
శాసనసభ ఎన్నికల షెడ్యూలు వెలువడినా కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు. భాగస్వామ్య పక్షాలు టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌కు ఇచ్చే స్థానాలు తేలక పోవడంతో కాంగ్రెస్ ప్రచార ప్రభావం రెండు, మూడు నియోజకవర్గాల్లోనే కనిపిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలకు కేవలం నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత కనిపిస్తోంది. ప్రధాన రాజకీయ పక్షం టీఆర్‌ఎస్ ఇప్పటికే ఎన్నికల ప్రచార పర్వంలో పూర్తి స్థాయిలో మునిగి తేలుతోంది. ఇతర రాజకీయ పక్షాలు బీజేపీ, బీఎల్‌ఎఫ్ అభ్యర్థులను ప్రకటించిన చోట ప్రచారాన్ని ప్రారంభించాయి.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన వెంటనే గత నెల 6న టీఆర్‌ఎస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో జహీరాబాద్ మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తొలి అంకాన్ని పూర్తి చేశారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఇప్పటికే అందోలు, సంగారెడ్డి, నర్సాపూర్‌లో అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం ప్రారంభమైంది. బీజేపీ కూడా రెండు రోజుల క్రితం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఇద్దరు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది.
అసెంబ్లీ రద్దు చేసిన మరుక్షణం నుంచే బీజేపీ నేత రఘునందన్‌రావు దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. టీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది. జిల్లాలో ప్రధానరాజకీయ పక్షం కాంగ్రెస్‌లో రెండు, మూడు నియోజకవర్గాలు మినహా ఎక్కడా ఎన్నికల ప్రచార సందడి కనిపించడం లేదు. ఎన్నికల షెడ్యూలు వెలువడినా కాంగ్రెస్ ప్రధాన భాగస్వామిగా ఉన్న మహా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సీపీఐ, టీడీపీ చెరో స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నాయి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, దుబ్బాకలో కనీసం రెండు స్థానాలు ఇవ్వాలని కోదండరాం నేతృత్వంలోని టీజెఎస్ పట్టుబడుతోంది.
ఆ మూడు స్థానాల్లోనే స్పష్టత
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో కేవలం మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనే కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత కనిపిస్తోంది. అందోలు (ఎస్సీ) రిజర్వుడు స్థానం నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ (ఎస్సీ) స్థానం నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి, నర్సాపూర్ నుంచి మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దామోదర, సునీత లక్ష్మారెడ్డి మాత్రమే ప్రచారాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించగా, గీతారెడ్డి చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారు. సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తున్నా, ఆయన భార్య నిర్మల పేరు కూడా వినిపిస్తోంది. మరోవైపు సంగారెడ్డిని తమకు కేటాయించాల్సిందిగా టీజేఎస్ పట్టుబడుతోంది.
మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర భార్య పద్మినికి కాంగ్రెస్ టికెట్ దక్కే అవకాశం లేక బీజేపీలో చేరి, గంటల వ్యవధిలోనే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మిని టికెట్ కోసం దామోదర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. గజ్వేల్ నుంచి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ చేయడం దాదాపు ఖరారు కావడంతో ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. చివరి నిమిషంలో విప్లవ గాయకుడు గద్దర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తెరమీదకు వస్తారనే భయం పార్టీ శ్రేణులను పీడిస్తోంది.
మిగతా స్థానాల్లో అస్పష్టం
దుబ్బాక, నారాయణఖేడ్, మెదక్, సిద్దిపేట, పటాన్‌చెరు నియోజకవర్గాల్లో టికెట్ కోసం కాంగ్రెస్ నేతల బహుముఖ పోటీ నెలకొంది. దీంతో ఇక్కడ టికెట్ ఆశిస్తున్న నేతలు పార్టీ తరపున కాకుండా, తమ వ్యక్తిగత పరిచయాలను ఆధారంగా చేసుకుని మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. టికెట్ల కోసం బహుముఖ పోటీ ఉన్న నియోజకవర్గాల్లో నామినేషన్ల నాటికి అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. హుస్నాబాద్ స్థానం కోసం సీపీఐ పట్టుబడుతుండడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రచారం పూర్తి స్థాయిలో సాగడం లేదు. పటాన్‌చెరులో సుమారు డజను మంది నేతలు టికెట్ ఆశిస్తుండడం, టీడీపీ కూడా ఈ స్థానం కోసం పట్టుబడుతుండడంతో ఇప్పట్లో కాంగ్రెస్ ప్రచారం పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. అభ్యర్థులపై స్పష్టత ఉన్న చోట ఈ నెలాఖరులోగా కాంగ్రెస్ పార్టీ తొలి విడత జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
సోనియా సభ అనుమానమే?
ఈ నెల 27న సోనియా లేదా రాహుల్ సభను ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేయాలంటూ కొందరు నేతలు పార్టీ అధిష్టానాన్ని కోరారు. పటాన్‌చెరు లేదా సంగారెడ్డిలో సభను ఏర్పాటు చేయాలని భావించినా, సమయాభావంతో వీలు కాదని టీపీసీసీ నేతలు తేల్చినట్లు సమాచారం. సభ నిర్వహణకు ఐదు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో సాధ్యం కాదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఎన్నికల షెడ్యూలు వెలువడి పక్షం రోజులు గడిచినా పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడం, ఎన్నికల ప్రచారం ఆనవాళ్లు కనిపించక పోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అయోమయం, అందోళన కనిపిస్తోంది.