జిల్లాలో ఎన్నికల ‘రాజీ’కీయం మొదలైంది. ఎన్నికల వేడి ప్రారంభం కావడంతో అధికార పార్టీలో పరస్పరం కలహించుకునే ఇద్దరు నేతలు భేటీ కావటం, తర్వాత ఒకే కార్యక్రమంలో పాల్గొనడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బాహ్యంగా ఎడముఖం.. పెడముఖంగా ఉన్న మాజీ మంత్రి ఆదాల, మంత్రి సోమిరెడ్డి అంతర్గతంగా ఉప్పు..నిప్పులా ఉండే వీరు ఒక్కసారిగా ఏకమై ఏకాంతంగా చర్చలు జరపడం ఆ పార్టీ నేతలే ఇంకా తేరుకోలేకున్నారు. సోమిరెడ్డి, ఆదాల మధ్య రాజకీయ సయోధ్య కుదిరిందా? లేక ఎన్నికల ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీలో మంత్రి సోమిరెడ్డికి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి మధ్య కొనేళ్లుగా వార్ నడుస్తుంది. జిల్లాలో ఇద్దరి మధ్య మొదలైన పంచాయితీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వరకు వెళ్లింది. తాజాగా కూడా గత నెలలో మంత్రి సోమిరెడ్డిపై ఆదాల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు నేతలు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రస్తుతం ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా సర్వేపల్లి నుంచి మళ్లీ మంత్రి పోటీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే పార్టీలో మాత్రం అంతర్గంతగా సోమిరెడ్డి నియోజకవర్గం మారతారనే ప్రచారం సాగుతోంది. సర్వేపల్లి నియోజకవర్గంలోని నేలటూరులో శుక్రవారం పునరావాస కాలనీకి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం ఉదయం సోమిరెడ్డి నగరంలోని ఆదాల ప్రభాకర్‌రెడ్డి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు.
ఇద్దరు కొద్ది సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నాక మంత్రితో కలిసి ఆదాల కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. వాస్తవానికి ఇద్దరు నేతలు ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఎలాంటి ముందస్తు చర్చలు లేకుండా భేటీ కావడంతో ఏం జరుగుతుందనే చర్చ సర్వతా సాగుతుంది. గత నెలలో కూడా మాజీ మంత్రి ఆదాల మంత్రి సోమిరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు.. మూడు సార్లు నేరుగా సీఎంకు మంత్రి సోమిరెడ్డి తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమిరెడ్డి వర్గంలోని కొందరు నేతలు ఆదాల పార్టీ మారతారనే ప్రచారం బలంగా చేశారు. దీంతో ఇద్దరి మధ్య గతం నుంచే ఉన్న విభేదాలు మరింత తారా స్థాయికి చేరటంతో ఎవరికి వారుగా గ్రూపు రాజకీయాలు సాగిస్తున్నారు. పార్టీలో అభ్యర్థుల ఖరారు ప్రక్రియ మొదలైంది.
దీంతో మొదటి జాబితాలోనే స్థానం సంపాదించటానికి అధికార పార్టీ నేతలు కష్టాలు పడుతున్నాయి. దీనికి తోడు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జిల్లాలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సర్వేపల్లిలో ఆదాలకు కొంత వర్గం ఉంది. సహజంగానే ఆదాల మంత్రి సోమిరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే క్రమంలో ఆయన వర్గం కూడా పార్టీలో ఉన్నప్పటికి సోమిరెడ్డికి దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో గొడవలు ఎందుకనే ధోరణిలో నేతలు అడుగులు వేస్తున్నారు. అయితే అరగంట సేపు భేటీ అయినా పూర్తిస్థాయిలో చర్చ జరగలేదని సమాచారం. మళ్లీ కొద్ది రోజుల్లో భేటీ కావాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment