సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీలు అధికార దురహంకారంతో మీడియాను భ్రష్టుపట్టించారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మీడియాపై ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముసుగు తొలగిందని, ఓటమి భయంతోనే పిచ్చి ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంగళవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘మీట్ ది ప్రెస్’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశం మీదున్న ప్రేమతో తాను చిన్నవయసులోనే నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరానని, అక్కడే సైనిక శిక్షణ పొంది మెరిట్ ర్యాంకులో పాసయ్యానని ఉత్తమ్ చెప్పారు. పాక్, చైనా సరిహద్దుల్లో మిగ్–21, మిగ్– 23 లాంటి అత్యాధునిక యుద్ధవిమానాలు నడిపిన అతికొద్దిమందిలో తానూ ఒకడినని గుర్తు చేసుకున్నారు. సియాచిన్‌లో మైనస్ 45 డిగ్రీల చలి లో, రాజస్తాన్ ఎడారిలో 55 డిగ్రీల ఎండలో తాను దేశం కోసం విధులు నిర్వహించానని అన్నారు.
మీడియాపై బెదిరింపులా?
పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో పాత్రికేయవృత్తి దయనీయంగా ఉందని, కేవలం అమెరికా, యూరోప్, భారత్‌లోనే మీడియా స్వతంత్రంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. కానీ, మోదీ, కేసీఆర్‌లు పత్రికలను, టీవీలను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి తమకు వ్యతిరేకంగా వార్తలు రాకుండా జాగ్రత్త పడుతున్నారని ఆరోపించారు. ఇది వ్యవస్థకు చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏనాడూ ఇలా వ్యవహరించలేదన్నారు. మీడియా విషయంలో కేసీఆర్ స్టిక్ అండ్ క్యారెట్ పద్ధతిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. పౌరుల ప్రాథమిక హక్కులను సైతం హరించి వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేయడం, ఇసుక మాఫియాను ప్రశ్నించిన నేరెళ్ల దళితులకు కరెంటు షాక్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం పట్ల కేసీఆర్ ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసన్నారు. టీవీచానళ్లను 10 కిలోమీటర్ల లోతుకు తొక్కుతాన్న కేసీఆర్ కుటుంబాన్ని 10 కిలోమీటర్ల లోతుకు తొక్కాలని ఉత్తమ్ అన్నారు.
మహాకూటమి గెలుస్తుందనే...
మహాకూటమి గెలుస్తుందన్న భయంతోనే కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు. తాము 99 స్థానాల్లోనే పోటీ చేస్తున్నా.. ఇంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. చేతనైతే మోదీపై తెలంగాణ హక్కుల కోసం పోరాడగలరా.. అని కేసీఆర్‌కు సవాలు విసిరారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు పరిశ్రమల సాధన కోసం ఎందుకు పోరాడటం లేదని నిలదీశారు. మోదీ పేరు వింటేనే కేసీఆర్ లాగులు తడుస్తాయని ఎద్దేవా చేశారు. కోట్లాది రూపాయలతో భవంతులు నిర్మించుకున్నారని, ఖరీ దైన కార్లు, ప్రైవేటు విమానాల్లో తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రణాళిక
కేసీఆర్ ప్రభుత్వం విలేకరుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఉత్తమ్ అన్నారు. తాము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో విలేకరుల సంక్షేమానికి కావాల్సిన విధానాన్ని రూపొందిస్తామని హామీ ఇచ్చారు. విలేకరులకు ఇళ్లు, వారి పిల్లలకు విద్య, బీమా తదితర సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రెస్‌క్లబ్‌ను దేశంలోని అత్యున్నత ప్రెస్‌క్లబ్‌లో ఒకదానిలా మార్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. తాను సీఎం అయినా, కాకపోయినా.. ఈ హామీ బాధ్యత తనదేనని స్పష్టంచేశారు.
సోనియాది త్యాగధనుల కుటుంబం...
ఓడిపోతానన్న నిస్పృహలోనే కేసీఆర్ సోనియా గాంధీని, కేటీఆర్ రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. 30 ఏళ్లుగా సోనియా, 15 ఏళ్లుగా రాహుల్ రాజకీయాల్లో ఉన్నారని, వారు కోరుకుంటే.. క్షణాల్లో ప్రధానమంత్రి పదవి చేపట్టేవారని పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలే ఊపిరిగా బతికే త్యాగధనుల కుటుంబానికి పదవులు ఓ లెక్క కాదని తెలిపారు. త్యాగధనుల కుటుంబం అనడానికి ఇందిరా, రాజీవ్ మరణాలే నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. తాము అధికారంలోకి వస్తే.. తిరిగి ఓయూకు పునర్వైభవం కల్పిస్తామని, ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఒకటిగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలకు తిరిగి గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు. రాహుల్ సభలో టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు తమ పార్టీలో చేరతారని సంకేతాలు ఇచ్చారు. ఆరునూరైనా మేనిఫెస్టో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రచారానికి ఏపీ నేతలు కూడా వస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment