బుజ్జగింపు: బుధవారం రాత్రి భిక్షపతి యాదవ్ నివాసంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు అహ్మద్ పటేల్, ఉత్తమ్, సుబ్బరామిరెడ్డి, జైపాల్‌రెడ్డి, మధుయాష్కిగౌడ్
సాక్షినెట్‌వర్క్: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా మారుతోంది. ఈ రణరంగంలో మిగేలేదెవరో.. పోటీ నుంచి వైదొలగేదెవరో గురువారం తేలిపోనుంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దక్కని ఆశావహులు రె‘బెల్స్’ మోగించారు. కొందరు జాతీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీల నుంచి నామినేషన్లు వేయగా, మరికొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాల్లో మొత్తంగా 648 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో బుజ్జ గింపుల పర్వం ఊపందుకుంది. సనత్‌నగర్‌లో ఏ పార్టీకీ రెబల్స్ బెడద లేనప్పటికీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ‘దండే విఠల్’కు కేటీఆర్ ఫోన్ చేశారు. పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు సహకరించాలని కోరారు. మజ్లిస్‌కు పట్టున్న అసెంబ్లీసెగ్మెంట్లలో ప్రధాన పార్టీలకు పెద్దగా రెబల్స్ బెడద లేదు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న ఆజామ్ ఖాన్, కావూరి వెంకటేష్ టీఆర్‌ఎస్ రెబెల్స్‌గా కార్వాన్‌లో నామినేషన్లు వేశారు. నియోజకవర్గాల్లో
ప్రస్తుత రాజకీయ వేడి ఎలా ఉందంటే..
ఉప్పల్: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు మేకల శివారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి మహాకూటమి అభ్యర్థికి సహకరిస్తామని ప్రకటించారు. సింగిరెడ్డిని కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలి, డీకే.శివకుమార్‌లు పిలిపించి బుజ్జగించి సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా టీఆర్‌ఎస్ రెబల్ అభ్యర్థి నందికొండ శ్రీనివాస్‌రెడ్డి వేసిన నామినేషన్ అనూహ్య పరిణామాల మధ్య తిరస్కరించడంతో ఉప్పల్ అభ్యర్థులకు రెబల్ బెడద లేనట్టయింది.
ఖైరతాబాద్: కాంగ్రెస్ రెబల్స్‌గా నామినేషన్లు వేసిన చేసిన డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి, బి.రాజుయాదవ్, టీడీపీ రెబల్ అభ్యర్థి బీఎన్ రెడ్డిల నామినేషన్లు తిరస్కరణతో ప్రజాకూటమికి లైన్ క్లియర్ అయింది. ఇక టీఆర్‌ఎస్‌లో రెబల్‌గా నామినేషన్ వేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డి బీఎస్పీ తరఫున బరిలో నిలిచారు.
మల్కాజిగిరి: పొత్తులో భాగంగా టీజేఎస్‌కు ఈ సీటు వెళ్లగా, కాంగెస్ ఓబీసీ సెల్ జాతీయ కో–ఆర్డినేటర్ బి.సురేష్‌యాదవ్, సీనియర్ నేత రామకృష్ణ నాయుడు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి గోపు రమణారెడ్డి నామినేషన్ వేశారు. టీఆఎర్‌ఎస్‌కు ఇక్కడ రెబల్స్ బెడద లేదు.
అంబర్‌పేట: అంబర్‌పేట మహాకూటమి చర్చల సీన్ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నివాసానికి చేరింది. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న లక్షణ్‌యాదవ్, టీజేఎస్ అభ్యర్థి నిజ్జన రమేష్ ఇద్దరూ బుధవారం వీహెచ్‌ను కలిశారు. అక్కడే ఉన్న మీడియా ‘అంబర్‌పేట మహాకూటమి అభ్యర్థిపై స్పష్టత ఇస్తారా?’ అని ప్రశ్నించడంతో ‘‘ఇద్దరూ ఉంటార’’ని ఆయన చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో ఇద్దరిలో ఎవరు ఉపసంహరించుకుంటారో చూడాలి. టీఆర్‌ఎస్ ఉద్యమ కార్యకర్తలైన బీవీ రమణ, సునీల్ బిడ్లల నామినేషన్లు ఆమోదం పొందాయి. వీరు బరిలో ఉంటారా.. లేదా అన్నది గురువారం తేలిపోనుంది. అంబర్‌పేట నుంచి టీడీపీ టికెట్ ఆశించిన వనం రమేష్ స్వతంత్రుడిగా నామినేషన్ వేశారు.
జూబ్లీహిల్స్: టీఆర్‌ఎస్ రెబల్‌గా నామినేషన్ వేసిన తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ మహ్మద్ హుస్సేన్ బరిలో కొనసాగే అవకాశాలున్నాయి. బుధవారం ఆయన తన మద్ధతుదారులు, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమై టీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ను ఓడించాలని తీర్మానించారు. ఎంఐఎం ఎవరినీ పోటీలో నిలపకపోవడంతో గత ఎన్నికల్లో పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
కుత్బుల్లాపూర్: టీఆర్‌ఎస్ రెబల్‌గా నామినేసన్ వేసిన కొలన్ హన్మంత్‌రెడ్డి అనూహ్య పరిణామాల మధ్య టీడీపీలో చేరారు. ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌కు మద్దతిస్తున్న ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కాసాని వీరేశ్ పోటీలో ఉంటారా.. లేదా.. అనేది గురువారం తేలనుంది.
సికింద్రాబాద్: కాంగ్రెస్ నుంచి రెబల్‌గా నామినేషన్ వేసిన మాజీ మేయర్ కార్తీకరెడ్డి ఇంకా అలక వీడలేదు. మరో రెబల్ ఆదం ఉమాదేవి కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు పలికారు. ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారులు దాసరి శ్రీనివాస్, ఎస్.యాదగిరిలను కూడా ఆపద్ధర్మ మంత్రి పద్మారావు బుజ్జగిస్తున్నారు.
కంటోన్మెంట్: ఈ నియోజకవర్గం నుంచి ఇద్దరు టీఆర్‌ఎస్ రెబల్స్‌గా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన గజ్జెల నాగేశ్‌తో పాటు తెలంగాణ ఉద్యమకారిణి గంధం దయామణి ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేశారు. అయితే, వీరిద్దరూ పోటీలో ఉంటామని చెబుతుండగా, బుధవారం రాత్రి కేటీఆర్ ఇద్దరికీ ఫోన్ చేశారు. నామినేషన్లు ఉపసంహరించుకొని పార్టీ అభ్యర్థికి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన శ్రీగణేష్ ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు.
మేడ్చల్: టీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు అవకాశం దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ వైస్ చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్(జంగయ్య యాదవ్) కూడా బరిలో ఉన్నారు. అయితే, మేడ్చల్‌లో శుక్రవారం సోనియాగాంధీ బహిరంగసభ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు ఇది మింగుడుపడని అంశంగా మారింది.
కూకట్‌పల్లి: ప్రజాకూటమి అభ్యర్థికి రెబల్‌గా కాంగ్రెస్ నేత గొట్టముక్కల వెంగళరావు నామినేషన్ వేయగా, టీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన హరీష్ చంద్రారెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. ప్రచారం కూడా వేగవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ బరిలో లేకపోవడంతో కేడర్ రెండుమూడు వర్గాలుగా చీలిపోయింది.
మహేశ్వరం: గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన కొత్త మనోహరెడ్డికి టికెట్ రాకపోవడంతో ఎన్‌సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన్ను బుజ్జగించేందుకు టీఆర్‌ఎస్ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సిందే.
రాజేంద్రనగర్: ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీసీసీ సభ్యుడు వేణుగౌడ్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి చర్చించారు. శంషాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఆయన.. పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి కేటాయించాల్సి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి లేదా సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా శాంతింపజేశారు.
ఇబ్రహీంపట్నం: ఇక్కడ మాత్రం మల్‌రెడ్డి బ్రదర్స్ ఇంకా కుదటపడలేదు. కాంగ్రెస్ తరఫున నుంచి పోటీ చేయాలని భావించిన మల్‌రెడ్డి రంగారెడ్డికి టీడీపీ రూపేణా దురదృష్టం వెంటాడింది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని ‘దేశం’కు కేటా యించారు. అయితే, టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీపై డైలామాలో ఉండడంతో తమకు అవకాశం ఇవ్వాలని మల్‌రెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. బీఎస్పీ, ఎన్‌సీపీల తరుఫున నామినేషన్లు కూడా వేసిన ఈ ఇరువురు తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కూడా కలిసి.. ఇబ్రహీంపట్నం సీటు మార్పిడిపై చంద్రబాబుతో చర్చించాలని కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షుల భేటీ అనంతరం వీరి పోటీపై స్పష్టత రానుంది. ఒకవేళ టీడీపీ తప్పుకోకపోతే.. వీరిని పోటీ నుంచి తప్పించేందుకు అధిష్టానం రంగంలోకి దిగుతుందా? లేదా అనేది వేచిచూడాలి.
శేరిలింగంపల్లి: టీడీపీ రెబల్‌గా పోటీలో ఉన్న మొవ్వా సత్యనారాయణ తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. ఆయన్ను అమరావతికి పిలిపించి టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. టీఆర్‌ఎస్ అసమ్మతి నేత శంకర్‌గౌడ్‌కు కేటీఆర్ ఫోన్ చేసి బుజ్జగించి పార్టీ అభ్యర్థికి సహకరించాలని కోరారు. స్వతంత్రుడిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఆయన్ను కలిశారు. అయితే, మరోవైపు భిక్షపతి యాదవ్‌కు టీఆర్‌ఎస్‌కు పిలుపు వచ్చినట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఏకంగా చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు కూడా నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలిసి హుటాహుటిన ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌పటేల్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డి, జైపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కిగౌడ్‌లు బుధవారం రాత్రి భిక్షపతియాదవ్ నివాసానికి వెళ్లి బుజ్జగించారు. అన్యాయం జరిగిన విషయం వాస్తవమే అని తగిన న్యాయం చేస్తామని అహ్మద్‌పటేల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. నామినేషన్ ఉపసంహరించుకొని మహా కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. అయితే కార్యకర్తల సమావేశంలో వారి మనోభావాలు తెలుసుకున్నాక భిక్షపతియాదవ్ తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి.
ఎన్ని పార్టీలో.. అంతమంది అభ్యర్థులు
నామినేషన్లు అర్హత పొందిన అభ్యర్థుల్లో ఎన్నెన్నో పార్టీల వారున్నారు. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనవాహిని పార్టీ, యువ పార్టీ, న్యూ ఇండియా పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ), తెలంగాణ యువశక్తి, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్ పార్టీ, బహుజన రాష్ట్ర సమితి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, బీఎల్‌ఎఫ్, ఇండియన్ ప్రజాబంధు పార్టీ, దళిత బహుజన్ పార్టీ, బీఎస్పీ, హిందూ ఏక్తా ఆందోళన్ పార్టీ, జైభారత్ జనసేన పార్టీ, జేడీ(ఎస్), లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ తాంత్రిక్ సర్వజన్ సమాజ్ పార్టీ, జాతీయ మహిళా పార్టీ, నవ సమాజ్ పార్టీ, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, మజ్లిస్ మర్కజ్–ఇ–సియాజీ, తదితర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment