
హైదరాబాద్: తెలంగాణాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్‌పీఐ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రగడ్డ అనిల్ కుమార్ విమర్శించారు. ఏపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. డేటా చోరీ కేసులో ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. సామాన్య ప్రజల ఓటు హక్కును ప్రైవేటు సంస్థలకు చంద్రబాబు అప్పగించారని ఆరోపించారు. డేటా చోరీలో కేసులో ప్రధాన నిందితుడు అశోక్‌ను తప్పించడానికి చంద్రబాబు చూస్తున్నారని అన్నారు.
తెలంగాణాలో ఉన్న సెటిలర్లును బాబు ఇబ్బందులు పెడుతున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర స్పష్టంగా ఉన్నా అధికారంతో తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. సుజానా చౌదరీ జీఎస్టీ పన్ను ఎగవేసినా చంద్రబాబు స్పందించరని, రైతులకు రుణమాఫీ చేస్తామని ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని అన్నారు. కేటీఆర్, వైఎస్ జగన్‌ను కలవడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని, కేటీఆర్, జగన్‌ను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ కోసమే వైఎస్ జగన్‌ను కేటీఆర్ కలిసి ఉండవచ్చు కదా అని అన్నారు. ఏపీ ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేయడానికే వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment