సాక్షి ప్రతినిధి, నెల్లూరు : మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి హర్ట్ అయ్యారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి రమ్మని అవమానిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమం మధ్యలోనే ఇంటికి వచ్చేశారు. వెంట నే మంత్రి నారాయణ ఆదాల ఇంటికి వెళ్లి బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టారు. ఈ ఘటన అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. శనివారం నగరంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో స్వర్ణాల చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఇరుగాళమ్మ గుడి వద్ద నిర్వహించారు.
నుడా నిధులతో చేపట్టే ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పి. నారాయణతోపాటు పార్టీ నెల్లూరురూరల్ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, పార్టీ నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. శంకుస్థాపన శిలాఫలకంలో ఇన్‌చార్జి హోదాలో ఉన్న ఆదాల పేరు లేకపోవడం.. ఆనంతరం నిర్వహించిన సభలో వేదిక పైకి ఆదాలను ఆలస్యంగా పిలవడంపై ఆయన హర్ట్ అయ్యారు. దీంతో ఆదాల వేదికపైకి వెళ్లకుండానే తిరిగి ఇంటికి వచ్చేశారు. పిలిచి అవమానించారని ఆదాల అనుచరులు కూడా అక్కడి నుంచి వచ్చేశారు.
ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో మంత్రి నారాయణ సమావేశం పూర్తికాగానే నేరుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇంటికి చేరుకున్నారు. బుజ్జగింపుల పర్వానికి తెర తీశారు. ఇద్దరు ఏకాంతంగా గంటకు పైగా సమావేశమయ్యారు. కాసేపటికి కురుగొండ్ల రామకృష్ణ వచ్చి ఆదాలతో మంతనాలు నిర్వహించారు. మొత్తం మీద ఆదాల ఆగ్రహించిన వ్యవహారం అధికార పార్టీలో చర్చనీయాశంగా మారింది. నుడా చైర్మన్ కోటంరెడ్డి తీరుపై ఆదాల మంత్రి నారాయణ వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగా పిలిచి అవమానించారని ఆదాల అనుచరులు మంత్రి ఎదుట వాపోయారు.
నేలటూరు ఎపిసోడ్‌కు ప్రతీకారం
నెల్లూరు రూరల్ వావిలేటిపాడు, మాధరాజుగూడురు వద్ద నేలూటూరు పునరావసా కాలనీ శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 12న జరిగింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాజీ మంత్రి ఆదాల నివాసానికి వచ్చి ఇరువురు మాట్లాడుకొని మరీ వెళ్లి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. నేలటూరు పునరావాస కాలనీ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు వేయలేదు. అది నెల్లూరు రూరల్ పరిధిలో జరగటం మాజీ మంత్రి ఆదాల తన పేరు వేయించలేదనే భావనతో నుడా చైర్మన్ ఆదాల పేరును శిలాఫలకంలో వేయకుండా, వేదికపైకి ఆలస్యం పిలిచేలా చేశారని ఇదంతా నేలటూరు ఎపిసోడ్‌కు ప్రతీకారం అని ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment