తలసేమియా, హీమోఫిలియా వ్యాధుల చికిత్సకు ఆర్థిక సాయం | Financial support for the treatment of Thalassemia and Hemophilia | Sakshi
Sakshi News home page

తలసేమియా, హీమోఫిలియా వ్యాధుల చికిత్సకు ఆర్థిక సాయం

Published Sat, Dec 7 2019 4:03 AM | Last Updated on Sat, Dec 7 2019 4:03 AM

Financial support for the treatment of Thalassemia and Hemophilia - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తలసేమియా, హీమోఫిలియా, సికిల్‌సెల్‌ ఎనీమియా తదితర వ్యాధుల చికిత్సకు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా ఔషధాలకు, రక్త సంబంధిత అవసరాలకు వీలుగా కేంద్రం సాయం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్‌ హర్షవర్దన్‌ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంట్‌ తదితర చికిత్స అవసరమైనప్పుడు రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్‌ఏఎన్‌), ఆరోగ్య మంత్రి విచక్షణా నిధి, ప్రధాన మంత్రి రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.15 లక్షల వరకు సాయం అందుతుందని వివరించారు. మరో ఉప ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ మంగళగిరి ఎయిమ్స్‌ పూర్తిస్థాయి కార్యకలాపాలు చేపట్టే దశలో ఈ వ్యాధులకు సంబంధించి అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

2022 నాటికి హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా ఆరోగ్య కేంద్రాలు
ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), ఆరోగ్య ఉప కేంద్రాలను 2022 డిసెంబర్‌ నాటికి హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే తెలిపారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అసంక్రమిత వ్యాధులు, మానసిక ఆరోగ్యం, ఈఎన్టీ, కంటి వైద్యం, దంత వైద్యం, ట్రామాకేర్‌ వంటి చికిత్సలన్నీ ఉచితంగా అందరికీ అందించనున్నట్టు తెలిపారు. అయితే ఆయుష్మాన్‌ భారత్‌ అమలులో అనేక సవాళ్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య కేంద్రాల సంఖ్య తక్కువ
తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ), కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు (సీహెచ్‌సీ) ఉండాల్సిన సంఖ్య కంటే తక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఏపీలో 1,197 పీహెచ్‌సీలు అవసరం కాగా 1,147 మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించారు. సీహెచ్‌సీలు 299 అవసరం కాగా 193 మాత్రమే ఉన్నాయని వివరించారు. ఏపీలో పీహెచ్‌సీ స్థాయిలో 222 వైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సీహెచ్‌సీ స్థాయిలో 149 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

అంధత్వం, వినికిడి లోపం నివారణ పథకం కింద రూ.39 కోట్లు
అంధత్వం, వినికిడి లోపం నివారణ జాతీయ పథకం కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.39 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

పీఎంఎంవీవై కింద 3.25 లక్షల మందికి ప్రయోజనం
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) కింద ఆంధ్రప్రదేశ్‌లో 2018–19లో 3.25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కోటగిరి శ్రీధర్, చంద్రశేఖర్‌ బెల్లాన అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

ఉపాధి హామీ సగటు పని దినాలు 58.32
ఉపాధి హామీ పథకంలో ఏపీలో 2016–17లో ఒక్కో కుటుంబానికి సగటు పని దినాలు 51.49, 2018–19లో 58.32 లభించాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement