
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఎన్నికల పోరులో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం రేపటి(సోమవారం) నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్ల ప్రక్రియకు గడువు సమీపిస్తున్నా బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో పలు పార్టీలకు సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నికల బరిలో నిలవనున్న అభ్యర్థుల విషయమై టీఆర్‌ఎస్ మాత్రమే స్పష్టత ఇచ్చింది. అసెంబ్లీ రద్దు అనంతరం... సీఎం కేసీఆర్ ఒకేసారి ప్రకటించిన 105 అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
అలాగే బీజేపీ రెండు విడతలుగా వెల్లడించిన జాబితాలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అభ్యర్థుల విషయంలో మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. పలు వాయిదాలతో కాలం గడుపుతున్నారే కానీ అభ్యర్థుల పేర్లు మాత్రం ప్రకటించడం లేదు. మరోవైపు టీఆర్‌ఎస్ మొదటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తుండగా.. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్ భవన్‌లో ఆదివారం జరగనున్న సమావేశంలో ఆ పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ పార్టీ బీ ఫాంలు అందజేయనున్నారు.
వ్యూహాత్మకంగా టీఆర్‌ఎస్
ముందస్తు ఎన్నికల్లో భాగంగా మొదటి నుంచి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న టీఆర్‌ఎస్... మరో మైలు రాయిని చేరనుంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో వారు అనునిత్యం జనంలో మమేకమవుతున్న విషయం తెలిసిందే. అభ్యర్థులను ప్రకటించిన వెంటనే పలు చోట్ల కాస్త అసంతృప్తి వ్యక్తమైంది. ముఖ్యంగా కల్వకుర్తి వంటి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బరిలో నిలవాలని ఆయనపై కేడర్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, పార్టీ ముఖ్యుల సూచనతో ఆయన ఆఖరి నిముషంలో వెనక్కి తగ్గారు. అలాగే మరికొన్ని చోట్ల చిన్నచిన్న అసంతృప్తులు వ్యక్తమైనా పార్టీ అధిష్టానం సరిదిద్దగలిగింది. ఈ మేరకు పార్టీ కేడర్ అంతా కూడా ప్రచారంలో నిమగ్నమయ్యేలా చేయడంలో నేతలు విజయవంతమయ్యారు.
మధ్య మధ్యలో పార్టీ ముఖ్యనేత మంత్రి కేటీఆర్ సభలతో కేడర్‌లో ఉత్సాహం తీసుకొస్తున్నారు. అలాగే బూత్‌స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తోంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదివారం హైదరాబాద్‌లో స్వయంగా అభ్యర్థులతో మరోమారు సమావేశం కానున్నారు. సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండడం, అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ప్రచారశైలిపై ఆయన చర్చించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అతి కీలకమైన పార్టీ బీ–ఫాంలు అందజేయనున్నారు. ఆ తర్వాత అభ్యర్థులు తమ జాతక బలాలను అనుసరించి నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రతీ అభ్యర్థి కూడా రెండు సెట్ల నామినేషన్లను వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏయే తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయాలనే విషయంలో అభ్యర్థులు సైతం ఒక నిర్ణయానికి వచ్చారు.
‘మహా’ అయోమయం
ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలో జట్టు కట్టిన మహాకూటమి తరఫున సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రోజులు గడుస్తున్న కూటమి లెక్కలు, పొత్తులు ఓ కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాలో రెండు స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని భావించింది. మిగతా 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలవాలని సూచనప్రాయంగా నిర్ణయించారు. వాస్తవానికి ఈనెల1న అభ్యర్థుల ప్రకటన ఉంటుందని భావించినప్పటికీ.. పలు వాయిదాల అనంతరం 12వ తేదీకి మారింది.
ఈనెల 12న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో అదే రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయినప్పటికీ అభ్యర్థుల ప్రకటనలో మాత్రం పార్టీ అధిష్టానం జాప్యం చేస్తోంది. తొలి జాబితాలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు లీకులిచ్చారు. తీరా చూస్తే మిత్రపక్షాలతో కలిపి ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తామని సెలవిచ్చారు. దీంతో మిత్రపక్షాల మధ్య ఏకాభిప్రాయం తేలక సతమతమవుతున్నారు. రేపటి నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం అవుతుండటంతో.. ఎన్నికల ప్రచారానికి కేవలం 23 రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది. దీంతో ఆయా అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఎప్పుడు ప్రచారం ప్రారంభించాలి... ఎప్పుడు జనంతో మమేకం కావాలనేది అయోమయంగా మారింది.
చాప కింద నీరులా బీజేపీ
ముందస్తు ఎన్నికల్లో ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా బీజేపీ చాపకింద నీరులా ప్రచారంలో నిమగ్నమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరో అయిదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో మహబూబ్‌నగర్, కొడంగల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినా ఆఖరి నిముషంలో వాయిదా వేసింది. వాస్తవానికి మహాకూటమి సీట్ల సర్దుబాటు తేలాక మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని భావించింది.
కానీ కూటమి లెక్కలు సస్పెన్స్ థ్రిలర్ సినిమాను తలపిస్తుండటంతో... బీజేపీ తన వ్యూహాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిపోయిన అయిదు స్థానాలు కొల్లాపూర్, అలంపూర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కొడంగల్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత... ప్రచారంలో మరింత దూకుడు పెంచాలని భావిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో కల్వకుర్తి, నారాయణపేట, మక్తల్ వంటి నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూలంగా ఉన్నట్లు పలు సర్వేల నేపథ్యంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అలాగే జాతీయ స్థాయిలో పార్టీ ముఖ్యనేతలను కూడా ప్రచారబరిలో నిమగ్నం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment