చిత్తూరు కలెక్టరేట్: అధికార పార్టీ తిరుగుబాటు అభ్యర్థులను నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు. అయితే వారు ససేమిరా అంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గురువారంతో గడువు ముగియనుంది. జిల్లాలో టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. అలా నామినేషన్లను దాఖలు చేసిన వారు బరిలోకి దిగితే ఓట్లు చీలే అవకాశాలున్నాయి. అలాంటి వారిని గుర్తించి బరిలో నుంచి తప్పుకోవాలని అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని మదనపల్లె, కుప్పం, పలమనేరు, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంది.
నామినేషన్లు వేసిన పలువురు అభ్యర్థులు బరిలో ఉంటే ఓట్లు చీలి పార్టీ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థులకు నష్టం కలిగే అవకాశముంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని టీడీపీ, జనసేన ముఖ్యనేతలు బుజ్జగింపులు, ఆఫర్లు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పలమనేరు నుంచి టీడీపీ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేసిన సుభాష్‌చంద్రబోస్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమరనాథరెడ్డి పలుమార్లు మంతనాలు చేసినట్లు తెలిసింది. అయినప్పటికీ బోస్ వెనక్కి తగ్గకుండా బరిలోనే ఉంటానని తేల్చి చెప్పినట్లు సమాచారం.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుడు శ్రీరాములు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనను ఎన్నికల బరిలో నుంచి తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన స్వాతి బరిలో నుంచి తప్పుకుంటున్నారంటూ టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. కుప్పం నియోజకవర్గంలో సతీష్ అనే స్వతంత్ర అభ్యర్థిని వీసీకే పార్టీకి చెందిన గణేశ్‌లను పోటీ నుంచి తప్పుకోవాలని టీడీపీ నేత మనోహర్ ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. టీడీపీ నేతలు చేస్తున్న బుజ్జగింపులకు అభ్యర్థులు ఒప్పుకోవడం లేదని, బరిలోనే ఉంటామని చెబుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment