సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నియోజకవర్గంలో గ్రూప్ మీటింగ్‌లు ఏంటి.. దీని వెనుక ఎవరున్నారు.. ఎవరి ప్రోత్సాహంతో ఇవన్నీ చేస్తున్నారో అన్నీ తెలుసు.. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారో అందరికీ తెలుసు.. కావాలని నన్నే టార్గెట్ చేస్తుంటే చూస్తూ ఉరుకోను.. నేరుగా సీఎం చంద్రబాబునాయుడు వద్దే పంచాయితీ పెట్టి వీళ్లందరి వ్యవహారం చూస్తా’నంటూ మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డి ఘాటుగా హెచ్చరించారు. సోమవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫోన్ చేసి సీరియస్ అయినట్లు సమాచారం.
ఆదివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ సమావేశం పేరుతో అసమ్మతి గళం తారాస్థాయిలో వినిపించిన విషయం తెలిసిందే. సమావేశానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితోపాటు నామినేట్ పదవుల్లో ఉన్న పలువురు నేతలు హాజరయ్యారు. మాజీ మంత్రి ఆదాల ప్రభాకరరెడ్డిని టార్గెట్ చేస్తూ సమావేశం జరగడంపై రాజకీయంగా జిల్లాలో చర్చ జరిగింది. దీనిపై ఆదాల శిబిరం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జిల్లాలో పార్టీ ముఖ్యనేతల తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం వద్ద తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు.
మంత్రి సోమిరెడ్డి ప్రోత్సాహంతోనే కిలారి సమావేశం నిర్వహించారని రగిలిపోతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఆయనకు గుర్తురాని పార్టీ ఇప్పుడే ఎందుకు గుర్తువచ్చిందని ప్రశ్నిస్తున్నారు. కిలారి బంధువులకు కాంట్రాక్ట్ వర్కులు ఇవ్వకపోవడంతోనే ఇదంతా చేశాడని ఆదాల శిబిరంలో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే 2000లో పార్టీలోకి వచ్చిన వాళ్లకి పార్టీ బాగా ఉపయోగపడుతోందని, పదవులన్నీ వారికే ఇస్తున్నారని, వారు పార్టీ కోసం చేసింది తక్కువేనని విమర్శిస్తున్నారు. మంత్రులు సైతం ఇలాంటి వారినే ప్రోత్సహిస్తున్నారని, వారి సహకారంతోనే కులరాజకీయాలను సైతం సాగిస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
అన్నింటికీ ఆయన్నే అడగాలంటే ఎలా?
కనీసం వీఆర్‌ఓ బదిలీ కూడా చేయించుకోలేని పరిస్థితి.. అన్నింటికీ పట్టాభి చెప్పాలంటే ఇక మనం ఏం చేయాలి.. కానీ మమ్మల్నే టార్గెట్ చేసి పనులు, బదిలీలు, ఇళ్ల స్థలాలు అన్నీ చేసుకుంటున్నట్లు ప్రచారం చేస్తున్నారు.. దీనిపై సీఎంతో మాట్లాడి ఎవరెవరు ఏంచేశారో అన్నీ ఆధారాలతో సహా అందజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే సమావేశం నిర్వహించిన కిలారి వెంకటస్వామినాయుడుతోపాటు అందరిపై చర్యలు తీసుకోవాలని, రెండు మూడు రోజుల్లోనే దీనిపై తేల్చుకుంటామని అనుచరులకు ఆదాల చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment