సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో భాగంగా ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి జోరును పెంచిన టీఆర్‌ఎస్‌కు అసమ్మతి సెగ తగులుతోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమ అనుచరులతో సమావేశమవుతూ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే వరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తనకు టికేట్ కేటాయించకపోవడంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. రెండు రోజుల్లో తన భవిష్యత్తు కార్యచరణ ఏంటో ప్రకటిస్తానన్నారు. మిర్యాలగూడ టీఆర్‌ఎస్ ఇంచార్జ్ అమరేందర్ రెడ్డి సోమవారం తన అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీ కోసం పనిచేసిన తనకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన భాస్కర్ రావుకు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. (చదవండి: తెలంగాణ.. కల్వకుంట్ల ఇల్లు కాదు : కొండా సురేఖ)
నల్గొండ జిల్లాపరిషత్ ఛైర్మన్ బాలునాయక్ సైతం తన అనచరులతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. బాలునాయక్ కాంగ్రెస్ పార్టీ తరపున ఛైర్మన్‌గా ఎన్నికై టీఆర్‌ఎస్‌లో చేరారు. దేవరకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌తో బాలునాయక్‌కు విభేదాలున్నాయి. ఇద్దరు పలుసందర్భాల్లో పోటాపోటి ప్రకటనలు కూడా ఇచ్చారు. ఈ తరుణంలో ఈ టికెట్ తనకే వస్తదని ఆశించిన బాలునాయక్‌కు నిరాశే ఎదురైంది. ఇక బాలునాయక్ 2009లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్థానిక సంస్థాగత ఎన్నికల్లో నల్గొండ జిల్లాపరిషత్ ఛైర్మన్ ఎస్టీకి రిజర్వ్ కావడంతో ఆయన ఎమ్మెల్యే స్థానాన్ని వదులుకొని జెడ్పీటీసీగా పోటీచేసి ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో టీఆర్‌ఎస్ కారు ఎక్కారు. ప్రస్తుతం మళ్లీ సొంతగూటికే చేరే ప్రయత్నం చేస్తున్నారు.
తుంగతుర్తి టికెట్ తమ నేతకే కేటాయించాలని కార్పొరేషన్ ఛైర్మన్ మందుల సామెల్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. ఈ స్థానాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్‌కు కేటాయించారు. ఇక ఈ టికెట్‌ను తెలంగాణ జాగృతి నేత రాజీవ్‌సాగర్ కూడా పోటీపడుతున్నారు. ఆయన వర్గం కూడా కిశోర్‌కు ప్రతికూలం కానుంది. దీంతో ఇక్కడి వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇక నాగర్జున సాగర్ టికెట్ నోముల నర్సింహయ్యకు కాకుండా స్థానికులకు కేటాయించాలని నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్సీ గుడ్‌బై!
నిజామాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ సీ భూపతి రెడ్డి గుడ్‌బై చెప్పె యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీకి రాజీనామా చేస్తూ బహిరంగ లేఖను విడుదల చేసే అవకాశం ఉందని ఆయన వర్గీయులు వాపోతున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీ డి శ్రీనివాస్‌తో పాటు ఆయన వర్గానికే చెందిన భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ అధినేత కేసీఆర్‌కు ఎంపీ కవిత వర్గం, జిల్లానేతలు తీర్మానం పంపిన విషయం తెలిసిందే. దీంతో సొంతగూటికి చేరాలని నిశ్చయించుకున్న డీఎస్‌తో పాటు భూపతి రెడ్డి సైతం వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వీరి చేరికకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, భూపతి రెడ్డికి నిజామాబాద్ రూరల్ టికెట్ ఖారరు అయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment