మండల, జిల్లా పరిషత్ పోరు వేడెక్కెంది. మొదటి విడత నామినేషన్ల పక్రియ పూర్తికాగా, గురువారం అధికారులు వచ్చిన నామినేషన్లను పరిశీలించారు. కాగా పోటీలో రెబల్స్ దడ పుట్టిస్తున్నారు. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎంపీటీసీ స్థానాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. తొలివిడత ఎన్నికలు జరిగే ఆరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన నేతలు రంగంలోకి దిగారు. బుజ్జగింపుల పర్వంలో నిమగ్నమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎవరు బరిలో ఉంటారో.. ఎవరు తప్పుకొంటారో వేచి చూడాలి.
సాక్షి, మెదక్ : ప్రాదేశిక ఎన్నికల్లో ప్రాధాన పార్టీలను రెబల్స్ బెడద వెంటాడుతోంది. వరుస విజయాలతో అధికార టీఆర్‌ఎస్‌లో ఉత్సాహం తొణికిసలాడుతుండగా.. ఆ పార్టీ అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే జెడ్పీటీసీ స్థానం నుంచి టీఆర్‌ఎస్ తరఫున అత్యల్పంగా ఇద్దరు.. అత్యధికంగా నలుగురు పోటీపడుతున్నారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి సైతం ఇలాంటి పరిస్థితే ఉంది. ఇదేక్రమంలో వరుస ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్‌లో సైతం ‘స్థానిక’ ఊపు నెలకొంది. అల్లాదుర్గం నుంచి జెడ్పీటీసీ స్థానానికి ఆ పార్టీ తరఫున అత్యధికంగా ఐదుగురు బరిలో ఉండడం విశేషం. మరోవైపు బీజేపీలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ పార్టీ నుంచి ఆశావహులు అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మూడు జెడ్పీటీసీ స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్లు దాఖలు చేయడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మిగతా మూడు మండలాల్లో ఆ పార్టీ నుంచి అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడం గమనార్హం.
నేతలు రంగంలోకి..
మొదటి విడత ఆరు మండలాల్లో (హవేలిఘణపూర్, పాపన్నపేట, టేక్మాల్, అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, రేగోడ్) 65 ఎంపీటీసీ, 6 జెడ్పీటీసీ స్థానాలకు మే 6న ఎన్నికలు జరగనున్నాయి. 65 ఎంపీటీసీ స్థానాలకు 433.. ఆరు జెడ్పీటీసీ స్థానాలకు 41 నామినేషన్లుదాఖలయ్యాయి. ఇంత భారీగా నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు చెందిన ప్రధాన నేతలు రంగంలోకి దిగారు. నేరుగా ఇప్పటివరకు ఎవరినీ సంప్రదించనప్పటికీ.. ఆయా స్థాయిల్లో బుజ్జగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. పలు చోట్ల కొందరు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు ససేమిరా అంటూ మొండికేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఇప్పటివరకు ఎలాంటి బుజ్జగింపులు లేవు. స్థానికంగా బేరసారాలు నడిచే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నెల 28న తేలుతుంది..
బీఫాంలు లేకున్నా నామినేషన్లు వేసిన ఆశావహుల భవితవ్యం ఈ నెల 28న తేలనుంది. ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలలోపు నామినేషన్‌పత్రాల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ లోపు అభ్యర్థులు పార్టీ బీ ఫాం సమర్పించాల్సి ఉంటుంది. అది సమర్పిస్తేనే పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నట్లు. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment