సాక్షి, సిటీబ్యూరో: ఈ నెల 7వ తేదీకి ఎంతో ప్రాధాన్యముంది. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర శాసన సభకు ఎన్నికలు జరుగుతున్నాయ్ కాబట్టి. నగరంలోని ప్రతి ఓటరూ తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు కాబట్టి. మరి ఇదే రోజు 7 తెలుగు సినిమాలు కూడా విడుదల కానున్నాయి. మరో విశేషమేమిటంటే.. ఎన్నికలు జరిగే శుక్రవారం సహా మూడు రోజులపాటు వరుసగా సెలవులే. మరి ఓటర్లు ఎంటర్‌టైన్‌మెంటు కోసం సినిమాలకు వెళతారా.. మూడురోజులు సెలవులు వచ్చాయి కాబట్టి సొంతూరి బాట పడతారా. ఈ ప్రభావం పోలింగ్ శాతంపై పడుతుందా.. అనే మీమాంస అటు అభ్యర్థులను ఇటు ఎన్నికల అధికారులను వెంటాడుతోంది. పోలింగ్ శాతం తగ్గితే అది గెలుపోటములను ప్రభావితం చేస్తుందని ఆయా పార్టీలు మథనపడుతున్నాయి.
డిసెంబర్ 7న కవచం, నెక్ట్స్ ఏంటీ, శుభలేఖ+లు, సుబ్రహ్మణ్యపురం తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే శుక్రవారం ఎన్నికల సందర్భంగా సెలవు దినం. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం కూడా సెలవు దినాలు కావడంతో పలువురు నగరవాసులు సొంత ఊళ్లకు, టూర్లకు వెళ్లే అవకాశం ఉంది. ఇలా ఒక్క రోజే ఐదు సినిమాలు విడుదల కావడం, వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో నగరంలో పోలింగ్ శాతంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఇటు కొత్త సినిమాలు, అటు ఎన్నికలు ఒకే రోజు నగరవాసుల ముందుకు వచ్చి ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి.
వరుస సెలవులు ప్రభావం చూపుతాయా..
సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 5 లక్షలకు పైనే ఉంటారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో ప్రతి రోజు 1.5 లక్షల మంది వరకు రాకపోకలు సాగిస్తుండగా, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి మరో 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. వరుస సెలవుల్లో మాత్రం ఇటు రైళ్లలో, అటు బస్సుల్లో మరో 50 వేల మంది వరకు అదనంగా బయలుదేరే అవకాశం ఉంది. సాఫ్ట్‌వేర్ నిపుణులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పని చేసే వేతన జీవులు ఇలాంటి సెలవులను సద్వినియోగం చేసుకొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ నెల 7 నుంచి వరుసగా మూడురోజులు సెలవులు రావడంతోనూ ఎక్కువ మంది సొంత ఊళ్లకు, సమీప పర్యాటక ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది.
ఎన్నికల సంఘానికీ అగ్ని పరీక్షే..
ప్రచారంతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు మరో నాలుగు రోజుల్లో అగ్ని పరీక్ష ఎదుర్కోనున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో కేవలం 53 శాతం ఓట్లు మాత్రమే నగరంలో నమోదు కావడంతో ఈ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకొంటోంది. సాంస్కృతిక కార్యక్రమాలు, వీధి నాటకాలు, తదితర రూపాల్లో ప్రజల్లో అవగాహనకు శ్రీకారం చుట్టింది. కొత్త సినిమాల విడుదల, వరుస సెలవులు వంటివి పోలింగ్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment