సాక్షి, ముంబై: అహ్మద్‌నగర్ జిల్లా జావఖేడ్ ఖాలసా దళితుల హత్యకాండకు నిరసనతోపాటు ఇందుమిల్లులో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్మారకం పనులను డిసెంబర్ అయిదు లోపు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆర్పీఐ ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే నేతృత్వంలో దాదర్‌లోని చైత్యభూమి నుంచి ఇందుమిల్లు వరకు వేలాది మంది కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఉండడం విశేషం. ఈ సందర్భంగా ఆర్పీఐ కార్యకర్తలు ఒక సమయంలో ఇందుమిల్లులో చొరబడేందుకు ప్రయత్నించారు.
దీంతో కొంత సమయంపాటు ఉద్రిక్తతమైన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ఆందోళనకారులను ఉద్దేశించి రాందాస్ మాట్లాడుతూ.. అహ్మద్‌నగర్ జిల్లా జావఖేడ్‌లో ముగ్గురు దళితులు దారుణ హత్యకు గురై సుమారు నెలరోజులు కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు నిందితులను అదుపులోకి తీసుకోవడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, మున్ముందు ఇలాగే కొనసాగితే ఆర్పీఐ ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కరువు ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో తమ డిమాండ్ల నివేదికను విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు అంద జేశారు. ఈ విషయంపై తొందర్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారని ఆర్పీఐ వర్గాలు తెలిపాయి.
దళిత హత్యలపై ఆర్పీఐ ఆందోళన
Published Fri, Nov 28 2014 10:15 PM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement