మాట్లాడుతున్న కేటీఆర్
అంబర్‌పేట: మహాకూటమిలో సీట్లు సర్దుబాటు చేసుకునే తెలివి కూడా లేదని, వాళ్లు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కూటమిలో ప్రొఫెసర్ కోదండరామ్‌ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారని, కనీసం సీటు కూడా ఇవ్వకుండా అవమానించారన్నారు. ఇది కాంగ్రెస్ నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. బుధవారం అంబర్‌పేట చేనంబర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్‌కు మద్దతు తెలుపుతూ ‘అడ్వొకేట్స్ ఫర్ టీఆర్‌ఎస్’ పేరుతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర చారిత్రాత్మకమని అన్నారు. న్యాయవాదులతో టీఆర్‌ఎస్‌కు ఉద్వేగభరితమైన అనుబంధం ఉందన్నారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేసి, రూ.100 కోట్ల నిధులు కేటాయించామని గుర్తు చేశారు. అడ్వొకేట్ల మరిన్ని న్యాయమైన డిమాండ్లను మళ్లీ అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అసమర్థ ప్రతిపక్షం ఉందని, టీఆర్‌ఎస్‌ను ధైర్యంగా ఎదుర్కోలేక తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలతో జట్టు కట్టిందని విమర్శించారు.
చంద్రబాబునాయుడు రాసిన లేఖతోనే హైకోర్టు విభజనలో జాప్యం జరిగిందన్నారు. ఇది న్యాయవాదులు గమనించాలన్నారు. మహాకూటమి సీట్లు అమరావతిలో నిర్ణయించారని, ఇక కూటమి అధికారంలోకి వస్తే పరిపాలన కూడా అక్కడి నుంచే సాగుతుందని ఎద్దేవా చేశారు. అంబర్‌పేట బీజేపీకి కంచుకోట అంటున్న ఆ పార్టీ నేతలకు... కాలేరును గెలిపించి బుద్ధి చెప్పాలన్నారు. కిషన్‌రెడ్డి అసెంబ్లీలో మస్తు నరుకుతడని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్‌ను ఎందుకు గెలిపించుకోలేదనిప్రశ్నించారు. బీజేపీతో టీఆర్‌ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్ అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అంబర్‌పేట టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ప్రజాసేవలోకి వచ్చారని, ఆయనను ప్రోత్సహించేందుకు పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. అడ్వొకేట్ జేఏసీ కో–కన్వీనర్ శ్రీరంగారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణయాదవ్, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు రాజేందర్‌రెడ్డి, గండ్రమోహన్‌రావు, సుధాకర్‌రెడ్డి, సత్యంరెడ్డి, మధుసూధన్‌రావు, జయ్‌కర్, ముకీత్, భార్గవ్, జితేందర్‌రెడ్డి, రవి, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment