సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రాదేశిక ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీకి రెబెల్స్ గుబులు పట్టుకుంది. కలిసొచ్చిన రిజర్వేషన్లు.. గెలుస్తామనే ధీమాతో ఉన్న ఆ పార్టీకి చెందిన నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఈ సారి కచ్చితంగా పోటీలో నిలబడాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడత ఎన్నికలు జరిగే 24 జెడ్పీటీసీ స్థానాలకు 93 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇటు 294 ఎంపీటీసీ స్థానాలకు 904 మంది టీఆర్‌ఎస్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం అభ్యర్థులందరూ కచ్చితంగా బీ ఫారం తమకే వస్తుందనే ఆశతో ఉన్నారు. ఒకవేళ బీ ఫాం రాకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తర్వాత కారెక్కాలనే యోచనతో ఉన్నారు.
దీంతో బీ ఫారాలు రాని వారిని బుజ్జగించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు అష్టకష్టాలు పడుతున్నారు. రానున్న రోజుల్లో మంచి రాజకీయ భవిష్యత్‌కు భరోసా ఇస్తున్నారు. అయినా పలు చోట్ల రెబెల్స్ కచ్చితంగా తాము బరిలో ఉంటామనీ.. గెలిచి టీఆర్‌ఎస్‌లోనే చేరుతామంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాదేశిక పోరు రసవత్తరంగా మారింది. బీ ఫారాలు ఎవరికి వస్తాయి..? ఎవరికి మొండిచెయ్యి లభిస్తుందో అనే చర్చ మండలాలు, గ్రామాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఈ నెల 28 వరకూ ఈ ఉత్కంఠ ఇలానే ఉండనుంది. తొలి విడత ఎన్నికలు జరిగే స్థానాల నుంచి నామినేషన్ల దాఖలు చేసిన అభ్యర్థులు ఈ నెల 28న తమ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించిన నేపథ్యంలో ఆ లోపే రెబెల్స్‌ను సముదాయించే పనిలో అధికార పార్టీ నేతలు పడ్డారు. అయితే.. రెండో, మూడో విడత ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో ఇప్పట్నుంచే ఆశావహులతో చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీకి పలు చోట్ల రెబెల్స్ ముప్పు పొంచి ఉంది. దీంతో గెలిచిన తర్వాత కారెక్కని వారిని గుర్తించి వారికే బీ ఫారాలు ఇవ్వాలని డీసీసీ అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు.
- మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ జెడ్పీటీసీ స్థానానికి పార్టీ మండలాధ్యక్షుడు మాచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బాలవర్ధన్‌రెడ్డి, మహిళా బ్యాంకు ఉద్యోగి భూదేవి వంటి ముఖ్యులు బరిలో ఉన్నారు. రాజాపూర్ స్థానానికి సీనియర్ కార్యకర్త మోహన్‌నాయక్‌తో పాటు మరో ఐదుగురు బరిలో ఉన్నారు. వీరిలో ఎవరికి బీ ఫాం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
- జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు జెడ్పీటీసీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు భార్య భువనేశ్వరి, ప్రస్తుతం జెడ్పీటీసీ సభ్యురాలు శ్యామల మధ్య పోటాపోటీ నెలకొంది. అయితే వీరిద్దరూ అత్తా కోడలు కావడం.. ఇరువురిలో ఎవరూ వెనకడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. వీరిలో భువనేశ్వరి జెడ్పీ చైర్‌పర్సన్ పీఠం ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో పక్క సిట్టింగ్ జెడ్పీటీసీ సభ్యురాలు శ్యామలకు స్థానిక ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్నాయి. అయితే బీ–ఫారం తమకే వస్తుందని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ నాటికి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి, ఏకభిప్రాయంతో ఒక్కరే పోటీ చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
- ధరూర్ ఎంపీపీ అభ్యర్థికి క్లిష్ట పరిస్థితి...
- ధరూర్ మండలంలో అధికార టీఆర్‌ఎస్ ఎంపీపీ అభ్యర్థికి క్లిష్ట పరిస్థితి నెలకొంది. ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంపీపీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్న నజ్మాభేగం.. ధరూర్‌లో పోటీ చేయడానికి అయిష్టత చూపారు. గెలుపునకు సులువుగా ఉంటుందని పారుచర్ల ఎంపీటీసీ స్థానాన్ని ఎంపిక చేసుకుని అక్కడ నామినేషన్ వేశారు. దీంతో అక్కడ ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణుల్లో వ్యతిరేకత మొదలైంది. పార్టీలో బలమైన క్యాడర్‌ను కాదని... ఇతర గ్రామాల నాయకులను పిలిపించి ఇక్కడ నుంచి ఎలా పోటీ చేయిస్తారని టీఆర్‌ఎస్ గ్రామ నాయకులు బహిరంగంగానే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. దీంతో టీఆర్‌ఎస్‌లోనే పోటాపోటీగా నలుగురు నామినేషన్లు వేశారు.
- వారికి సర్ది చెప్పి నామినేషన్‌ను ఉపసంహరించే దానిపై ఎమ్మెల్యేతో పాటు, ముఖ్య నాయకులు మంతనాలు చేస్తున్నారు. మరోపక్క.. గట్టు మండలంలోని బల్గెర, గొర్లఖాన్‌దొడ్డి ఎంపీటీసీ స్థానాలకు పోటాపొటిగా టీఆర్‌ఎస్ నాయకులు నామినేషన్లు వేశారు. ఇక్కడ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గట్టు సోదరుల వర్గాలకు విడిపోయిన నాయకులు ప్రాదేశిక పోరులో పోటీపడుతున్నారు. ఎవరికి వారు బీ–పారం తమకే దక్కుతుందని భావిస్తున్నారు.
- వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి, ఖిల్లాఘనపురం, గోపాల్‌పేట జెడ్పీటీసీ స్థానాలకు టీఆర్‌ఎస్ నుంచి ముగ్గురు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. రేవల్లి స్థానం నుంచి ఐదుగురు బరిలో ఉన్నారు. వీరిలో బీ ఫాం ఎవరికి వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
- నారాయణపేట జిల్లా కోస్గి జెడ్పీటీసీ స్థానానికి పార్టీ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి. రిటైర్డ్ గెజిటెడ్ హెచ్‌ఎం ప్రకాశ్‌రెడ్డి బరిలో ఉన్నారు. వీరిలో ప్రకాశ్‌రెడ్డికే బీ ఫాం వచ్చే అవకాశాలున్నాయి. మల్లారెడ్డితో ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపిన టీఆర్‌ఎస్ నేతలు నామినేషన్ ఉపసంహరించుకోవాలని సూచించారు. దీంతో మల్లారెడ్డి నామినేషన్ ఉపసంహరణకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment