నేనొక్కడినే..
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు డీఎండీకే అధినేత, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ రెడీ అవుతున్నారు. అయితే, సభలో ఆయన ఒక్కడే ప్రధాన ప్రతి పక్షానికి కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇందుకు కారణం, డీఎండీకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొనసాగింపు పర్వమే.
చెన్నై : అన్నాడీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనడంతో డీఎండీకే అధినేత విజయకాంత్‌కు అదృష్టం కలసి వచ్చిందని చెప్పవచ్చు. డీఎంకే పతనంతో ప్రధాన ప్రతి పక్షనేతగా అవతరించిన విజయకాంత్ తన స్టంట్‌ను అధికార పక్షం మీద చూపించి చావు దెబ్బ తినాల్సి వచ్చింది. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రెబల్స్గా మారారు. కీలక నేత బన్రూటి రామచంద్రన్ ఏకంగా పదవికి రాజీనామా చేశారు.
అసెంబ్లీలో 29గా ఉన్న డీఎండీకే సభ్యుల సంఖ్య బన్రూటి రామచంద్రన్ రాజీనామాతో 28కి తగ్గింది. ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని అన్నాడీఎంకేకు అప్పగించుకోవాల్సి వచ్చింది. ఇక, రెబల్స్ రూపంలో మరో ఎనిమిది తగ్గాక తప్పలేదు. ఈ రెబల్స్ డీఎండీకే చిహ్నం మీద గెలిచినా, అసెంబ్లీలో మాత్రం అన్నాడీఎంకే సభ్యులతో కలసి కూర్చుంటూ వారితో కలిసి పోయారు. చివరకు తనతో పాటుగా 20 మంది సభ్యుల్ని మాత్రం విజయకాంత్ రక్షించుకోగలిగారు.
అలాగే, అధికార అన్నాడీఎంకేతో ఏర్పడ్డ వైర్యం ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ కొన్నాళ్లు సభ నుంచి సస్పెండ్ కాక తప్పలేదు. ఏ రోజున సస్పెండ్ అయ్యారో, అప్పటి నుంచి సభలోకి అడుగు పెట్టడం మానేశారు. సభా సమయాల్లో అసెంబ్లీ ఆవరణలోని రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లడంతో సరి. తమ అధినేత అసెంబ్లీకి దూరంగా ఉండటంతో తమ సత్తా ఏమిటో అధికార పక్షానికి రుచి చూపించేందుకు ఆయన సేనలు వచ్చి రాని స్టంట్లు చేసి ఇరకాటంలో పడ్డారు.
ఒక్కడే : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమ రెబల్స్‌తో ఫైట్ డీఎండీకే సభ్యులకు శిక్ష పడేలా చేశాయి. ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించి స్పీకర్ ధనపాల్ సభ్యులందర్నీ సస్పెండ్ చేశారు. ఆ సమావేశాల కాలంతో పాటుగా తదుపరి సమావేశాల కు కూడా సస్పెన్షన్ శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి. అయితే, ఆ ఘటన జరిగిన రోజు సభలో విజయకాంత్ లేరు. దీంతో సస్పెన్షన్ ఆయనకు వర్తించదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో సభలో ప్రధాన ప్రతి పక్షం ఉండేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. విజయకాంత్ సభకు రాని పక్షంలో, ఇక వారికి కేటాయించిన సీట్లన్నీ ఖాళీయే అన్న వ్యంగ్యాస్త్రాలు బయలు దేరి ఉన్నది.
ఈ సమయంలో నేనొక్కడ్నే అంటూ సభలో అడుగు పెట్టేందుకు విజయకాంత్ సిద్ధం అయ్యారు. అసెంబ్లీలో ఒక్కడ్నే ..ఒంటరిగా అధికార పక్షాన్ని చీల్చి చెండాడుతా..? అంటూ మరో మారు సభ వేదికగా అన్నాడీఎంకేతో ఢీకి రెడీ అవుతున్నారు. తన వెంట ఎమ్మెల్యేలు లేకున్నా, ఒక్కడ్నే చాలు అసెంబ్లీలో అడుగు పెడుతా..! అని విజయకాంత్ స్పష్టం చేస్తున్నారు. దీంతో సభలో మరో మారు అధికార పక్షం వర్సెస్ విజయకాంత్ మధ్య ఆసక్తికర సన్నివేశాలు వివాదాలు చోటు చేసుకోవడం ఖాయం. అదే సమయంలో విజయకాంత్ దూకుడుకు కళ్లెం వేయడానికి మేమూ రెడీ అని రెబల్స్ వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.