RPI
-
నటి పాయల్ ఘోష్ పొలిటికల్ ఇన్నింగ్స్
ముంబై : బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవలే)లో చేరారు. కేంద్ర మంత్రి, ఆ పార్టీ చీఫ్ రాందాస్ అథవలే సమక్షంలో ఆమె ఆర్పీఐ(ఏ)లో అడుగుపెట్టారు. పార్టీలో ఆమె చేరికను తాను స్వాగతిస్తున్నానని, పాయల్ ఘోష్‌కు శుభాకాంక్షలు తెలియచేశానని రాందాస్ అథవలే పేర్కొన్నారు. ఆర్పీఐ(ఏ) మహిళా విభాగానికి ఆమెను ఉపాధ్యక్షురాలిగా నియమించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాయల్ ఘోష్ ఆర్పీఐలో చేరారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్‌పై పాయల్ చేసిన లైంగిక వేధింపుల ఆరోఫణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. చదవండి : కంగనాకు మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి -
వైఎస్ జగన్‌కే మా మద్దతు: ఆర్పీఐ
విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డికి మా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏపీ అండ్ తెలంగాణా) కన్వీనర్ పేరం శివ నాగేశ్వరరావు తెలిపారు. విజయవాడలో పేరం శివ నాగేశ్వరరావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. వైఎస్ జగన్ ప్రత్యేక హోదా విషయంలో ముందు నుంచి ఒకే మాట మీద నిలబడ్డారని కొనియాడారు. పోలవరం, రాజధానికి కేంద్రం నిధులు ఇస్తే చంద్రబాబు వాటికి లెక్కచూపటం లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ను దోషిగా చూపించాలని చంద్రబాబు ప్రతీ పసుపు కార్యకర్తను పురమాయించాడని ఆరోపించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముద్దాయిగా చూపడానికి వీరేమైనా న్యాయమూర్తులా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న కేసులలో నేరం నిరూపణ కాలేదని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్‌కు కేసీఆర్ మద్ధతు ఇస్తే చంద్రబాబు నాయుడికి ఉలుకు ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు కేజ్రీవాల్, మమతా బెనర్జీల మద్దతు తీసుకోలేదా అని అడిగారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేలా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఏపీలో తాము పోటీ చేస్తున్నా కూడా వైఎస్సార్సీపీకే మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. -
‘తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య బాబు చిచ్చు’’
హైదరాబాద్: తెలంగాణాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రగడ్డ అనిల్ కుమార్ విమర్శించారు. ఏపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. డేటా చోరీ కేసులో ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజల ఓటు హక్కును ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు అప్పగించారని ఆరోపించారు. డేటా చోరీలో కేసులో ప్రధాన నిందితుడు అశోక్‌ను తప్పించడానికి చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. తెలంగాణాలో ఉన్న సెటిలర్లును బాబు ఇబ్బందులు పెడుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉన్నా అధికారంతో తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. సుజానా చౌదరీ జీఎస్టీ పన్ను ఎగవేసినా చంద్రబాబు స్పందించరని, రైతులకు రుణమాఫీ చేస్తామని ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. కేటీఆర్, వైఎస్ జగన్‌ను కలవడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, కేటీఆర్, జగన్‌ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ కోసమే వైఎస్ జగన్‌ను కేటీఆర్ కలిసి ఉండవచ్చు కదా అని అన్నారు. ఏపీ ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేయడానికే వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. -
దళిత హత్యలపై ఆర్పీఐ ఆందోళన
సాక్షి, ముంబై: అహ్మద్‌నగర్ జిల్లా జావఖేడ్ ఖాలసా దళితుల హత్యకాండకు నిరసనతోపాటు ఇందుమిల్లులో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్మారకం పనులను డిసెంబర్ అయిదు లోపు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆర్పీఐ ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే నేతృత్వంలో దాదర్‌లోని చైత్యభూమి నుంచి ఇందుమిల్లు వరకు వేలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆర్పీఐ కార్యకర్తలు ఒక సమయంలో ఇందుమిల్లులో చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో కొంత సమయంపాటు ఉద్రిక్తతమైన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ఆందోళనకారులను ఉద్దేశించి రాందాస్ మాట్లాడుతూ.. అహ్మద్‌నగర్ జిల్లా జావఖేడ్‌లో ముగ్గురు దళితులు దారుణ హత్యకు గురై సుమారు నెలరోజులు కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు నిందితులను అదుపులోకి తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, మున్ముందు ఇలాగే కొనసాగితే ఆర్పీఐ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కరువు ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో తమ డిమాండ్ల నివేదికను విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు అంద జేశారు. ఈ విషయంపై తొందర్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారని ఆర్పీఐ వర్గాలు తెలిపాయి. -
కేంద్ర పదవే ముద్దు..
సాక్షి, ముంబై: తనకు రాష్ట్ర మంత్రి పదవి అవసరం లేదని.... కేంద్ర మంత్రివర్గంలో చోటు కావాలని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. శాసన సభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నాగపూర్‌లో జరగనున్న శీతాకాల సమావేశాలకు ముందు ఫడ్నవిస్ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. అందులో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఆర్పీఐకి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై ఇంతవరకు తనతో చర్చ జరగలేదని ఆఠవలే స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌తో కలిసిమెలసి ఉన్న ఆఠవలే అనంతరం కాషాయకూటమితో జతకూడారు. గత లోక్‌సభ ఎన్నికల్లో దళితులు కాషాయ కూటమికి దగ్గరవ్వడంతో వారికి భారీగా సీట్లు వచ్చాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల విషయంలో పొత్తు బెడిసికొట్టడంతో ఆ కూటమిలోని బీజేపీ, శివసేన ఒంటరి పోరుకు సిద్ధపడ్డాయి. కాగా, బీజేపీ మిత్రపక్షంగానే ఉండేందుకు ఆర్పీఐ ఆసక్తి చూపింది. ఈ సమయంలో కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని బీజేపీ తనకు హామీ ఇచ్చిందని ఆఠవలే గుర్తు చేస్తున్నారు. అయితే మోదీ సర్కార్‌లో రెండో విడత మంత్రివర్గ విస్తరణలోనూ ఆర్పీఐకి చోటు దక్కకపోవడంతో రాందాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాందాస్‌ను బుజ్జగించేందుకు బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఆ పార్టీకి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, తమకు రాష్ట్ర మంత్రివర్గంలో పదవులు అవసరంలేదని, కేంద్రంలో ఇస్తేనే తీసుకుంటామని ఆయన నొక్కివక్కాణిస్తున్నారు. -
'ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన మద్దతు అవసరం'
ముంబై: మహారాష్ట్రలో శివసేన మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు చేయడం కష్టమని బీజేపీ మిత్రపక్షం ఆర్పీఐ(రిపబ్లిక్న పార్టీ ఆఫ్ ఇండియా) అభిప్రాయపడింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై సీట్లను దక్కించుకోపోవచ్చని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠావలే తెలిపారు. దీనిపై శివసేన-బీజేపీలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల సందర్బంగా బీజేపీ-శివసేన పొత్తు వైఫల్యం చెందడంపై మాట్లాడానికి నిరాకరించారు. ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల మహారాష్ట్రలో 225 నుంచి 230 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభంజన మరోసారి పనిచేసిందని ఆయన తెలిపారు. -
పదో తేదీలోగా తేల్చండి
ముంబై: సీట్ల సర్దుబాటు అంశంపై ఈ నెల పదో తేదీలోగా స్పష్టత ఇవ్వాలని ఆర్పీఐ అధికార ప్రతినిధి అర్జున్ డాంగ్లే డిమాండ్ చేశారు. లేకపోతే కూటమిలో కొనసాగే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ శాసనసభ ఎన్నికలకు సంబంధించి మాకు 14 లేదా 15 స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో కేటాయించాలని మహాకూటమిని ఎంతోకాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నాం. అయితే సీట్ల సర్దుబాటుపై పూర్తిగా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నెల పదో తేదీలోగా ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురాకపోయినట్టయితే మహాకూటమిలో కొనసాగే అంశాన్ని పునఃపరిశీలించాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ, శివసేన పార్టీల వైఖరి పట్ల కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక ్తమవుతోందన్నారు. మహాకూటమిలో కొనసాగే అంశంపై ఈ నెల పదో తేదీన జరగనున్న పార్టీ కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆ తర్వాత భవిష్య కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. గెలుస్తామనే ధీమా ఉన్న స్థానాలను కేటాయించాలని మాత్రమే తాము కోరుతున్నామన్నారు. ఎన్నికలకు సన్నద్ధమయ్యేందుకు తమ పార్టీ కార్యకర్తలకు సమయం కావాలన్నారు. ఆర్పీఐకి ఐదు స్థానాలే లభించే అవకాశముందనే వార్తలొస్తున్నాయి కదా అని ప్రశ్నించగా 14కు తగ్గితే సహించబోమన్నారు. అన్ని స్థానాలను మహాకూటమి కేటాయిస్తుందని భావిస్తున్నామన్నారు. ఆరు లేదా ఏడు దక్కే అవకాశం సాక్షి, ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)కు కేవలం ఆరు లేదా ఏడు స్థానాలు ఇచ్చేందుకు మాత్రమే శివసేన, బీజేపీలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మహాకూటమి నాయకులు అప్పట్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోక పోవడమేగాకుండా ఆర్పీఐకి తగిన గౌరవం ఇవ్వడం లేదని వారంతా భావిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆర్పీఐ కార్యకర్తలు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని అధిష్టానానికి దిగులు పట్టుకొంది. గత వారం కిందట శివసేన నాయకుడు, ఎంపీ సంజయ్ రావుత్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే కలిసి ఆర్పీఐ నాయకులతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. వారు ఎన్ని స్థానాలు కావాలనుకుంటున్నారు....? ఏ నియోజక వర్గాలు డిమాండ్ చేస్తున్నారు.? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రాందాస్ ఆఠవలే 59 స్థానాలకు సంబంధించిన జాబితా శివసేన, బీజేపీలకు సమర్పించారు. తర్వాత కచ్చితంగా 20 స్థానాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సీట్లయినా లభిస్తాయని ఆశతో ఉన్నారు. తాజాగా కేవలం ఏడు స్థానాలు ఇచ్చేందుకు మాత్రమే బీజేపీ, శివసేన పార్టీలు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఆఠవలే ఆందోళనలో పడిపోయారు. ఈ విషయాన్ని ఆయా పార్టీలు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. ముంబైలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న చాందివలి, వర్సోవా, అలాగే ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న ముంబ్రా వంటి విజయవకాశాలు లేని నియోజక వర్గాలను ఆర్పీఐకి ఇచ్చేందుకు శివసేన సంసిద్ధత వ్యక్తం చేసింది. బీజేపీ మాత్రం ముంబైలో ఒక్క స్థానాన్ని ఆర్పీఐకి వదులుకునేందుకు సిద్ధంగా లేదు. బీజేపీ కూడా తమకు విజయవకాశాలు లేని నియోజక వర్గాలు ఇస్తే అప్పుడు తమ పార్టీ పరిస్థితి ఏంటి...? అని ఆర్పీఐ నాయకులంతా అయోమయంలో పడిపోయారు. -
మహాకూటమిలో సీట్ల కోసం మంకుపట్లు!
సాక్షి ముంబై: సీట్ల పంపకాలపై అటు ప్రజాస్వామ్య కూటమిలోనే కాదు ఇటు మహాకూటమిలోనూ సంఘర్షణ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో ఊపుమీదున్న మహాకూటమిలోని పార్టీలు గెలుపు అవకాశాలు ప్రత్యర్థులకంటే తమకే ఎక్కువగా ఉన్నాయని చెబుతూ సీట్ల కోసం పట్టుబడుతున్నారు. మహాకూటమిలో శివసేన, బీజేపీతోపాటు ఆర్పీఐ(ఆఠవలె వర్గం), స్వాభిమాని శేత్కారీ సంఘటన, శివసంగ్రాం పార్టీ, రాష్ట్రీయ సమాజ్ భాగస్వామ్య పార్టీలుగా కొనసాగుతున్నాయి. మిగతా పార్టీల కోరికలను నెరవేర్చాలంటే శివసేన, బీజేపీలు తమ సీట్లలోనుంచి వాటి కోసం కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వస్తోంది. అయితే ఎవరెన్ని స్థానాలను త్యాగం చేయాలనే విషయమై బీజేపీ, శివసేనలో స్పష్టత కొరవడిందని సమాచారం. అయితే మిగతా పార్టీల డిమాండ్ మేరకు ఈ రెండు పార్టీలు తాము త్యాగం చేయాల్సిన సీట్ల సంఖ్యపై ఓ అవగాహనకు వచ్చే అవకాశముంది. మూడు పార్టీలకు 35 సీట్లు ఇవ్వాల్సిందే.. సీట్ల కేటాయింపు విషయమై శివసేన, బీజేపీ నేతలు జాప్యం చేస్తుండంతో మహాకూటమిలోని స్వాభిమాని శేత్కారీ సంఘటన, శివసంగ్రాం పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పార్టీల నాయకులు పుణేలో సమావేశమయ్యారు. మూడు పార్టీలకు కలిసి 35 సీట్లు ఇవ్వాల్సిందేనని తీర్మానించారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ సమాజ్ పార్టీ నేత మహాదేవ్ జాన్కర్, శివసంగ్రామ్కు చెందిన వినాయక్ మేటె, స్వాభిమాని శేత్కారీ సంఘటనకు చెందిన నాయకులు రాజు శెట్టి, సదాభావు ఖోత్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మహాదేవ్ జాన్కర్ మీడియాతో మాట్లాడుతూ... ‘కూటమిలోని పెద్దపార్టీలైన శివసేన, బీజేపీల నుంచి సీట్ల కేటాయింపు విషయమై ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు. నిర్ణయం తీసుకోవడం జాప్యం చేయడంవల్ల గెలుపు అవకాశాలు దెబ్బతినే అవకాశముంది. ఇదే విషయాన్ని బీజేపీ, శివసేలకు చెప్పాలని సమావేశంలో నిర్ణయించుకున్నాం. మూడు పార్టీలకు 35 సీట్లు తప్పనిసరిగా కేటాయించాల్సిందేనని తీర్మానించాం. ఈ విషయాన్ని త్వరలో శివసేన, బీజేపీ దృష్టికి తీసుకెళ్తాం. మహాకూటమి గురించి కొందరు దుష్ర్పచారం చేస్తున్నారు. కూటమిలోచిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నిసీట్లు కావాలో అడగడం తప్పుకాదు. అయితే బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఒంటరిగా పోటీ చేయాలని ఎవరూ భావించడంలేదు. మా డిమాండ్లను భాగస్వామ్య పార్టీలు కూడా అర్థం చేసుకుంటాయనే ఆశిస్తున్నామ’న్నారు. ముంబై సీట్ల కోసం బీజేపీ పట్టు.. లోకసభ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ అధిక సీట్ల కోసం శివసేనపై ఒత్తిడి పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా ఎలాఉన్నా కనీసం ముంబైలో 50 శాతం సీట్లు తమకు కేటాయించాలని కోరుతోంది. అంటే మొత్తం 36 సీట్లలో 18 సీట్లు కావాలని డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం బీజేపీ ‘4-2’ కొత్త ఫార్ములాను ప్రవేశపెట్టింది. దీనిప్రకారమే సీట్ల పంపకాలు జరగాలని పేర్కొంటోంది. కొత్త ఫార్ములా మేరకు లోకసభ నియోజకవర్గంలో గెలిచిన పార్టీకి నాలుగు, మిత్రపక్షానికి రెండు చొప్పున పంచుకోవాలని బీజేపీ చెబుతోంది. దీంతో ప్రస్తుతం ముంబైలో లోక్‌సభ నియోజకవర్గాలవారీగా బలాబలాలను పరిశీలించినట్టయితే శివసేన, బీజేపీలకు ముగ్గురేసి అభ్యర్థులున్నారు. దీంతో ముంబైలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెరోసగం స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాగా బీజేపీ డిమాండ్‌పై శివసేన నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. మహాయుతిలోకి మరోపార్టీ ముంబై: కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) రాష్ట్రంలో మహాకూటమిలో చేరనుంది. శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమిలో చేరుతున్నట్లు ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ గురువారం ప్రకటించారు. సీట్లతో తమకు సంబంధం లేదని, పోటీపై తాము పెద్దగా దృష్టిపెట్టబోమని, మహాకూటమి తరఫునప్రచారం చేస్తామని ముంబైలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో పాశ్వాన్ స్పష్టం చేశారు. -
20 ఇచ్చినా చాలు!
అసెంబ్లీ సీట్లపై తగ్గిన ఆర్పీఐ ముంబై: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు 47 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆఠవలె) వెనక్కు తగ్గింది. కనీసం 20 సీట్లు కేటాయించాలని భాగస్వామ్య పక్షాలను కోరింది. ఈ విషయమై ఆర్పీఐ నేత రాందాస్ ఆఠవలె మాట్లాడుతూ... ‘మా పార్టీకి 47 స్థానాలు కేటాయించాలని ముంబైలో సోమవారం జరిగిన మహాకూటమి సమావేశంలో డిమాండ్ చేశాం. అయితే భాగస్వామ్య పార్టీలను కూడా దృష్టిలో ఉంచుకొని కనీసం 20 కేటాయించాలని కోరుతున్నాం. ఇందులో విదర్భ ప్రాంతంలోని 13 సీట్లను ఆర్పీఐకి కేటాయించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. 20 స్థానాలను ఆర్పీఐకి కేటాయించినా కూడా శివసేన, బీజేపీలు తమ స్థానాల్లో కొన్నింటిని మాకోసం త్యాగం చేయక తప్పదు. సీట్ల కేటాయింపుపై వచ్చే వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. గవర్నర్ పదవితోపాటు ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని, త్వరలో ఏర్పాటు కానున్న మహారాష్ట్ర ప్రభుత్వంలో 15 శాతం అధికారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ పదవిని కూడా దళితులకు ఇవ్వాలని కోరతున్నామ’న్నారు. -
రాజ్ థాకరేకు రాఖీ సవాల్
ముంబై: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. ఆ పార్టీ జాతీయ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తేలేదని రాఖీ అన్నారు. అవసరమైతే త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాకరేపై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇటీవల ప్రకటించారు. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేశారు. శివసేన ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉంది. ఆర్పీఐ కూడా బీజేపీ, శివసేనకు మద్దతు ఇస్తోంది. ఎంఎన్ఎస్ ఒంటరిగా పోటీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాఖీ ఆర్పీఐ చేరడాన్ని ఆ పార్టీ చీఫ్ రామదాస్ అతవాలే స్వాగతించారు. కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాఖీ రాషీయ ఆమ్ పార్టీని స్థాపించింది. అయితే ముంబై వాయవ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాఖీ కేవలం 1,995 ఓట్లు సాధించింది. -
సీఎం పీఠం కోసం ‘మహా’ పోటీ
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమి వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా విజయం తథ్యమనే ధీమాతో ఉంది. ఒకవేళ అదే జరిగితే మహాకూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న శివసేన, బీజేపీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే విషయంపై అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి భారీ మెజారిటీ రావడంతో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అక్కడ మంత్రివర్గం పూర్తిగా కొలువుదీరక ముందే కొందరు వచ్చే శాసనసభ ఎన్నికలపై బేరీజు వేసుకోవడం మొదలుపెట్టారు. కొందరు బీజేపీ నాయకులు ఢిల్లీలో నరేంద్ర.. మహారాష్ట్రలో దేవేంద్ర (బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు దేవేం ద్ర ఫడ్నవీస్) అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీనిపై శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తను కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నానని ఇప్పటికే సంకేతాలిచ్చారు. మరోపక్క బీజేపీ నుంచి గోపినాథ్ ముండే మొదలుకుని వినోద్ తావ్డే పేర్లు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చర్చల్లో ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు ఎన్నికలకు ముందే ఇరు పార్టీల్లో పోటీ ప్రారంభమైంది. ఇరుపార్టీల మధ్య గొడవలు రాకుండా ఉండాల ంటే రెండున్నరేళ్ల చొప్పున రెండు పార్టీలు సీఎం పదవిని పంచుకోవాలనే అంశం తెరమీదకు వచ్చింది. కాని ఈ రెండు పార్టీల మధ్య ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం.. శాసనసభలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే సీఎం పదవి చేపట్టాలి. ఈ లెక్కన శివసేన ఎక్కువ స్థానాల్లో పోటీచేయడంవల్ల బీజేపీ కంటే ముందుంటుంది. కాని లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీచేసి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. కాని ఈ విషయంలో శివసేన తన ఆలోచనను మార్చుకుంటుందా.. అనేది అంతుచిక్కడం లేదు. -
సీట్లకోసం సిగపట్లు!
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్ల పంపకాల విషయమై మహాకూటమిలోని పార్టీల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. పంపకాల ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ శేత్కారీ సంఘటనల మధ్య మంగళవారం బాంద్రాలోని రంగ్‌శారదా సభాగృహంలో జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. తమకంటే తమకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని అన్ని పార్టీలూ పట్టుబట్టడంతో ఎటూ తేలకుండానే చర్చలు ముగిశాయి. దీంతో పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయమై సయోధ్య కుదిర్చేందుకు ఉద్ధవ్‌ఠాక్రే, గోపీనాథ్ ముండే, రాందాస్ ఆఠవలే, రాజుశెట్టి, మహాదేవ్ జాన్కర్లతో కూడిన ఓ ఉన్నత స్థాయి కమిటీని వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే, బీజేపీ నాయకుడు గోపినాథ్ ముండే, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన ఎంపీ రాజుశెట్టి, రాష్ట్రీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు మహాదేవ్ జాన్కర్ హాజరయ్యారు. వీరితోపాటు శివసేనకు చెందిన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి, సుభాష్ దేశాయ్, సంజయ్ రావుత్, ఆదిత్య ఠాక్రే, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ ఖడ్సే, వినోద్ తావ్డే, ఆర్పీఐకి చెందిన అవినాశ్ మహాతేకర్, అర్జున్ డాంగ్లే తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తమకు నాలుగు లోక్‌సభ స్థానాలు కావాలంటూ రాజుశెట్టి పట్టుబట్టడంతో ఆఠవలే తమకు కూడా మూడు లోక్‌సభ స్థానాలు కావాలని భీష్మించుకు కూర్చున్నారు. మహాదేవ్ జాన్కర్ మాఢా నియోజక వర్గాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాజుశెట్టి స్పందిస్తూ మాఢాను తమకే కేటాయించాలని పట్టుబట్టారు. ఇద్దరూ అదే నియోజకం వర్గం కావాలంటూ డిమాండ్ చేశారు. గతంలో జాన్కర్ మాఢా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇటీవల మహాకూటమిలో చేరిన సమయంలో రాజుశెట్టి కూడా మాఢా నియోజకవర్గాన్ని తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మాఢా నియోజక వర్గంపై మహాకూటమి నాయకులు ఎటూ తేల్చలేకపోయారు. దీంతో మిగతా విషయాల జోలికి వెళ్లకుండానే సమావేశం ముగిసింది. సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని చివరకు నిర్ణయం తీసుకున్నారు. కమిటీ నిర్ణయాన్ని అన్ని పార్టీలు అంగీకరించాల్సిందేనని షరతులు విధించారు. -
24 గంటలు గడవకముందే చిచ్చు
సాక్షి, ముంబై: మహాకూటమిలోకి స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ చేరి 24 గంటలు గడవకముందే లోక్‌సభ సీట్ల పంపకంపై చిచ్చు మొదలైంది. ఆ పార్టీ నాయకుడు, ఎంపీ రాజు శెట్టి మంగళవారం మహాకూటమిలో చేరిన సంగతి తెలిసిందే. పశ్చిమ మహారాష్ట్రలో రైతుల సమస్యలపై పోరాడుతున్న శెట్టికి అక్కడ మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించిన మహాకూటమి నాయకులు శెట్టితో సంప్రదింపులు జరిపి తమలో చేర్చుకున్నారు. అంతవరకూ బాగానే ఉన్నప్నటికీ సీట్ల పంపకాల విషయంలో అప్పుడే రగడ మొదలైంది. స్వాభిమాన్ కంటే తమ పార్టీ పెద్దదని, అందువల్ల ఆ పార్టీకి రెండు సీట్లు కేటాయిస్తే తమకు కనీసం మూడు లోక్‌సభ స్థానాలు ఇవ్వాలంటూ ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. మరోవైపు ఆర్పీఐకి ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై బీజేపీ, శివసేనలు ఇప్పటికే మల్లగుల్లాలు పడుతుండగా స్వాభిమాన్కంటే తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఆర్పీఐ డిమాండ్ చేయడం మహాకూటమికి తలనొప్పిగా పరిణమించింది. ఇది మున్ముందు మరింత జటిలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. -
నాలుగు ఎంపీ సీట్లు కావాలి: ఆర్పీఐ
ముంబై: తదుపరి ఎన్నికల్లో తమ పార్టీకి ఒక రాజ్యసభ స్థానంతోపాటు మూడు ఎంపీ సీట్లు కేటాయించాలని తాము డిమాండ్ చేశామని ఆర్పీఐ అధినేత రాందాస్ అథవాలే పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించేందుకు మహాకూటమి సుముఖత వ్యక్తం చేసిందని, అయితే ఈ నెల 14వ తేదీన జరగనున్న బీజేపీ, శివసేన, ఆర్‌పీఐలతోపాటు కొత్తగా చేరిన స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ నేతృత్వంలోని మహాకూటమి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. శివసేన నాయకుడు ఉద్ధవ్‌ఠాక్రే రాష్ర్ట బీజేపీ నాయకులతోపాటు జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌లతో చర్చలు జరుపుతున్నారన్నారు. బీజేపీ, శివసేన, ఆర్పీఐల, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ నేతృత్వంలోని మహాకూటమి తాజాగా పీజంట్స్ అండ్ వర్కర్స్ పార్టీతోనూ సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడు శరద్‌పవార్‌కు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో పోటీచేసిన రాష్ట్రీయ సమాజ్ పక్ష పార్టీ నాయకుడు మహాదేవ్ జంకార్ కాషాయకూటమిలో భాగస్వామేనన్నారు. -
‘కరివేపాకు’ చందమేనా..!
సాక్షి, ముంబై: గంపెడాశతో శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమిలో చేరిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) కు ఆ కూటమిలో తమ స్థానం ఏంటనే దానిపై రాందాస్ ఆఠవలే వర్గంలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకంలో స్థానాలు కేటాయించే విషయమై కూటమి ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. దీంతో కాషాయకూటమి తమ పార్టీకి ఎంతమేర ప్రాధాన్యత ఇస్తుందనేది ఆర్పీఐ కార్యకర్తలకు అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు ఒంట రిగానే ఎన్నికల బరిలో దిగిన ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రాబల్యం తగ్గిపోవడంతో పలు ప్రధానపార్టీల తో పొత్తు పెట్టుకున్నారు. అయినా అనుకున్నంతమేర ఫలితాలు రాలేదు. చివరకు కాషాయకూటమితో పొత్తుపెట్టుకోవడంతో అది మహాకూటమిగా అవతరించింది. ఆ తర్వాత జరిగిన నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో ఆర్పీఐ వర్గం ఓట్లు అధికంగా పోలవడంతో కాషాయకూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో భవిష్యత్తులో జరిగే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చనే ధీమాతో ఆఠవలే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో సీట్ల పంపకంపై పలుమార్లు శివసేన, బీజేపీ నాయకులతో చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్‌ను మహాకూటమిలో చేర్చుకునే అంశాన్ని బీజేపీ నాయకులు తెరమీదకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆర్పీఐ గుండెల్లో దడ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు ఆర్పీఐకి వదులుకోవాలనే విషయంపై శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన సేన భవన్లో అనేక సార్లు చర్చలు జరిగాయి. తనను రాజ్యసభకు పంపాలని చేసిన డిమాండ్‌ను కూడా శివసేన నెరవేర్చలేకపోయింది. చివరకు అనేక కారణాలు చూపుతూ బీజేపీ ద్వారా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. ఇలా శివసేన, బీజేపీ నాయకులు ఆఠవలే నిరాశపడకుండా అనేక హామీలు ఇచ్చారు. ఆయన్ని శాంతపరిచేందుకు‘మహాకూట మి సమన్వయ సమితి’ని కూడా ఏర్పాటు చేశారు. కాని ఇంతవరకు కచ్చితమైన సీట్ల సంఖ్యను ఖరారు చేయలేకపోయారు. దీంతో ఆర్పీఐ కార్యకర్తలు సందిగ్ధంలో పడిపోయారు. బీఎంసీ ఎన్నికల్లో కాషాయకూటమి నాయకులు తమను వాడుకున్నారని ఆర్పీఐ వర్గం ఆరోపిస్తోంది. సీట్ల సర్దుబాటు వెంటనే తేల్చని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని గతంలో ఆఠవలే హెచ్చరించారు. అయినప్పటికీ ఆ అంశం ఇప్పటికీ అయోమయంలోనే ఉంది. దీంతో కాషాయకూటమిలో తమ పార్టీ స్థానం ఏంటనే దానిపై ఆఠవలే కార్యకర్తలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. -
దేవయానికి అండగా నిలుస్తాం
సాక్షి, ముంబై: ఇక్కట్లపాలైన అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అండగా నిలవనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే శనివారం వెల్లడించారు. జనవరిలో అమెరికా వెళ్లనున్నట్టు చెప్పారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుస్తానన్నారు. కాగా వీసా మోసం ఆరోపణలపై దేవయానిని అరెస్టు చేసి బేడీలు వేయడం, ఆ తరువాత విచారణ పేరు తో ఆమెపట్ల దారుణంగా వ్యవహరించడం తెలి సిందే. అమెరికా వైఖరిని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తం గా వివిధ రంగాల నుంచి తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే శనివారం సాయంత్రం రాందాస్‌ను కలిశారు. అనంతరం రాందాస్ మీడియాతో మాట్లాడుతూ దేవయానికి అండగా నిలిచేందుకే తాను అమెరికా వెళుతున్నానన్నారు. దేవయానిపై నమోదుచేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని, ఆమెపట్ల కఠినంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు చెప్పారు. దేవయానికి న్యాయం జరిగేదాకా తమ పార్టీ ఆందోళన ఆగదని రాందాస్ స్పష్టం చేశారు. -
దళితులకు రక్షణ కల్పించండి: ఆర్పీఐ
ముంబై: దళితులపై దాడుల నిరోధానికి తగు చర్యలు తీసుకోవాలని రిపబిక్లన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్‌ను కోరింది. ఈ మేరకు శుక్రవారం ఓ వినతిపత్రం సమర్పించింది. ఇటీవలి కాలంలో దళితులపై దాడులు అధికమయ్యాయని ఈ సందర్భంగా ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వేధింపుల నిరోధక చట్టాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. ఇటువంటి కేసుల్లో నిందితులకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా చూడాలన్నారు. దళితులు బాధితులుగా మారినపుడు ఈ చట్టాన్ని వినియోగించాలన్నారు. ఇందుకు హోం మంత్రి స్పందిస్తూ ఇటువంటి కేసుల సంఖ్య పెరుగుతున్న మాట నిజమేనన్నారు. ఈ ఏడాది అక్టోబర్ దాకా 1,365 కేసులు నమోదయ్యాయన్నారు. ఔరంగాబాద్, నాగపూర్లలో రెండు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఉన్నాయన్నారు. అయినప్పటికీ మరో నాలుగు ఉండాలన్నారు. -
మహాకూటమిలోకి ఎమ్మెన్నెస్‌ను చేర్చుకోవడంపై మోడీ దృష్టి
సాక్షి, ముంబై: వచ్చే ఏడాదిలో జరగనున్న ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పటినుంచే రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించింది. అధికారమే లక్ష్యంగా చేసుకొని ప్రణాళికలు రూపొందిస్తోంది. మూడుసార్లు అధికారానికి దూరంగా ఉన్న కాషాయ కూటమి ఈసారి విజయమే లక్ష్యంగా చేసుకొని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ)ని చేర్చుకొని మహాకూటమిగా అవతరించింది. ఇప్పటికే ఈ కూటమి ఆధ్వర్యంలో ప్రజల సమస్యలతో పాటు అవినీతిపై ఆందోళనలు కూడా చేసింది. ప్రజల్లో కొంత క్రేజీ సంపాదించుకున్న ఈ మహాకూటమిలో రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీని చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలెట్టింది. గత ఎన్నికల్లో శివసేన, బీజేపీల అత్యధిక శాతం ఓట్లు చీల్చి అధికారానికి దూరంగా ఉంచేలా చేసిన ఎమ్మెన్నెస్‌ను కలుపుకుంటే ఈసారి మరింత బలపడొచ్చని ఆశలు పెట్టుకుంది. ఇందుకోసం బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు ప్రముఖ నాయకులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఒక వేళ ఈ ప్రయత్నాలు సఫలీకృతమైతే వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో మహాకూటమితో ఎమ్మెన్నెస్ కూడా జతకట్టి బరిలోకి దిగే అవకాశముంది. ఇదేగనుక జరిగితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీల డీఎఫ్ కూటమిని అధికార గద్దె దింపడానికి మార్గం మరింత సులభం కానుంది. గత ఎన్నికల్లో శివసేన, బీజేపీల అత్యధిక శాతం ఓట్లు ఎమ్మెన్నెస్ చీల్చింది. ఎమ్మెన్సెస్ అభ్యర్థులు లక్షాకుపైగా ఓట్లు రాబట్టుకున్నారు. దీంతో శివసేన, బీజేపీలకు తగిన మెజారిటీ రాలేదు. ఫలితంగా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా ముంబైలో ఈ పార్టీ తీవ్ర ప్రభావం చూపింది. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు అభ్యర్థులు, ఎన్సీపీకి చెందిన కొందరు అభ్యర్థులు కేవలం ఐదు నుంచి 10 వేల ఓట్ల తేడాతో గెలిచారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ మహాకూటమితో పొత్తు పెట్టుకుంటే గత ఎన్నికల పరిస్థితులతో పోలిస్తే పూర్తిగా తారుమారుకావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ మహాకూటమి నాయకులు లోక్‌సభ స్థానాలు చాలా తక్కువగా ఇచ్చే అవకాశాలున్నాయని ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకులు అంటున్నారు. దీంతో ఎమ్మెన్నెస్ రాష్ట్రంలో సొంతంగా బరిలో దిగకూడదని మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు వేర్వేరుగా బరిలో దిగుతాయా..? లేక పొత్తు పెట్టుకుంటాయా..? అనే అంశం ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఇలాంటి కీలక సందర్భంలో మహాకూటమికి ఎమ్మెన్నెస్ లాంటి ధీటైన పార్టీ తోడు దొరికితే కాంగ్రెస్, ఎన్సీపీలను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇబ్బందుల్లోకి నెట్టేందుకు మార్గం సులభమవుందని మోడీ నమ్ముతున్నారు. రాజ్‌ఠాక్రేతో మరింత సన్నిహిత్యం ఉండటంతో తొందరగానే పొత్తు విషయం తెలుతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు గత రెండు దశాబ్ధాలుగా శివసేన, బీజేపీ కూటములుగా కొనసాగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి మోడీ చేస్తున్న ప్రయత్నాలపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఎంతవరకు సహకరిస్తారనే అనుమానాలు బీజేపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. -
‘మహా’ సంగ్రామానికి సిద్ధం
సాక్షి, ముంబై: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాస్వామ కూటమి (డీఎఫ్)ని గద్దె దింపేందుకు శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమి సిద్ధంగా ఉందని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే మరోసారి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ మహాకూటమి నుంచి బయటకు రాదని బుధవారం మీడియాకు తెలిపారు. వచ్చే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో డీఎఫ్ కూటమి పరాజయం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. మూడు లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానం కావాలని అడుగుతున్నామన్నారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల సర్దుబాటుపై శివసేన, బీజేపీ నాయకులతో అఠవలే ప్రాథమిక చర్చలు జరిపాం. గతంలో తాము ఇరు పార్టీల నాయకులతో ఏడు లోక్‌సభ స్థానాలు కావాలని కోరాం. కానీ కాషాయ కూటమి నాయకులతో చర్చలు జరిపిన తర్వాత పట్టు సడలించి మూడు స్థానాలు కావాల’ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఏ పార్టీ తమకు ఎన్ని స్థానాలు ఇవ్వనుంది...? అవి ఏ నియోజక వర్గానివో...? వచ్చే వారంలో కాషాయకూటమి నాయకులతో చర్చలు జరిపిన తర్వాత తెలుస్తుందని అథవాలే స్పష్టం చేశారు. పుణే, లాతూర్, సాతార, వర్ధా, రామ్టేక్ తదితర నియోజక వర్గాలు ఆర్పీఐకీ అనుకూలంగా ఉన్నాయని, ఇక్కడి నుంచి పోటీచేస్తే ఆర్పీఐని విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దళితుల ఓట్లపై కన్నేసిన డీఎఫ్ కూటమి ప్రకాశ్ అంబేద్కర్‌కు చెందిన బీఆర్పీ, జితేంద్ర కవాడేకు చెందిన పీఆర్పీలను అక్కున చేర్చుకుందన్నారు. అయితే వారి ప్రభావం మహాకూటమిపై ఉండదన్నారు. ఆర్పీఐ కాషాయకూటమిలో చేరే ముందు ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో అంబేద్కర్, కవాడేలు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నప్పటికీ దళితులు మాత్రం తమతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనుకుంటున్నానని, అయితే రాజ్యసభకు వెళ్లాలని పార్టీ కార్యకర్తలు పట్టుబడుతున్నారని చెప్పారు. దీంతో వచ్చే వారంలో శివసేన, బీజేపీ నాయకులతో జరిగే చర్చల్లో సీట్ల సర్దుబాటు, రాజ్యసభ సీటు తదితర అంశాలపై చర్చిస్తామని, ఆ తర్వాత తుది నిర్ణయం ఉంటుందన్నారు. -
ఉందామా! వద్దా!
సాక్షి, ముంబై: మహాకూటమిలోని పరిణామాలపై అసంతృప్తితో ఉన్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే తన దారి తాను చూసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాకూటమిలో కొనసాగాలా, తెగతెంపులు చేసుకోవాలనే అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆఠవలే రాజ్యసభ స్థానం డిమాండ్ చేయడంతో కొద్ది రోజులుగా శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమిలో ప్రతిష్టం భన నెలకొంది. అది ఎటూ తేలకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకునే సమయం దగ్గరపడిందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. అయితే ఆర్పీఐ అసంతృప్తికి చాలా కారణాలు ఉన్నాయి. శివసేన దగ్గర ఒకే ఒక రాజ్యసభ సీటు ఉంది కాబట్టి ఆఠవలేకు రాజ్యసభ స్థానం ఇవ్వడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని అది తేల్చిచెప్పింది. బీజేపీ నుంచి ప్రయత్నం చేయాలని సూచించింది. శివసేన వైఖ రిపై అసంతృప్తికి గురైన ఆర్పీఐ అధినేత.. మహా కూటమి పక్షపాత ధొరణి అవలంభిస్తున్నట్లు తన సన్నిహితులతో చెబుతున్నారు. దీంతో పార్టీ పదాధికారులు, కార్యకర్తలు సహా ఆఠవలే కూడా అసంతృప్తితో ఉన్నారు. త్వరలో తాడోపేడో తేల్చుకుని తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నా యి. శివశక్తి, భీంశక్తి ఒకటవ్వాలని దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే చేసిన ప్రతిపాదనకు ఆఠవలే స్పందించారు. తరువాత శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమితో ఆర్పీఐ జతకట్టడం తో దీనికి మహాకూటమిగా నామకరణం చేశారు. శివసేన ఆఠవలేకు తప్పకుండా రాజ్యసభ అభ్యర్థిత్వం ఇస్తుందని కార్యకర్తలు భావించారు. ఆఠవలే ఇదే విషయాన్ని పలుసార్లు పార్టీ నాయకులతో చెప్పారు కూడా. చివరికి శివసేన కుదరదని తేల్చి చెప్పడంతో ఆర్పీఐలో అసంతృప్తి నెలకొంది. శివసేన తీసుకున్న ఈ నిర్ణయంతో దళిత సమాజానికి తప్పుడు సంకేతం పంపిందని ఆర్పీఐ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఆఠవలేకు రాజ్యసభ అభ్యర్థిత్వం నిరాకరించి శివసేన తమ అసలు రంగు బయటపెట్టుకుందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి దక్షిణ మధ్య ముంబై, కల్యాణ్ నియోజక వర్గాలు తమకు వదిలేయాలని, అక్టోబరు ఆఖరు వరకు శాసనసభ సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్నామ్యాయ మార్గాన్ని వెతుకోవాల్సి ఉంటుందని ఇదివరకే ఆర్పీఐ కాషాయ కూటమిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆఠవలే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందు సిద్ధంగా లేరు. తనను రాజ్యసభకు పం పించాలని పట్టుబడుతున్నారు. శివసేన మాత్రం ఏ ఒక్క ప్రతిపాదననూ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే తెగదెంపులు తప్పకపోవచ్చని ఆర్పీఐ నాయకుడొకరు అన్నారు. ‘కూటమి నుంచి బయటపడాలా..? వద్దా..? అనే దానిపై తేల్చుకునేందుకు త్వరలో ఒక సమావేశం నిర్వహిస్తాం’ అని ఆర్పీఐ వర్గాలు వెల్లడించాయి. -
మూడు ఎంపీ సీట్లు ఇవ్వండి
సాక్షి, ముంబై: శివ్‌శక్తి, భీం శక్తి అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రెండేళ్ల కిందట బీజేపీ, శివసేన నేతృత్వంలోని కాషాయకూటమిలో చేరిన ఆర్పీఐ అధినేత రాందాస్ అఠావ్లేకి అందులో ఇమడలేని పరిస్థితి ఎదురవుతోంది. ఈ రెండు పార్టీల వైఖరితో విసుగెత్తిపోయిన అఠావ్లే వచ్చే లోక్‌సభ, శాసన సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ ఆఖరునాటికి సీట్ల సర్దుబాటు సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కోవాల్సి ఉంటుందని ఢిల్లీలో మంగళవారంహెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల ఓట్లు లభించని పక్షంలో కాషాయ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలోని మొత్తం 288 శాసనసభ నియోజక వర్గాల్లో తమ పార్టీకి కనీసం ఐదు నుంచి 15 వేల వరకు ఓట్లు ఉన్నాయని అన్నారు. ఈ విషయం వారు మర్చిపోవద్దని హెచ్చరించారు. ఆర్పీఐని కాషాయ కూటమిలో కొనసాగించుకోవాలంటే శివసేన, బీజేపీ నాయకులు అక్టోబర్ ఆఖరు వరకు సీట్ల విషయంపై ఆమోదముద్ర వేయాలని, లేని పక్షంలో తాము ప్రత్యామ్నాయ మార్గంపై ఆలోచించుకోవాల్సి ఉంటుందని అన్నారు. లోక్‌సభకు చెందిన కనీసం మూడు స్థానాలు, శాసనసభకు చెందిన 30-35 స్థానాలు కచ్చితంగా ఇవ్వాలని, అదే విధంగా తనకు రాజ్యసభ సీటు కావాలని డిమాండ్ చేశారు. అఠావ్లే ఒత్తిడితో శివసేన, బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు విసిగెత్తిపోయారు. కాషాయకూటమి నుంచి ఆయనే స్వయంగా బయటపడితే బాగుంటుందని ఢిల్లీకి చెందిన కొందరు బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ‘గత నాలుగేళ్లలో వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రయోగాలు చే సి చూశారు.. ఇక పార్టీ ఎదుట ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం మిగలలేదు కదా..’ అన్న ప్రశ్నకు రాందాస్ సమాధానమిస్తూ బయటపడితే అదే మార్గం దొరుకుతుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు కాషాయకూటమి దక్షిణ మధ్య ముంబై, కల్యాణ్, పుణే, సాతారా, లాతూర్, రామ్‌టెక్ నియోజకవర్గాల్లో మూడింటిని తమకు వదిలేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శాసనసభ ఎన్నికలకు తమ పార్టీ అధ్యయనం చేసిన 61 నియోజకవర్గాలలో 30-35 స్థానాలను ఇవ్వాలని అఠావ్లే -
కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంపై పట్టుసాధిస్తున్న బీజేపీ
సాక్షి, ముంబై: కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతానికి బీజేపీ, ఆర్పీఐలు కృషి చేస్తుండడంతో శివసేన ఇరకాటంలో పడింది. ఇప్పటిదాకా ఈ నియోజకవర్గం శివసేన అధీనంలో ఉంది. అయితే మిత్రపక్షాలైన బీజేపీ, ఆర్పీఐలు ఈ నియోజవర్గంలో పోటీ చేయాలనే కోరికను పరోక్షంగా ఇలా వెల్లడిస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు. కాగా మిత్రపక్షాల వైఖరిపై శివసేన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా ఓ పార్టీ నియోజకవర్గంపై మిత్రపక్షంలోని మరోపార్టీ దృష్టి సారించడంతో మహాకూటమిలో బీటలువారే ప్రమాదముందనే అభిప్రయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కాషాయకూటమి సీట్ల పంపకంలో కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం శివసేనకు, భివండీ నియోజక వర్గం బీజేపీ వాటాలోకి వెళ్లాయి. కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంలో శివసేన టికెట్‌పై ఆనంద్ పరాంజపే విజయం సాధించగా, భివండీ లోక్‌సభ నియోజక వర్గంలో బీజేపీ టికెటుపై పోటీచేసిన జగన్నాథ్ పాటిల్ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇదిలాఉండగా కల్యాణ్ నుంచి ఎన్నికైన పరాంజపే ఎన్సీపీవైపు చూస్తున్నట్లు, ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయన తప్పక ఎన్సీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన అనుయాయులు సూచనప్రాయంగా వెల్లడించడంతో బీజేపీ, ఆర్పీఐలు ఈ నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్నాయి. పరాంజపే ప్రత్యర్థి పార్టీలోకి జంప్ చేస్తే ఆ నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలనే డిమాండ్‌ను చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే కల్యాణ్ శివసైనికులు మాత్రం అందుకు అంగీకరించడంలేదు. శివసేన కూడా ఈ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు ఇష్టపడడంలేదు. కల్యాణ్‌లో కేవలం పరాంజపేవల్ల పార్టీ గెలవలేదని, అక్కడ పార్టీకి బలమైన కార్యకర్తలున్నారని శివసేన నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. నేతలు ఎవరు నిలబడినా గెలిపించే సత్తా అక్కడి శివసైనికులకు ఉందని, దీంతో కల్యాణ్‌ను వదులకునే ప్రసక్తే లేదని చెప్పాడు. వీరివైఖరి ఇలా ఉండగా అటు బీజేపీ మాత్రం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కల్యాణ్‌లో సదస్సు ఏర్పాటుచేసిన బీజేపీ తమ బలమేంటో నిరూపించుకుంది. ఒకవేళ కల్యాణ్ కావాలని ఆర్పీఐ పట్టుబట్టినా ఆ పార్టీలో సమర్థులైన అభ్యర్థులెవరూ లేరు. దీంతో ఇక్కడ ఆర్పీఐకి విజయం అంత సులభంగా దక్కే అవకాశం లేదు. దీంతో శివసేన లేదా బీజేపీ అభ్యర్థులనే బరిలో దింపాల్సి ఉంటుంది. అయితే ఎవరు బెట్టు చేస్తారు? ఎవరు పట్టువిడుపులు పాటిస్తారనేది ఎన్నికలు సమీపిస్తేగానీ తెలియదు.