అన్నా డబ్బుల్లేవు..
కెప్టెన్‌కు నేతల షాక్
ఇక దరఖాస్తుల హోరు
తమిళనాడు ‘స్థానిక’ సమరం డీఎండీకే వర్గాలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఓ వైపు బల నిరూపణ, మరో వైపు ఎన్నికల ఖర్చుకు నిధి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఉన్నదంతా పార్టీ కోసం ఇన్నాళ్లు ఖర్చు పెట్టిన వాళ్లంతా, ఇప్పుడు ‘అన్నా’ డబ్బుల్లేవు...నీవే దిక్కు అని కెప్టెన్ కోర్టులోకి బంతిని నెట్టే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గ షాక్‌లను పార్టీ అధినేత విజయకాంత్‌కు ఇచ్చే పనిలో జిల్లా నేతలు ఉన్నారు.
చెన్నై :
రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తి డీఎండీకే అన్నట్టుగా ప్రజల మన్ననల్ని అందుకున్న నాయకుడు విజయకాంత్. పార్టీ ఆవిర్భావ సమయంలో సినీ అభిమానం ఆయన వెంట కదిలింది. అభిమాన లోకం రాజకీయంగా ఎదిగారు. తమ నేత ఇచ్చే పిలుపుమేరకు చేపట్టే కార్యక్రమాలకు ఇళ్లు గుళ్ల చేసుకున్న వాళ్లెందరో ఉన్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించినా, చివరకు అధికార పక్షంతో విజయకాంత్ పెట్టుకున్న వైరం డీఎండీకే వర్గాల్ని ఆర్థికంగా మరింత కష్టాల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే, చావు దెబ్బే తిన్నారు. ఇక, తాము ఇమడలేమంటూ పెద్ద సంఖ్యలో కేడర్ డీఎండీకేను వీడింది. దీంతో మిగిలిన వాళ్లను రక్షించుకునేందుకు విజయకాంత్ తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఇప్పుడు ఉన్న కేడర్‌లో ఆర్థికంగా దెబ్బ తిన్న వాళ్లు కొందరు అయితే, మరి కొందరు చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా రాజకీయాలు చేసే వాళ్లు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నేతల్లో స్థానిక ఎన్నికల ఖర్చు గుబులు బయలు దేరింది. ఎక్కడ తమ నెత్తిన వేసే రీతిలో కెప్టెన్ పిలుపునిస్తారో అన్న ఉత్కంఠ బయలు దేరింది. దీంతో ముందస్తుగా మేల్కొన్న జిల్లాల నేతలు అన్నా..డబ్బుల్లేవు...నీవే దిక్కు అన్నట్టు విజయకాంత్ వద్ద మొరపెట్టుకునే పనిలో పడ్డారు.
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? పొత్తా? ఒంటరా..? అన్న అంశాలపై కేడర్ అభిప్రాయాల్ని విజయకాంత్ స్వీకరించే పనిలో పడ్డారు. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ సాగుతూ వస్తోంది. ఇందులో జిల్లాలు, డివిజన్ల నుంచి వస్తున్న నేతలు విజయకాంత్‌కు షాక్‌లు ఇచ్చే పనిలో పడ్డారట..!. బలోపేతం లక్ష్యంగా కెప్టెన్ ఇచ్చే సూచనలు, సలహాలను నేతలు చక్కగా ఆలకిస్తున్నారు. అదే అభిప్రాయాల విషయానికి వచ్చే కొద్ది నేతలు తమ గళాన్ని విప్పే పనిలో పడడం కెప్టెన్‌కు పెద్ద షాక్కే అంట..!. డబ్బుల్లేవు, మళ్లీ..మళ్లీ తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టలేం అన్న సమాధానాలు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదన్నట్టుగా సలహాలు ఇచ్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందరి అభిప్రాయాల్ని శ్రద్ధంగా వినే విజయకాంత్, చివరలో ఎన్నికల్లోకి వెళ్తున్నాం...తాను సూచించే వ్యక్తి గెలుపునకు శ్రమించాల్సిందే అంటూ కేడర్‌కు హుకుం జారీ చేసి పంపించేస్తున్నట్టు సమాచారం. ఇంత మాత్రానికి తమను పిలిపించి అభిప్రాయాలు సేకరించడం ఏమిటో అంటూ పలువురు నేతలు కోయంబేడులోని పార్టీ కార్యాలయం నుంచి బయట పడ్డాక పెదవి విప్పే పనిలో పడడం గమనార్హం. అదే సమయంలో తాను మాత్రం తగ్గేది లేదన్నట్టుగా విజయకాంత్ ముందుకు సాగుతుండడంతో స్థాని కంలో బలాన్ని చాటగలమా అన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారట! ఇక, ఓ వైపు కేడర్ అభిప్రాయాలు అంటూ, మరో వైపు దరఖాస్తుల స్వీకరణ అంటూ విజయకాంత్ తనదైన రూట్‌లో పయనం సాగిస్తుండడం గమనార్హం.
దరఖాస్తుల హోరు : ఎన్నికలపై అభిప్రాయ సేకరణ ఓ వైపు కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సాగితే, మరో వైపు బుధవారం నుంచి ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులు దరఖాస్తులు సమర్పించుకునే విధంగా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయడం ఆలోచించదగ్గ విషయమే. ఇక విజయకాంత్ రూటే సెపరేటుగా ఉంటే, పీఎంకే అయితే, తాము ఒంటరే అన్నది స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి శ్రీకారం చుట్టారు. అలాగే, బీజేపీ సైతం ఒంటరి అన్నట్టుగానే దరఖాస్తుల పర్వానికి శ్రీకారం చుట్టింది. కోడంబాక్కంలో ఈ దరఖాస్తుల పంపిణీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ప్రారంభించేశారు. దీంతో ఆయా పార్టీలో దరఖాస్తుల పర్వం వేగం పుంజుకుంది.