సాక్షి ముంబై: సీట్ల పంపకాలపై అటు ప్రజాస్వామ్య కూటమిలోనే కాదు ఇటు మహాకూటమిలోనూ సంఘర్షణ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో ఊపుమీదున్న మహాకూటమిలోని పార్టీలు గెలుపు అవకాశాలు ప్రత్యర్థులకంటే తమకే ఎక్కువగా ఉన్నాయని చెబుతూ సీట్ల కోసం పట్టుబడుతున్నారు. మహాకూటమిలో శివసేన, బీజేపీతోపాటు ఆర్పీఐ(ఆఠవలె వర్గం), స్వాభిమాని శేత్కారీ సంఘటన, శివసంగ్రాం పార్టీ, రాష్ట్రీయ సమాజ్ భాగస్వామ్య పార్టీలుగా కొనసాగుతున్నాయి.
మిగతా పార్టీల కోరికలను నెరవేర్చాలంటే శివసేన, బీజేపీలు తమ సీట్లలోనుంచి వాటి కోసం కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వస్తోంది. అయితే ఎవరెన్ని స్థానాలను త్యాగం చేయాలనే విషయమై బీజేపీ, శివసేనలో స్పష్టత కొరవడిందని సమాచారం. అయితే మిగతా పార్టీల డిమాండ్ మేరకు ఈ రెండు పార్టీలు తాము త్యాగం చేయాల్సిన సీట్ల సంఖ్యపై ఓ అవగాహనకు వచ్చే అవకాశముంది.
మూడు పార్టీలకు 35 సీట్లు ఇవ్వాల్సిందే..
సీట్ల కేటాయింపు విషయమై శివసేన, బీజేపీ నేతలు జాప్యం చేస్తుండంతో మహాకూటమిలోని స్వాభిమాని శేత్కారీ సంఘటన, శివసంగ్రాం పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పార్టీల నాయకులు పుణేలో సమావేశమయ్యారు. మూడు పార్టీలకు కలిసి 35 సీట్లు ఇవ్వాల్సిందేనని తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ సమాజ్ పార్టీ నేత మహాదేవ్ జాన్కర్, శివసంగ్రామ్‌కు చెందిన వినాయక్ మేటె, స్వాభిమాని శేత్కారీ సంఘటనకు చెందిన నాయకులు రాజు శెట్టి, సదాభావు ఖోత్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మహాదేవ్ జాన్కర్ మీడియాతో మాట్లాడుతూ... ‘కూటమిలోని పెద్దపార్టీలైన శివసేన, బీజేపీల నుంచి సీట్ల కేటాయింపు విషయమై ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. నిర్ణయం తీసుకోవడం జాప్యం చేయడంవల్ల గెలుపు అవకాశాలు దెబ్బతినే అవకాశముంది. ఇదే విషయాన్ని బీజేపీ, శివసేలకు చెప్పాలని సమావేశంలో నిర్ణయించుకున్నాం. మూడు పార్టీలకు 35 సీట్లు తప్పనిసరిగా కేటాయించాల్సిందేనని తీర్మానించాం. ఈ విషయాన్ని త్వరలో శివసేన, బీజేపీ దృష్టికి తీసుకెళ్తాం. మహాకూటమి గురించి కొందరు దుష్ర్పచారం చేస్తున్నారు. కూటమిలోచిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నిసీట్లు కావాలో అడగడం తప్పుకాదు. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఒంటరిగా పోటీ చేయాలని ఎవరూ భావించడంలేదు. మా డిమాండ్లను భాగస్వామ్య పార్టీలు కూడా అర్థం చేసుకుంటాయనే ఆశిస్తున్నామ’న్నారు.
ముంబై సీట్ల కోసం బీజేపీ పట్టు..
లోకసభ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ అధిక సీట్ల కోసం శివసేనపై ఒత్తిడి పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఎలాఉన్నా కనీసం ముంబైలో 50 శాతం సీట్లు తమకు కేటాయించాలని కోరుతోంది. అంటే మొత్తం 36 సీట్లలో 18 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం బీజేపీ ‘4-2’ కొత్త ఫార్ములాను ప్రవేశపెట్టింది. దీనిప్రకారమే సీట్ల పంపకాలు జరగాలని పేర్కొంటోంది.
కొత్త ఫార్ములా మేరకు లోకసభ నియోజకవర్గంలో గెలిచిన పార్టీకి నాలుగు, మిత్రపక్షానికి రెండు చొప్పున పంచుకోవాలని బీజేపీ చెబుతోంది. దీంతో ప్రస్తుతం ముంబైలో లోక్‌సభ నియోజకవర్గాలవారీగా బలాబలాలను పరిశీలించినట్టయితే శివసేన, బీజేపీలకు ముగ్గురేసి అభ్యర్థులున్నారు. దీంతో ముంబైలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెరోసగం స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాగా బీజేపీ డిమాండ్‌పై శివసేన నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు.
మహాయుతిలోకి మరోపార్టీ
ముంబై: కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) రాష్ట్రంలో మహాకూటమిలో చేరనుంది. శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమిలో చేరుతున్నట్లు ఎల్‌జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం ప్రకటించారు. సీట్లతో తమకు సంబంధం లేదని, పోటీపై తాము పెద్దగా దృష్టిపెట్టబోమని, మహాకూటమి తరఫునప్రచారం చేస్తామని ముంబైలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాశ్వాన్ స్పష్టం చేశారు.
మహాకూటమిలో సీట్ల కోసం మంకుపట్లు!
Published Thu, Aug 7 2014 10:24 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement