వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం | Mithun Reddy Says That We oppose privatization of Vizag Steel Plant | Sakshi
Sakshi News home page

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం

Feb 9 2021 4:54 AM | Updated on Feb 9 2021 7:29 AM

Mithun Reddy Says That We oppose privatization of Vizag Steel Plant - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ తగదు. దీని ప్రైవేటీకరణ దిశగా వేసే ఏ అడుగైనా రాష్ట్రానికి నష్టమే. అందువల్ల ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం..’ అని వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రణాళికను పరిగణనలోకి తీసుకుని ప్లాంటును పరిరక్షించాలని, పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికను పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఏపీలో ఉన్న అతి పెద్ద ప్రభుత్వ రంగ యూనిట్‌ ఇది. ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉపాధి అందిస్తోంది. పరోక్షంగా మరో 20 వేలకు మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో దశాబ్దకాలం పోరాటం తర్వాత ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దీనిపై ఏపీ ప్రజలకు అపారమైన సెంటిమెంట్‌ ఉంది. అందువల్ల ప్రధాన మంత్రికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఇప్పటికే దీనిపై లేఖ రాశారు. స్టీల్‌ ప్లాంటు తెలుగు ప్రజల సంకల్పానికి సాక్ష్యంగా నిలుస్తుందని పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంటును కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఉక్కు శాఖతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. ప్రస్తుతం కంపెనీ నెలకు రూ. 200 కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. 6.3 మిలియన్‌ టన్నుల మేర వార్షిక ఉత్పత్తి చేస్తోంది. ఇదే తరహా పనితీరు స్థిరంగా కొనసాగాలి. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి..’ అని విజ్ఞప్తి చేశారు. 

విద్యుత్‌ ఒప్పందాల రద్దుకు అనుమతి ఇవ్వండి 
‘గత టీడీపీ ప్రభుత్వం యూనిట్‌ విద్యుత్‌ గరిష్టంగా రూ.5.90ల చొప్పున కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు మేము యూనిట్‌ ధరను రూ.2.49కి తీసుకొచ్చాం. గణనీయమైన ఆదా చేస్తున్నాం. అందువల్ల కుడిగి, వల్లూరు థర్మల్‌ ప్లాంట్లతో డిస్కమ్‌లు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వండి..’ అని కోరారు. అవి సరెండర్‌ చేస్తే ఏటా రూ. 325 కోట్ల మేర రాష్ట్రానికి ఆదా అవుతుందని తెలిపారు. 

ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలి 
‘ప్రత్యేక హోదా హామీ అమలు చేయాలి. విభజన చట్టంలో పేర్కొన్న ఇతర హామీలు కూడా నెరవేర్చాలి..’ అని మిథున్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని తెలిపారు.  మతపరమైన రాజకీయాలకు తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. కాగా, ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించి కేంద్రం నుంచి సమాధానం కావాలని మిథున్‌రెడ్డి కోరారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement