సాక్షి, ముంబై: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాస్వామ కూటమి (డీఎఫ్)ని గద్దె దింపేందుకు శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమి సిద్ధంగా ఉందని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే మరోసారి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పార్టీ మహాకూటమి నుంచి బయటకు రాదని బుధవారం మీడియాకు తెలిపారు. వచ్చే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో డీఎఫ్ కూటమి పరాజయం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. మూడు లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ స్థానం కావాలని అడుగుతున్నామన్నారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల సర్దుబాటుపై శివసేన, బీజేపీ నాయకులతో అఠవలే ప్రాథమిక చర్చలు జరిపాం.
గతంలో తాము ఇరు పార్టీల నాయకులతో ఏడు లోక్‌సభ స్థానాలు కావాలని కోరాం. కానీ కాషాయ కూటమి నాయకులతో చర్చలు జరిపిన తర్వాత పట్టు సడలించి మూడు స్థానాలు కావాల’ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఏ పార్టీ తమకు ఎన్ని స్థానాలు ఇవ్వనుంది...? అవి ఏ నియోజక వర్గానివో...? వచ్చే వారంలో కాషాయకూటమి నాయకులతో చర్చలు జరిపిన తర్వాత తెలుస్తుందని అథవాలే స్పష్టం చేశారు. పుణే, లాతూర్, సాతార, వర్ధా, రామ్‌టేక్ తదితర నియోజక వర్గాలు ఆర్పీఐకీ అనుకూలంగా ఉన్నాయని, ఇక్కడి నుంచి పోటీచేస్తే ఆర్పీఐని విజయం వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దళితుల ఓట్లపై కన్నేసిన డీఎఫ్ కూటమి ప్రకాశ్ అంబేద్కర్‌కు చెందిన బీఆర్పీ, జితేంద్ర కవాడేకు చెందిన పీఆర్పీలను అక్కున చేర్చుకుందన్నారు.
అయితే వారి ప్రభావం మహాకూటమిపై ఉండదన్నారు. ఆర్పీఐ కాషాయకూటమిలో చేరే ముందు ప్రజలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో అంబేద్కర్, కవాడేలు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నప్పటికీ దళితులు మాత్రం తమతోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనుకుంటున్నానని, అయితే రాజ్యసభకు వెళ్లాలని పార్టీ కార్యకర్తలు పట్టుబడుతున్నారని చెప్పారు. దీంతో వచ్చే వారంలో శివసేన, బీజేపీ నాయకులతో జరిగే చర్చల్లో సీట్ల సర్దుబాటు, రాజ్యసభ సీటు తదితర అంశాలపై చర్చిస్తామని, ఆ తర్వాత తుది నిర్ణయం ఉంటుందన్నారు.