ్రెసే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాదాపు తొమ్మిదేళ్ల ఏలుబడిలో బాబు ఏం చేశారో తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఈ ప్రాంతాన్ని ఒక నిర్బంధ శిబిరంగా మార్చి, ‘తెలంగాణ’ పదం ఉచ్చరించినవారిపై నక్సలైట్ ముద్ర వేసి ఆయన సర్కారు చెలరేగిన తీరు జనం మస్తిష్కాలనుంచి ఇంకా చెరిగిపోలేదు.
గాయని బెల్లి లలిత మొదలుకొని పౌర హక్కుల నేతల వరకూ ఎందరినో పొట్టనబెట్టుకున్న, వేధింపులకు గురిచేసిన అనేకానేక ముఠాల వెనక ఏ శక్తులు పనిచేశాయో వారికి తెలుసు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ పోరాడిన రైతులపై బషీర్ బాగ్‌లో తుపాకులు గర్జించడం, అక్కడ నేలకొరిగినవారి స్మృతికి కనీసం స్థూపం కట్టుకునే అవ కాశం కూడా లేకుండా చేయడం తెలంగాణ ప్రజలకు గుర్తుంది. మారుమూల పల్లెసీమల్లో తల్లీ బిడ్డల క్షేమం కోసం అహర్నిశలూ పాటుబడే అంగన్‌వాడీ మహిళలు తమకు కనీస వేతనాలివ్వా లని, తమ బతుక్కి భరోసా కల్పించాలని అడగడానికొస్తే గుర్రాలతో తొక్కించడం ఇప్పటికీ పల్లెప ల్లెనా ఒక పచ్చి జ్ఞాపకం.
కరువుకాటకాల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నలపై కరెంటు చార్జీల కత్తిని ఝుళిపించి... కట్టలేనివారి కరెంటు మోటార్లు జప్తు చేయించడం గుర్తులేనిదె వరికి? ఆ రైతన్నలు దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు రూపాయి కూడా రాల్చకుండా వీధిన పడేయడం మరిచిపోయేంత చిన్న విషయమా? అంతెందుకు కూటమికి మద్ద తుగా ప్రచారం చేస్తానంటున్న గద్దర్ ఒంట్లో ఇప్పటికీ మిగిలిపోయిన తూటా దోషిగా చూపేదెవ రిని? ఈ తరంలో చంద్రబాబు గురించి తెలియనివారెవరైనా ఉంటే... అటువంటివారికి ఆంధ్రప్రదే శ్‌లో ఆయన సాగిస్తున్న పాలనే ప్రత్యక్ష సాక్ష్యం. తనను జనం పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉంచినా ఆయనలో రవ్వంతయినా మార్పు రాలేదని అక్కడ నిత్యం కనబడుతూనే ఉంది. రాష్ట్ర విభజన జరిగాక కూడా ఇలాంటి నాయకుడిని పొత్తు పేరుతో మళ్లీ ఇక్కడికి రానిస్తున్నారన్న అప కీర్తిని కాంగ్రెస్ మూటగట్టుకోక తప్పని దుస్థితి ఏర్పడింది. ఈ విషయంలో తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ రాగల రోజుల్లో ఎలా ఒప్పించగలదో, దీన్నెలా అధిగమించగలదో చూడాలి.
రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లతోసహా అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచార పర్వంలో ఎక్కడా కన బడని యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ మేడ్చల్‌లో శుక్రవారం జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. తెలంగాణ కల సాకారం కావడానికి ఆమె ప్రధాన కారకురాలని అందరికీ తెలుసు. కానీ ఆమె ప్రసంగంలో టీఆర్‌ఎస్ పాలనపై చేసిన విమర్శల్ని పరధ్యానంగా విన్నవారికి సోనియా ఏపీలో తెలుగుదేశం ఏలుబడి గురించి మాట్లాడుతున్నారేమిటన్న అనుమానం వస్తే అది వారి తప్పు కాదు. భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచారని, ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించారని, డ్వాక్రా సంఘాల మహిళల్ని, యువతను నిరాశానిస్పృహల్లోకి నెట్టారని, దళితులకు, ఆదివాసీలకు ఒరగబెట్టిందేమీ లేదని టీఆర్‌ఎస్ పాలనపై ఆమె చేసిన విమర్శలు సహేతుకమైనవే కావొచ్చు. కానీ ఈ అంశాలన్నిటా అత్యంత అధ్వాన్నంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాచిచంపాన పెడుతున్న బాబుతో ఇక్కడెలా చెలిమి చేశారని ప్రశ్నిస్తే ఆమె ఏం సంజాయిషీ ఇస్తారు? ప్రజల్ని వేధిస్తున్న ప్రధాన సమస్యల విషయంలో రాష్ట్రానికొక ప్రమాణాన్ని పాటించే పార్టీలను జనం విశ్వసిస్తారా? ఏదేమైనా తెలంగాణ ప్రజలు ఎంతో పరిణతి, వివేచన ఉన్నవారు. వారి తీర్పు ఎలా ఉంటుందో వచ్చే నెల 11 వరకూ వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment