వార్‌ వన్‌ సైడ్‌ | Old City People Ready For Telangana Elections | Sakshi
Sakshi News home page

వార్‌ వన్‌ సైడ్‌

Published Tue, Dec 4 2018 9:29 AM | Last Updated on Tue, Dec 4 2018 9:29 AM

Old City People Ready For Telangana Elections - Sakshi

సయ్యద్‌ మహబూబ్, పండ్ల వ్యాపారి, ఫలక్‌నుమా

హైదరాబాద్‌ పాత నగరం.. నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ప్రాచీన నగరంలో హిందూ ముస్లింలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ రాజకీయాల ‘ఒరవడే’ వేరు. మేనిఫెస్టోలు, ప్రచారార్భాటాలు ఇక్కడ నడడవు. బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలే ఇక్కడి పార్టీల ‘జెండా’లవుతాయి. ‘మజ్లిస్‌’గా అందరి నోళ్లలో నానే మజ్లిస్‌–ఏ–ఇత్తేహదుల్‌ ముస్లిమీన్‌ (ఎంఐఎం).. పాతబస్తీ నియోజకవర్గాలపై చెరగని ముద్ర వేసుకుంది. మత రాజకీయాలే ఇక్కడి ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి. హిందూ, ముస్లిం ఎజెండాలతో ఇక్కడ మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నాయి.

పాత  నగరం మనోగతం
నిజాం కాలం నాటి అంతర్గత డ్రైనేజీ, నీటి పైప్‌లైన్ల ఆధునీకరణ.. వర్షపు నీరు రోడ్లు, బస్తీలను ముంచెత్త్తకుండా నివారణ చర్యలు
ఇరుకైన రోడ్లు, బ్రిడ్జిల విస్తరణ, అంతర్గతడ్రైనేజీ, ఓపెన్‌ కాల్వల శుద్ధి..
శిథిలావస్థలోని పురాతన  కట్టడాల తొలగింపు
స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పబ్లిక్‌ టాయిలెట్ల ఏర్పాటు
విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాల తొలగింపు
నిరుపేదలకు ఉచితంగా కేజీ టూ పీజీ విద్య, పేదల సౌకర్యార్థం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, మౌలిక సదుపాయాల కల్పన
చిరు వ్యాపారులకు బ్యాంక్‌ లింకేజీ లేకుండా రుణాలు, ఆర్థిక చేయూత
వృత్తి నైపుణ్యం పెంచేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ కేంద్రాల ఏర్పాటు
పాతబస్తీలో రోడ్డు రవాణా సౌకర్యాల మెరుగు.. మెట్రో పొడిగింపు
హైదరాబాద్‌లో సౌదీ కాన్సులేట్‌ కేంద్రం నెలకొల్పాలి
ట్రాఫిక్‌ పోలీసులు ఈ–చలానా విధానాన్ని రద్దు చేయాలి.

చార్మినార్‌: అహ్మద్‌ఖాన్‌ ఆరోసారి..
చార్మినార్‌ నియోజకవర్గం మజ్లిస్‌ అడ్డా. ఇక్కడ ఐదు దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా ఉంది. యాకుత్‌పురా నుంచి ఐదుసార్లు గెలుపొందిన ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ ఆరోసారి ఇక్కడి నుంచి పోటీకి దిగారు. ఇంకా మహ్మద్‌ గౌస్‌ (కాంగ్రెస్‌), ఉమా మహేందర్‌ (బీజేపీ) బరిలో ఉన్నారు. ఇక్కడ మజ్లిస్‌కు పోటీ అంతంతే. గత ఎన్నికల్లో మజ్లిస్‌ అభ్యర్థి 36 వేల ఓట్ల మెజార్టీతో బీజేపీపై గెలుపొందారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న గౌస్‌ మజ్లిస్‌ మాజీ కార్పొరేటర్‌. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్‌లో చేరిన ఆయన ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ముస్లిం ఓట్లు అధికంగా ఉండటంతో పాటు హిందుత్వ వాదం కూడా బలంగా ఉంది. మజ్లిస్, కాంగ్రెస్‌ పార్టీలు ముస్లిం ఓట్లను చీల్చుకుంటే.. తాను లబ్ధి పొందవచ్చనేది బీజేపీ అంచనా.

అహ్మద్‌ఖాన్‌ఉమా మహేందర్‌మలక్‌పేట: కొట్టేనా హ్యాట్రిక్‌!
మలక్‌పేట నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే అహ్మద్‌ బీన్‌ అబ్దుల్‌ బలాల (మజ్లిస్‌).. హ్యాట్రిక్‌ కొట్టేందుకు తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో బలాల 23 వేల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి ఆలె జితేంద్రపై గెలుపొందారు. జితేంద్ర.. దివంగత నేత టైగర్‌ నరేంద్ర కూమారుడు. గతంలో గౌలిపురా కార్పొరేటర్‌గా పనిచేసిన రాజకీయానుభవం ఉంది. హిందుత్వ ఎజెండాతో ఈయన ముందుకెళ్తున్నారు. మరోవైపు ప్రజాకూటమి పక్షాన పోటీ చేస్తున్న ముజఫర్‌ (టీడీపీ).. ముస్లిం ఓట్లు చీలి లబ్ధి చేకూరుతుందనే ఆశతో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి సతీష్‌ కూడా పోటీలో ఉన్నారు.-అబ్దుల్‌ బలాల, ఆలె జితేంద్ర

బహదూర్‌పురా: పోటీ ఎవరు?
బహదూర్‌పురా మజ్లిస్‌కు కంచుకోట. గత మూడు దఫాలుగా ఆ పార్టీదే ఇక్కడ ప్రాతినిధ్యం. ఇక్కడి ఇతర పార్టీల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా ముస్లింలే. తాజా మాజీ ఎమ్మెల్యే మౌజం ఖాన్‌ (మజ్లిస్‌) ప్రధాన పోటీదారు కాగా, ఇనాయత్‌అలీ బక్రీ (టీఆర్‌ఎస్‌), మహ్మద్‌ కలీం (కాంగ్రెస్‌), హనీఫ్‌ అలీ (బీజేపీ) పోటీలో ఉన్నారు. మజ్లిస్‌కు పోటీ కనిపించడం లేదు. గత ఎన్నికల్లో మౌజంఖాన్‌ 95 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసారీ తిరిగి పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.-మౌజం ఖాన్‌, హనీఫ్‌ అలీ

‘నాంపల్లి’ సెగ్మెంట్‌ కాడ..
ఇక్కడ పాత ప్రత్యర్థులే మళ్లీ బరిలో నిలిచారు. తాజా మాజీ ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ (మజ్లిస్‌) అప్పటో టీడీపీ నుంచి పోటీ చేసిన ఫిరోజ్‌ఖాన్‌పై 17 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు ఫిరోజ్‌ఖాన్‌  కాంగ్రెస్‌లో చేరి ప్రజాకూటమి పక్షాన కాంగ్రెస్‌ అభ్యర్థిగా  తిరిగి తలపడుతున్నారు. రెండుసార్లు ఓటమి పాలైన ఫిరోజ్‌ఖాన్‌పై సానుభూతి వ్యక్తమవుతుండటం మజ్లిస్‌ను కొంచెం కలవరపరుస్తోంది. ఈ నియోజకవర్గంలో నెలకొన్న హోరాహోరీ పోటీపై పాత నగరంలో ఉత్కంఠ నెలకొంది.-జాఫర్‌ హుస్సేన్‌, ఫిరోజ్‌ఖాన్‌

గోషామహల్‌: కాంగ్రెస్‌–బీజేపీ హల్‌చల్‌
గోషామహల్‌ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (బీజేపీ), మాజీ ఎమ్మెల్యే ఎం.ముఖేష్‌గౌడ్‌ (కాంగ్రెస్‌), ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌ (టీఆర్‌ఎస్‌) తలపడుతున్నా.. ప్రధాన పోటీ మాత్రం  బీజేపీ, కాంగ్రెస్‌ నడుమ నువ్వానేనా అన్నట్టుంది. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేసిన రాజాసింగ్‌.. ముఖేష్‌గౌడ్‌పై 46 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధిం చారు. హిందుత్వ ఎజెండాపై రాజాసింగ్, ప్రజాకూటమి బలం, మైనారిటీ ఓట్లు కలిసి వస్తాయని ముఖేష్‌ ఆశ పెట్టుకున్నారు. దీంతో ఇక్కడ పోటీ రసవత్తరంగా మారింది.- రాజాసింగ్‌, ఎం.ముఖేష్‌గౌడ్‌, ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌

కార్వాన్‌.. కేరాఫ్‌ కౌసర్‌?
కార్వాన్‌ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే కౌసర్‌ మొయినుద్దీన్‌ (మజ్లిస్‌) మరోసారి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన కౌసర్‌.. బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌రెడ్డిపై 37 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. ఇంకా ఇక్కడ జీవన్‌సింగ్‌ (టీఆర్‌ఎస్‌), అమర్‌సింగ్‌ (బీజేపీ) ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అలీ (కాంగ్రెస్‌) పోటీలో ఉన్నా.. మజ్లిస్‌కు పోటీ అంతంతగానే ఉంది. హిందుత్వ ఎజెండా ఇక్కడ బలంగానే ఉన్నా.. ఆ వర్గం ఓట్లన్నీ బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్య చీలిపోవడం మజ్లిస్‌కు కలిసివస్తుందని అంచనా.-కౌసర్‌, అమర్‌సింగ్‌

‘గుట్ట’లోన మొనగాడు!
చాంద్రాయణగుట్ట తాజా మాజీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ (మజ్లిస్‌) ఐదో సారి గెలుపు లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ నియోజకవర్గం ఆది నుంచీ మజ్లిస్‌కు కంచుకోట. బీజేపీ ఇక్కడి నుంచి ముస్లిం మహిళ సయ్యద్‌ షాహజాది (బీజేపీ)ని రంగంలోకి దింపింది. అయితే, గట్టి పోటీనిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా ఇక్కడ ఇసాబిన్‌ ఉబేర్‌ మిస్రీ (కాంగ్రెస్‌), సీతారాంరెడ్డి (టీఆర్‌ఎస్‌) పోటీలో ఉన్నారు. గత నాలుగు పర్యాయాలుగా మజ్లిస్‌తో ఎంబీటీ తలపడినా ఫలితం లేకపోతోంది. గత ఎన్నికల్లో ఎంబీటీకి చెందిన ఖయ్యూంఖాన్‌పై 59 వేల పైచిలుకు ఓట్లతో అక్బరుద్దీన్‌ విజయం సాధించారు. రెండేళ్ల క్రితం ఖయ్యూంఖాన్‌ చనిపోవడంతో పాటు కేడర్‌ కాస్తా ఎంఐఎంలో చేరడంతో ఎంబీటీకి పట్టు సడలింది. నియోజకవర్గంలోని హిందూ ఓట్లు అధికంగా గల ప్రాంతం పునర్విభజనలో మూడు ముక్కలైంది. దీంతో మజ్లిస్‌కు ఇక్కడ నల్లేరుపై నడకే.- అక్బరుద్దీన్‌, షాహజాది

యాకుత్‌పురా: మజ్లిస్‌–ఎంబీటీ ఢీ
యాకుత్‌పురా నియోజకవర్గంలో మజ్లిస్‌తో ఎంబీటీ తీవ్రంగా తలపడుతున్నా పోటీ నామమాత్రంగానే కనిపిస్తోంది. ఇక్కడ మజ్లిస్‌కు గట్టి పట్టుంది. ఇప్పటి వరకు చాంద్రాయణగుట్టపై దృష్టి పెట్టిన ఎంబీటీ ఈసారి ఇక్కడ గట్టెక్కేందుకు శతవిధాల ప్రయత్నిసోంది. మజ్లిస్‌తో పోటీపడి పాదయాత్రలు, కార్నర్‌ మీటింగ్‌లు, బహిరంగసభలు, మహిళ గ్రూప్‌ మీటింగ్‌లు నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచి అహ్మద్‌ పాషాఖాద్రీ (మజ్లిస్‌), రాజేంద్రరాజు (కాంగ్రెస్‌), రూప్‌రాజ్‌ (బీజేపీ) తలపడుతున్నారు. ఇక్కడ నుంచి వరుసగా ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించిన ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ పనితీరుపై ప్రజల్లో  కొంత అసంతృప్తి ఉండటంతో మజ్లిస్‌ ఆయనను చార్మినార్‌కు పంపించింది. అయితే, పాత ఎమ్మెల్యేపై గల వ్యతిరేకత కలిసి వస్తుందని ఎంబీటీ భావిస్తోంది. బీజేపీకి ఇక్కడ తన వర్గం ఓట్లపై పట్టుంది. గత పర్యాయం రూప్‌రాజ్‌  32 వేల ఓట్లు సాధించారు. ఎంఐఎం–ఎంబీటీ మధ్య ముస్లిం ఓట్లు చీలి, తాను లాభపడతానని బీజేపీ ఆశ.- అహ్మద్‌ పాషాఖాద్రీ, రూప్‌రాజ్‌

ఆ రెండు స్థానాల్లోనే ‘పోటీ’
పాతబస్తీలోని నియోజకవర్గాలన్నీ మజ్లిస్‌కు కంచుకోటలే. ఈ ఎన్నికల్లోనూ ఆ పార్టీ తిరిగి పట్టు నిలుపుకోవడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పాతనగరం పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో ముస్లింల ఓట్లు అధికం. కొన్ని దశాబ్దాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో మజ్లిస్‌ కంచుకోటను బద్ధలు కొట్టి పాగా వేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఎంబీటీ కూడా మజ్లిస్‌తో ఢీ అంటూ సర్వశక్తులూ ఒడ్డుతోంది. అయితే, ఇవి ఆయా ఎన్నికల్లో నామమాత్ర ప్రభావమే చూపుతూ వస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ.. ప్రతి ఎన్నికలప్పుడు స్నేహ పూర్వక పోటీ పేరుతో బలహీన అభ్యర్థులను రంగంలోకి దింపడం మజ్లిస్‌కు కలిసివస్తోంది. మొన్నటి వరకు కాంగ్రెస్, తాజాగా టీఆర్‌ఎస్‌తో మజ్లిస్‌ దోస్తీ చేస్తోంది. కాంగ్రెస్‌ .. నాంపల్లి మినహా మిగతా చోట్ల «ధీటైన అభ్యర్థులను నిలపలేదు. ఇది మజ్లిస్‌కు కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో  చార్మినార్, యాకుత్‌పురా, మలక్‌పేట, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, కార్వాన్, బహుదూర్‌పురా స్థానాల్లో మజ్లిస్‌ గెలుపొందింది. గోషామహల్‌లో పోటీకి దూరంగా ఉంది. ఈసారి చార్మినార్, చాంద్రాయణగుట్ట, కార్వాన్, బహుదూర్‌పురా, మలక్‌పేట నియోజకవర్గాల్లో వార్‌ వన్‌ సైడ్‌గా కనిపిస్తుండగా,  నాంపల్లిలో కాంగ్రెస్, యాకుత్‌పురాలో ఎంబీటీ గట్టి పోటీ ఇస్తున్నాయి.  గోషామహల్‌లో మజ్లిస్‌ పోటీలో లేదు.

పేదల గూడు చినబోతోంది..
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదల బతుకులు మారడం లేదు. ప్రతిసారి ఎన్నికల్లో భరోసా ఇస్తారు. ఆపై మరిచిపోతారు. మాకు కష్టపడితే కానీ కడుపు నిండదు. వచ్చిన సొమ్ము కడుపు నింపుకునేందుకు సరిపోతుంది. తలదాచుకోను గూడు లేక అవస్థలు తప్పట్లేదు. ఇరుకిరుకు కిరాయి ఇళ్లలో ఉండలేకపోతున్నాం. ప్ర«భుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
– సయ్యద్‌ మహబూబ్, పండ్ల వ్యాపారి, ఫలక్‌నుమా

చిరు వ్యాపారులకు రుణాలు
చిరు వ్యాపారులను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు బ్యాంక్‌ లింకేజీతో పని లేకుండా రుణాలివ్వాలి. రోడ్డు పక్కన బండ్లు పెట్టుకొంటూ, సంచారం చేస్తూ వ్యాపారాలు చేసే వారికి లైసెన్స్‌లిచ్చి  రుణ సహాయం అందించాలి.– రాజేందర్, టిఫిన్‌ బండి వ్యాపారి, ఫూల్‌బాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement