సాక్షి, హైదరాబాద్: ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులపై తిరుగుబాటు బావుటా ఎగరవేసిన రెబల్స్ ఇప్పుడు కొండెక్కి కూర్చున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరితేదీ కావడంతో ససేమిరా బరిలోంచి తప్పుకునేది లేదని పలువురు అసమ్మతి నేతలు తమ పార్టీలకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రధాన పార్టీలూ రెబల్స్‌ను బుజ్జగించే పనిలో పడ్డాయి. ఇప్పుడు సహకరిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని భరోసా ఇస్తున్నాయి. అగ్ర నేతలు బరిలోకి దిగి బుజ్జగిస్తుండటంతో పలుచోట్ల రెబల్స్ తప్పుకోవడానికి సంసిద్దత వ్యక్తం చేస్తుండగా.. ఇంకొన్ని నియోజకవర్గాల్లో పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని అసమ్మతి నేతలు భీష్మించి కూర్చున్నారు.
నియోజకవర్గాల వారీగా రెబల్స్‌గా నామినేషన్స్.. ఉపసంహరణ
జంగయ్య యాదవ్(కాంగ్రెస్- మేడ్చల్): రెబెల్స్‌ను బుజ్జగించే చర్యల్లో కాంగ్రెస్ అధిష్టానం సఫలీకృతమవుతోంది. మేడ్చల్ నుంచి కాంగ్రెస్ రెబెల్‌గా నామినేష్ వేసిన జంగయ్య యాదవ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఉదయం నుంచి కాంగ్రెస్ పెద్దలు జంగయ్య యాదవ్‌తో జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. నామినేషన్ ఉపసంహరించుకొని, కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తానని కాంగ్రెస్ పెద్దలకు జంగయ్య యాదవ్ హామీ ఇచ్చారు.
ఎర్రబెల్లి ప్రదీప్‌రావు(టీఆర్‌ఎస్- వరంగల్ తూర్పు): వరంగల్ తూర్పు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నన్నపునేని నరేందర్‌కు ఊరట కలిగించే విషయం. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ రెబెల్‌గా నామినేషన్ వేసిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అధిష్టానం ఆదేశాల మేరకు వెనక్కి తగ్గారు. పోటీ నుంచి తప్పుకుంటున్నానని, అదేవిధంగా నరేందర్ గెలుపు కోసం, పార్టీ కోసం కష్ట పడతానని పేర్కొన్నారు.
బండ కార్తీక రెడ్డి(కాంగ్రెస్- సికింద్రాబాద్): పార్టీకి విధేయులరాలిగా పేరొందిన బండ కార్తీక రెడ్డి ఈ ఎన్నికల్లో అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌పై తిరుగుబావుట ఎగురవేశారు. కాంగ్రెస్ రెబెల్‌గా సికింద్రాబాద్ నుంచి పోటీకి దిగారు. దీంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రంగంలోకి దిగి కార్తీక రెడ్డిని బుజ్జగించారు. అధికారంలోకి వచ్చాక తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నామినేషన్ ఉపసంహరించుకుంటానని తెలిపారు. అంతేకాకుండా కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తానని ఉత్తమ్‌కు హామీ ఇచ్చారు.
నాయిని రాజేందర్ రెడ్డి( కాంగ్రెస్- వరంగల్ పశ్చిమ): ఎట్టకేలకు ఏఐసీసీ మంతనాలు ఫలించడంతో కాంగ్రెస్ రెబెల్ నేత నాయిని రాజేందర్ రెడ్డి శాంతించారు. వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ రెబెల్‌గా వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకుంటానని అధిష్టానానికి తెలియజేశారు. అంతేకాకుండా కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు.
నరాల రత్నాకర్ (కాంగ్రెస్- నిజామాబాద్ అర్బన్): కొంతకాలంగా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసుకుంటూ వచ్చిన తనకు ఉద్దేశ పూర్వకంగానే టికెట్ రాకుండా కొందరు అడ్డుకున్నారని కాంగ్రెస్ రెబెల్ నేత నరాల రత్నాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన అధిష్టానంపై తిరుగుబావుట ఎగురవేశారు. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయనను బుజ్జగించేందుకు మాజీ ఎంపీ మధుయాష్కీ రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా రత్నాకర్ కంటతడి పెట్టుకున్నారు. జాతీయ నేతలు రత్నాకర్‌తో మాట్లాడి కూటమికి సహకరించాలని కోరినట్టు సమాచారం.
కొత్త మనోహర్ రెడ్డి(టీఆర్‌ఎస్- మహేశ్వరం): టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీగల కృష్టారెడ్డి ఊపిరి పీల్చుకున్నారు. టీఆర్‌ఎస్‌కు రెబల్‌గా నామినేషన్ వేసిన మనోహర్ రెడ్డిని స్వయంగా కేసీఆర్, కేటీఆర్ పిలుపించుకొని.. ఈసారి టీకేఆర్‌ను గెలిపించాల్సిందిగా కోరడంతో ఆయన మెత్తబడ్డారు. తీగలకు మద్దతుగా ప్రచారం చేస్తానని అధిష్టానానికి, నామినేషన్ ఉపసంహరించుకుంటానని హామీ ఇచ్చారు.
సూర్యనారాయణ గుప్త (బీజేపీ- నిజామాబాద్ అర్బన్): బీజేపీలోనూ రెబల్స్ బెడద తప్పటం లేదు. నిజమాబాద్ అర్భన్ టికెట్ ఆశించి భంగపడ్డ స్థానిక నేత సూర్యనారాయణ గుప్తా అసంతృప్తితో శివసేన అభ్యర్థిగా, బీజేపీ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన బీజేపీ అధిష్టానం ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది.
కార్తీక్ రెడ్డి(కాంగ్రెస్- రాజేంద్ర నగర్): మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారసుడిగా ఈ ఎన్నికల్లో రాజకీయల్లోకి రావలనుకున్నారు. అయితే కుంటుంబం నుంచి ఒకరికే టికెట్ అనండంతో ఈ సారి ఆయనకు టికెట్ వరించలేదు. కాంగ్రెస్ రెబల్‌గా రాజేంద్ర నగర్‌లో నామినేషన్ వేశారు. దీంతో రంగంలోకి దిగిన అధిష్టానం కార్తీక్ రెడ్డిని బుజ్జగించింది. తల్లి కోసం పోటీ నుంచి తప్పుకున్నారు.
భిక్షపతియాదవ్(కాంగ్రెస్- శేరిలింగంపల్లి): కాంగ్రెస్ జాతీయ నేత అహ్మద్ పటేల్ బుధవారం రాత్రి భిక్షపతి యాదవ్‌ను కలిసి నామినేషన్ ఉపసంహరించుకోవాలని కోరారు. అధికారంలోకి వచ్చాక తగిన గౌరవం కల్పిస్తామని పటేల్ హామీ ఇచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన భిక్షపతి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
శశిధర్ రెడ్డి(కాంగ్రెస్- మెదక్): కేసులతో అధికార పార్టీని ముప్పు తిప్పలు పెట్టిన శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించకపోవడం నిజంగా షాకే. అయితే నియోజక వర్గ కార్యకర్తల కోరిక మేరకు రెబల్‌గా నామినేషన్ వేశారు. అయితే కాంగ్రెస్ జాతీయ నాయకులు బుజ్జగింపులకు దిగారు. దీంతో మెత్తబడిన ఆయన పోటీ నుంచి ఉపసంహరణకు ఓకే అన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment