
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పద్మాదేవేందర్‌రెడ్డి
కౌడిపల్లి(నర్సాపూర్): కాంగ్రెస్ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రావాదులకు తాకట్టుపెట్టిందని, మహా కూటమికి మహా ఓటమి తప్పదని తాజా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం కౌడిపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ బైక్ షోరూంను ప్రారంభించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఆంధ్రపాలకులతో పొత్తులు పెటుకుంటోందని తెలిపారు. ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్ర సీఎం చంద్రబాబుకు తాకట్టుపెడుతున్నారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులు, కృష్ణ, గోదావరి జలాలో వాటాను హైకోర్టు విభజనను అడ్డుకున్న చంద్రబాబుతో దోస్తికట్టిన మహాకూటమికి ప్రజలు మహాఓటమితో బుద్ధి చెపుతారని తెలిపారు.
మాజీ మంత్రి సునీతారెడ్డి గజ్వేల్‌లో ఓ మాట నర్సాపూర్‌లో ఓ మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టలేదు కాని అడ్డుకోవడంలో మాత్రం ముందున్నారని తెలిపారు. ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించి అభివృద్ధి పనులు, నీళ్లు, నిధుల నిర్ణయాలు ఇక్కడే కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఢిల్లీలో నిర్ణయాలు జరిగే పార్టీలకు ప్రజలు గట్టి బుద్ధి చెపుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు శివాంజనేయులు, నాయకులు రంగారెడ్డి, సత్యనారాయణగౌడ్, నరసింహాగౌడ్, వెంకట్‌రెడ్డి, బైక్ షోరూం నిర్వాహకులు ఆర్ కృష్ణగౌడ్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.