పీసీసీ చీఫ్ ఉత్తమ్ సమక్షంలో చేతులు కలిపిన రోహిణ్‌రెడ్డి, శ్రవణ్
సాక్షి,సిటీబ్యూరో/మేడ్చల్ జిల్లా: గ్రేటర్‌లో ప్రధాన పార్టీల టికెట్లు ఆశించి భంగపడిన నేతలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమను కాదన్నందుకు రెబల్స్‌గా బరిలోకి దిగిన పలువురు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ససేమిరా అంటున్నారు. దీంతో ఆయా పార్టీల నుంచి అధికారికంగా బరిలో నిలిచిన అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అసంతృప్తులను బుజ్జగించేందుకు ముఖ్యనేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రధాన నాయకులు ఇంటికే వచ్చి అడగడంతో ఆయా పార్టీల్లోని కొందరు రెబల్స్ మెత్తబడ్డా.. మరికొందరు మాత్రం వెనక్కి తగ్గేందుకు ఏమాత్రం అంగీకరించడం లేదు. కూకట్‌పల్లి నుంచి టీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవడంతో పన్నాల హరీష్‌రెడ్డి బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు.
ఆయన భార్య కావ్యారెడ్డి టీఆర్‌ఎస్ నుంచి బాలాజీ నగర్ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఇక మేడ్చల్ నుంచి నక్కా ప్రభాకర్‌గౌడ్‌కి టీఆర్‌ఎస్ మొండిచేయి చూపడంతో బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ టికెట్ ఆశించి నిరాశకు గురైన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆమెతో కాంగ్రెస్ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ఆమె బరిలో ఉంటారా..? నామినేషన్ ఉపసంహరించుకుంటారా ? అన్నదిసస్పెన్స్‌గా మారింది. అంబర్‌పేట్ నుంచి వనం రమేష్, ఖైరతాబాద్ నుంచి బీఎన్‌రెడ్డిలు టీడీపీ తరఫున నామినేషన్ వేసి తామూ బరిలో ఉంటున్నామని సంకేతాలు పంపుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి వీరిలో ఎందరు వెనక్కి తగ్గుతారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థికి ‘రెబల్’ గుదిబండగా మారింది. టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్ స్వయంగా మొవ్వ సత్యనారాయణ ఇంటికి వెళ్లి ప్రచారంలో పాల్గొనాలని కోరినా ఫలితం లేకుండా పోయింది.
బుజ్జగింపులపై కాంగ్రెస్ దృష్టి
కాంగ్రెస్ అసంతృప్తుల బుజ్జగింపుపై దృష్టి సారించింది. ఏకంగా ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కి, సలీం అహ్మద్, శ్రీనివాసన్, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీలు రంగంలోకి దిగి అసంతృప్తి, అసమ్మతి వాదులతో చర్చిస్తున్నారు.
♦ శేరిలింగంపల్లి అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ను పునరాలోచించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సూచించారు. మంగళవారం భిక్షపతి యాదవ్‌ను మసీద్‌బండలోని ఆయన నివాసంలో కలిశారు. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అధిష్టానం పంపిస్తే బుజ్జగింపు కోసం తాను రాలేదని, భిక్షపతితో ఉన్న అనుబంధంతోనే వచ్చానని స్పష్టం చేశారు. 40 ఏళ్లుగా ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తున్న భిక్షపతికి టికెట్ ఇవ్వకపోవడం ఏంటని శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జైపాల్‌రెడ్డి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
♦ ఖైరతాబాద్ కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేసిన డాక్టర్ సి. రోహిణ్‌రెడ్డి వెనక్కి తగ్గి ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మంగళవారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసంలో ఏఐసీసీ కార్యదర్శులు మధుయాష్కి, సలీం అహ్మద్, శ్రీనివాసన్ తదితరులు ఏర్పాటు చేసిన సమావేశంలో రోహిణ్‌రెడ్డిని ఒప్పించగలిగారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ ఎమ్మెల్యే కాలనీలోని రోహిణ్‌రెడ్డి నివాసానికి వెళ్లి తనకు సంపూర్ణ మద్దతు కోరారు. ఇద్దరూ కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసానికి వెళ్లగా అక్కడ అరగంట పాటు జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయి.
♦ రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్ కార్తీక్‌రెడ్డి సైతం మెత్తబడ్డారు. టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి ఫలితం దక్కకపోవడంతో నైరాశ్యానికి గురైన కార్తీక్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, తన రాజీనామా అంశం మహేశ్వరం నుంచి పోటీలో ఉన్న తల్లి సబితారెడ్డిపై ప్రభావం చూపుతుందని, పార్టీకి రెండు విధాలా నష్టమని పార్టీ పెద్దలు బుజ్జగింజడంతో వెనక్కి తగ్గారు.
♦ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్స్ అభ్యర్థులు కూడా వెనక్కి తగ్గారు. టికెట్ ఆశించి భంగపడి నామినేషన్ వేసిన ఆదం ఉమాదేవి తన నిర్ణయం మార్చుకున్నారు. బరిలో నుంచి తప్పుకొని కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్ధతు ప్రకటించారు.
♦ అంబర్‌పేట సీటు సర్దుబాటు కాక నామినేషన్ వేసిన టీడీపీ నేత, బిల్డర్ ప్రవీణ్ కూడా తన నిర్ణాయాన్ని మార్చుకున్నారు. భవిష్యత్‌లో న్యాయం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇవ్వడంతో మెత్తబడ్డారు. నామినేషన్ ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు.
మేడ్చల్‌లో పరిస్థితి ఇదీ..
ఈ జిల్లాలోనూ ప్రధాన పార్టీల అభ్యర్థులను రెబల్స్ బెడద ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వారిని ఏదోవిధంగా బుజ్జగించే చర్యలకు శ్రీకారం చుట్టారు. నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువు ఉండడంతో ఆ పనిలో నిమగ్నమయ్యారు.
♦ మేడ్చల్ నుంచి కాంగ్రెస్ రెబల్‌గా పోటీలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ తోటకూరి వజ్రేష్ యాదవ్(జంగయ్య యాదవ్)కు ఎమ్మెల్సీ లేదా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తామని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, రేవంత్‌రెడ్డి అభయం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నా, అందులో వాస్తవం లేదని ఆయన అనుచరులు అంటున్నారు. టీడీపీ నుంచి చేరిన సమయంలో రేవంత్ గానీ, కేఎల్‌ఆర్ గానీ మాట నిలబెట్టుకోలేదన్న విషయాన్ని ఆయన అనుచరులు గుర్తు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేసిన నక్కా ప్రభాకర్‌గౌడ్ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
♦ మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రెబల్‌గా బి.సురేష్‌యాదవ్ పోటీలో ఉన్నారు.
♦ ఉప్పల్‌లో కాంగ్రెస్ రెబల్స్‌గా మేకల శివారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి బరిలోకి దిగారు.
♦ కూకట్‌పల్లిలో కాంగ్రెస్ నేతలు గొట్టిముక్కల వెంగళరావు, టీఆర్‌ఎస్ నుంచి రెబల్‌గా హరీష్ చంద్రారెడ్డి పోటీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment