ఇప్పుడే బాగుంది! సంక్షేమం నచ్చింది.. బాబుతో పొత్తేంది? | Sakshi National Highway 65 Road Show on Telangana Elections | Sakshi
Sakshi News home page

ఇప్పుడే బాగుంది! సంక్షేమం నచ్చింది.. బాబుతో పొత్తేంది?

Published Thu, Dec 6 2018 9:30 AM | Last Updated on Thu, Dec 6 2018 9:30 AM

Sakshi National Highway 65 Road Show on Telangana Elections

సాక్షి నెట్‌వర్క్‌ : ముంబయి – విజయవాడ హైవేలో 65వ నెంబర్‌ జాతీయ రహదారి వెంట ఎన్నికలపై జనం పల్స్‌ తెలుసుకునేందుకు ‘సాక్షి’  ప్రయత్నించింది. ఇందులో భాగంగా మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 304 కిలోమీటర్ల మేర సాక్షి ప్రతినిధులు పర్యటించారు. ఈ పర్యటనలో వారు మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ నుంచి నల్లగొండ జిల్లా కోదాడ వరకు రహదారి పక్కన ఉన్న విభిన్న వర్గాల ప్రజలను...ప్రయాణికులను కలిశారు. రహదారి పొడవునా ‘రోడ్డు షో’ నిర్వహించి ఎవరెలా స్పందించారో? ఎవరేమన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు.  
మొత్తం 10 రూట్లుగా విభజించుకుని ‘సాక్షి’ బృందం దాదాపు 40–50 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. ఒక్కో రూట్లో కనీసం 15 నుంచి 20 మందిని..ఎన్నికలపై అభిప్రాయాన్ని కోరింది. ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, యువత, రైతులు, కూలీలు, దారిలో ఎదురుపడిన ప్రతి ఒక్కరినీ పలకరించి వారి అంతరంగాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. మెట్రోనగరం హైదరాబాద్‌తోపాటు జహీరాబాద్, పటాన్‌చెరు, చౌటుప్పల్, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వంటి చిన్నపట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలు ఈ రూట్లో అధికంగా ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ప్రజలు కూడా భిన్నంగా స్పందించడం ఇక్కడ విశేషం.  

తెలంగాణ వ్యతిరేకులతో కాంగ్రెస్‌ పొత్తా?
సంక్షేమ పథకాలు, వాటి అమలు, లోటుపాట్ల గురించి మాట్లాడుతూనే జనం రాజకీయాలపైనా అభిప్రాయాలు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడాన్ని వ్యతిరేకించారు. అవసరం కోసమే చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేస్తుండని విమర్శలు గుప్పించారు. తాము కాంగ్రెస్‌ను అభిమానించే వాళ్లమయినా..బాబు పొత్తు కారణంగా ఈసారి టీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నామని కొందరు నిర్మొహమాటంగా చెప్పారు. తెలంగాణ వ్యతిరేకులతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్‌కు ఏమవసరమని ప్రశ్నించారు. ఇక పల్లెల్లో పథకాలు బావున్నాయని, కొందరు అమలు తీరు మెరుగుపడాలని మరికొందరు చెçప్పుకొచ్చారు.  

పథకాలకు ప్రశంసలు
తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు ఈ షోలో పలుచోట్ల ప్రశంసలు వచ్చాయి. కొందరు పథకాల్లోని లోపాలనూ ఎత్తిచూపారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాగా పనిచేస్తున్నారు. ఆయనే మళ్లీ రావాలి’ అని జహీరాబాద్‌ రూట్లోని హుస్నాబాద్‌ మండలం రాయికోడ్‌కు చెందిన ఏసయ్య చెప్పారు. పింఛన్లు ఎంతో మేలు చేస్తున్నాయని, ఇంత పద్ధతిగా గతంలో ఎవరూ పింఛన్లు ఇవ్వలేదని ఎల్గోయి గ్రామానికి చెందిన మణయ్య పేర్కొన్నారు. రెండు లక్షల రుణమాఫీ వంటి పథకాలు తమను కాంగ్రెస్‌ వైపునకు దృష్టి మళ్లిస్తున్నాయని గోపన్‌పల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్‌ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, మైనార్టీలకు ఎంతో లబ్ధి చేకూరిందని, ఆయనే మళ్లీ సీఎంగా రావాలని పటాన్‌ చెరు పరిధిలోని బీరంగూడకు చెందిన ఎండీ ఖాన్‌ చెప్పుకొచ్చారు. పథకాలకు ప్రచారమే మిగిలింది తప్ప ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ లేదని ఇదే ప్రాంతంలో ఆటో డ్రైవర్‌ మల్లేశ్వర్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలన బాగుందని, ఆయనొచ్చాక రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని కూకట్‌పల్లికి చెందిన ఉద్యోగి నవీన్‌ చెప్పారు. ‘సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలవుతున్న ఈ తరుణంలో ప్రభుత్వం మారితే గందరగోళం ఏర్పడుతుంది. పథకాల లక్ష్యం నెరవేరాలంటే మళ్లీ సీఎంగా కేసీఆరే రావాలి’ అని లక్డీకాపూల్‌లోని పండ్ల వ్యాపారి అబ్దుల్‌ రషీద్‌ పేర్కొన్నారు. ఎవరికి ఓటేస్తానో చెప్పలేను కానీ సిటీలో రోడ్లు బాగాలేవు. ఏ ప్రభుత్వం వచ్చినా నగర రోడ్లను పట్టించుకోలేదు అని తన ఆవేదన వ్యక్తం చేశారు పంజగుట్టకు చెందిన ఆటోడ్రైవర్‌ శర్వన్‌సింగ్‌. ‘గర్భిణిలకు కేసీఆర్‌ కిట్లు, పిల్ల పెండ్లికి షాదీ ముబారక్‌ ఎంతో బాగుంది. అందుకే ఇదే ప్రభుత్వం మళ్లీ రావాలి’ అని ఎర్రగడ్డకు చెందిన బ్యాటరీ మెకానిక్‌ రఫీక్‌ వెల్లడించారు. సర్కారు పథకాలు కింది స్థాయి వరకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఎల్బీనగర్‌లో చెప్పుల బడ్డీ నడుపుకుంటున్న శకుంతల ప్రశ్నించింది. ‘ఎన్నికలు డబ్బుమయంగా మారాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనితీరు కొంతమేరకు పర్లేదు. కానీ ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకోలేదు’ అని చెప్పారు గుండ్రాంపల్లికి చెందిన చిట్టిప్రోలు రాములు. కేసీఆర్‌ పాలనలో ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన కాసింత అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ వారు టీడీపీతో జతకట్టడం ఏం బాలేదు. ఇది విఫల యత్నమే అవుతుంది. ఈ కారణంగానే నేను టీఆర్‌ఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నా’ అని నిర్మొహమాటంగా చెప్పారు ఎల్‌బీనగర్‌కు చెందిన శేఖర్‌రెడ్డి. తెలంగాణ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న  కేసీఆర్‌ మరోసారి అధికారం చేపట్టాలని హయత్‌నగర్‌కు చెందిన రవి అనే హోటల్‌ నిర్వాహకుడు ఆకాంక్షించారు. ‘అవసరం కోసం వస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిందే’ అంటూ చురకలంటించారాయన.  

‘సంక్షేమ’ పాలనకు కితాబు..
గ్రేటర్‌ హైదరాబాద్‌ వరకు ఓటర్లు ఓ విధంగా స్పందించగా...నగరం దాటాక గ్రామీణ, చిన్నచిన్న పట్టణ ప్రాంతాల్లో ప్రజలు భిన్నరీతుల్లో స్పందించారు. ఈ రూట్లో కొందరు పథకాలను మెచ్చుకోగా...కొందరు అవి అసలైన లబ్ధిదారుల వరకు చేరాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతులకు కరెంటు 24 గంటలు ఇవ్వడాన్ని కేసీఆర్‌ క్రెడిట్‌గా చెప్పుకొచ్చారు.  తెలంగాణ సాధించడంతోపాటు బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న కేసీఆర్‌కే ఈ ఎన్నికల్లో విజయమని కుండబద్ధలు కొట్టారు చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన లింగస్వామి. టీఆర్‌ఎస్‌ పాలన బాగుందని, అందుకే మరోసారి ఆయనదే గెలుపని విశ్వాసం వ్యక్తం చేశారు వట్టిమర్తికి చెందిన జాల యాదయ్య. ‘ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంది. అన్ని పార్టీలూ అదేదారిలో వెళ్తున్నాయి. ఉన్నంతలో ఏ పార్టీ ఈ విషయంలో ఉత్తమమైనదో ఆలోచించి ఓటేస్తాను’ అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు చిట్యాలకు చెందిన సంగిశెట్టి వెంకటేశ్వర్లు. కేసీఆర్‌ పథకాలు పూర్తి స్థాయిలో, కింది స్థాయి వరకు అర్హులకు ఇంకా చేరాల్సి ఉంది’ అని వెల్లడించారు ఏపీ లింగోటం గ్రామానికి చెందిన ముద్రబోయిన శంకర్‌. ప్రజలకు పూర్తిస్థాయిలో పథకాలు చేరితేనే ప్రయోజనం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ గ్రామానికి చెందిన అనుముల లక్ష్మయ్య కేసీఆర్‌ పాలనపై ప్రశంసలు కురిపించారు. ఆయనే మళ్లీ సీఎంగా రావాలని అన్నారు.

‘రైతులకు ఇప్పటి వరకు 24 గంటల కరెంటు ఎవరైనా ఇచ్చిండ్రా...కేవలం కేసీఆర్‌ ఒక్కరే ఇచ్చిండ్రు’ అని ఆయన గట్టిగా చెప్పారు. ‘పేదలకు ఇళ్లు ఇస్తామన్న హామీ ఒక్కటే నెరవేర్చలేక పోయారు’ అంటూ నిరసన తెలిపింది సూర్యాపేట మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన కూలి పల్లెపు భద్రమ్మ. ఎన్నికలు పోటాపోటీగా ఉన్నాయని చెప్పిన కేతేపల్లి కిరాణా షాపు వ్యాపారి బయ్య సర్వయ్య..‘కేసీఆర్‌ తప్పక గెలుస్త’డని భరోసాగా చెప్పారు. యువత కోసం టీఆర్‌ఎస్‌ సర్కారు ఏమైనా చేసి ఉండాల్సింది’ అని అభిప్రాయపడింది కొత్తపేటకు చెందిన విద్యార్థిని సరిత. ప్రభుత్వ పనితీరు బాగుందని, మళ్లీ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారం చేపడుతుందని మునగాల మండలం బరాఖత్‌గూడ గ్రామానికి చెందిన ఏటి రామకృష్ణ పేర్కొన్నారు. కేసీఆర్‌ అద్భుతమైన పథకాలు అమలు చేశారని, అవి కోట్లాది మందికి లబ్ధి చేకూర్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ అధికంగా ఉందని, కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరు పర్వాలేదని మునగాలకు చెందిన తూముల వీరస్వామి పేర్కొన్నారు. మా ఊళ్లో ఎన్నికల సందడి జోరుగున్నదని మునగాల మండలం బరాఖత్‌గూడెంకు చెందిన గండు అజయ్‌ చెప్పారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలన బాగుందని, ఆయన పథకాలు అద్భుతమని కితాబిచ్చారు. ‘ఈ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉంది. ఎన్నికల ప్రచారం తీరే మారింది. ఏది ఏమైనా టీఆర్‌ఎస్‌ పాలనే బాగుంద’ని చివ్వెంల మండలం తిరుమలగిరికి చెందిన కోడి రాములు పేర్కొన్నారు. ఎన్నికలు డబ్బుమయంగా మారాయని, ఈ విషయంలో పార్టీల ధోరణి మారాలని ఈ మార్గంలో ఎదురుపడిన కొందరు యువకుడు అభిప్రాయపడ్డారు.  కోదాడ మండలం నల్లబండగూడెంకు చెందిన బూరెల కరుణాకర్‌ ఎన్నికలపై స్పందిస్తూ ‘ప్రతిసారి ప్రభుత్వాలు మారితే బాగుండదు.  దీనివల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పథకాలు, ప్రాజెక్టుల పనులు మధ్యలో ఉన్నాయి. అవి పూర్తయ్యే వరకైనా మరోసారి కేసీఆర్‌కే అవకాశం ఇస్తే మంచిది’ అని ఆయన తన అభిప్రాయాన్ని చెప్పారు.  

ఈ అంశాలపైనే స్పందనలు...
టీడీపీతో కాంగ్రెస్‌ కూటమిగా ఏర్పడడాన్ని చాలా మంది వ్యతిరేకించారు.
ఈ వ్యతిరేకత పట్ణణ ప్రాంతాల్లో ఎక్కువ కన్పించింది.
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహంపై ఎక్కువ మందిస్పందించారు. ఇది మంచిది  కాదని అభిప్రాయపడ్డారు.  
కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పింఛన్లు వంటి పథకాలుగ్రామస్థాయికి ఇంకా చేరాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడ్డారు.ఈ పథకాలు బాగున్నాయని అత్యధిక మంది కితాబిచ్చారు.  
కేసీఆర్, ప్రభుత్వ పనితీరు బాగున్నా.. స్థానిక ఎమ్మెల్యేల వ్యవహారశైలి మారాల్సిన అవసరం ఉందని కొందరు ప్రస్తావించారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. యువత ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలి.

కాళేశ్వరం పూర్తయితే..
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే వేల ఎకరాలు సాగవుతాయి. వలసలు తగ్గుతాయి. ఈ పరిస్థితి రావాలంటే మరోసారి ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే వస్తే మేలు.  – బాలచందర్,టీస్టాల్, అమీర్‌పేట

తొలిసారిఓటేస్త..
ఈసారే ఓటరుగా నమోదయ్యా. అన్ని పార్టీలోళ్లు ఇంటికొస్తున్నారు. అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. కానీ కేసీఆర్‌ సర్కారు పథకాలు మంచిగుండె. ఇంట్ల పింఛన్లు వస్తున్నయ్‌.
– అశోక్, చెప్పులు కుట్టే వ్యక్తి, మియాపూర్‌

ఎవరు గెలిస్తే ఏంది?
రోడ్డుకు అడ్డమొచ్చినాదని గుడిసె కూల్చేశారు. ఎవరొచ్చినా అంతే చేస్తారు. ఈ రాజకీయాలు నాకెందుకు. నా యాపారం సక్కగా నడిస్తే బాగుండు.
– లక్ష్మమ్మ,కుండల వ్యాపారి, చైతన్యపురి

పిల్లలు పుడితే డబ్బులిస్తుండు
సీఎం సారు పిల్లలు పుడితే డబ్బులిస్తుండు. ఆ డబ్బులతో ఆసుపత్రి ఖర్చులన్నీ వస్తున్నాయి. టైంకి పింఛè న్‌ ఇస్తుండు. మళ్లీ సర్కారు మారితే చాలామంది ఆగం అవుతరు.
– కె.లక్ష్మి,అల్లం వెల్లుల్లి వ్యాపారి,ఓల్డ్‌ మలక్‌పేట

మరోసారిఅవకాశం ఇవ్వాలి
తెలంగాణ ఏర్పడి నాలుగేళ్లే కదా. అందుకే కేసీఆర్‌కు మరోసారి అవకాశం ఇవ్వాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నా. టీఆర్‌ఎస్‌కే మా మద్దతు. కూటమితో ఒరిగేదేమీ లేదు.  
– సతీష్‌ ఎలక్ట్రీషియన్, మన్సూరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement