Congress Party: టార్గెట్‌ 72 | The Congress Party Aims To Take Power Coming Elections | Sakshi
Sakshi News home page

Congress Party: టార్గెట్‌ 72

Published Sun, Aug 22 2021 1:52 AM | Last Updated on Sun, Aug 22 2021 2:09 AM

The Congress Party Aims To Take Power Coming Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో.. అధికారం దక్కాలంటే కనీసం 60 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంది. అయితే పార్టీ గెలిచేందుకు అవకాశం ఉన్న 72 స్థానాలు టార్గెట్‌గా పెట్టుకుని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పకడ్బందీ కసరత్తు ప్రారంభించారని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. నియోజకవర్గాలను ఏ (గెలిచే అవకాశం) బీ (ఓ మోస్తరు అవకాశం), సీ (అవకాశం లేదు) కేటగిరీలుగా వర్గీకరించిన రేవంత్‌ వాటిలో గెలిచే అవకాశాలున్న స్థానా లపై దృష్టి సారించారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చి నా ఆయా స్థానాల్లో గెలుపొందేలా వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది.

దక్షిణ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే ఆయన ఒక అంచనాకు వచ్చారని, గ్రేటర్‌ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను ప్రత్యేక కేటగిరీ కింద తీసుకుని గెలుపు వ్యూహాలను రచించే పనిలో పడ్డారని సమాచారం. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 90 స్థానాల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసి వారికి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పాలనే యోచనలో రేవంత్‌ ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.  

దక్షిణ తెలంగాణపైనే గురి.. 
రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను బట్టి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ అంతర్గతంగా అంచనా వేస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్‌లతో పాటు ఖమ్మంలోని మెజార్టీ స్థానాల్లో ఈసారి గట్టిపోటీ ఇస్తామని భావిస్తోంది. కచ్చితంగా టీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ సీట్లు వస్తాయనే ధీమా గాంధీభవన్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ కూడా తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తున్నట్టు సమాచారం. ఈ ఐదు జిల్లాల్లో కలిపి 50కి పైగా స్థానాలుండగా (రంగారెడ్డి జిల్లాలో గ్రేటర్‌ పరిధిలోకి వచ్చే స్థానాలను మినహాయించి) అందులో కనీసం 40 స్థానా ల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

ఇక నగర శివార్లలోని కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్‌బీనగర్‌లతో పాటు హైదరాబాద్‌ జిల్లాలోకి వచ్చే నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్, సనత్‌నగర్, కంటోన్మెంట్‌ స్థానాలపై కీలక కసరత్తు ను ఇప్పటికే రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ స్థానా ల్లో గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో పడ్డారు. మొత్తం మీద ఈ 60కి పైగా స్థానాల్లో 45 గెలిస్తేనే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశముంటుందనే అంచనాతో ఆయన ముందుకెళుతున్నారు. 

ఇక్కడ గట్టిగా ప్రయత్నించాలి 
ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే అక్కడ టీఆర్‌ఎస్‌ బలంగా ఉందని, అయితే పార్టీ పరంగా కీలక నాయకులున్న స్థానాల్లో గెలుపు కోసం గట్టిగా ప్రయత్నించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇందుకోసం దక్షిణ తెలంగాణ కంటే ముందుగానే కార్యరంగంలోకి దిగాలని యోచిస్తోంది. అందులో భాగంగానే ఉత్తర తెలంగాణలోని ముఖ్య నేతలు, వారు పోటీ చేయాలనుకునే స్థానాల జాబితా ఇప్పటికే తయారయింది. ఈ స్థానాల్లో కష్టపడి పనిచేస్తే విజయం తథ్యమని, కాంగ్రెస్‌ నేతల వ్యక్తిగత చరిష్మాతో పాటు గత మూడు, నాలుగు సార్లుగా ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలపై ఉన్న వ్యతిరేకత ఇందుకు ఉపకరిస్తాయని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది.

ఈ కోణంలోనే ఉత్తర తెలంగాణలోని 45–50 నియోజకవర్గాలపై రేవంత్‌ ప్రత్యేక దృష్టి సారించారు. తాను టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిస్థితి కొంత మెరుగుపడిందని భావిస్తున్న ఆయన.. ఇదే అదనుగా ఉత్తర తెలంగాణలో జోరు పెంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి ప్రారంభించారు. మూడో సభను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తోన్న గజ్వేల్‌లో నిర్వహించబోతున్నారు. గజ్వేల్‌లో విజయవంతంగా సభను నిర్వహించడం ద్వారా ఉత్తర తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో కేడర్‌ను ఎన్నికల పోరాటానికి సిద్ధం చేయాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.  

చురుగ్గా లేకపోతే గుర్తింపు ఉండదు 
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ నేతలను పరుగులు పెట్టిస్తున్న రేవంత్‌ వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. పనితీరు మెరుగుపడాల్సిందేనని, చురుగ్గా లేకపోతే పార్టీలో తగిన గుర్తింపు ఉండదని స్పష్టం చేస్తున్నారు. గురువారం గాంధీభవన్‌లో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమ సమన్వయకర్తల సమావేశంలో ఆయన బహిరంగంగానే పార్టీ నేతలకు చురకలంటించారు. ‘దండోరా కార్యక్రమాన్ని పార్టీ సీరియస్‌గా పరిగణిస్తోంది.

జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నియోజకవర్గాల వారీగా నివేదికలివ్వాలి. మండల అధ్యక్షుల పనితీరు బాగుంటేనే నియోజకవర్గాల్లో రాజకీయంగా ముందుకెళ్లగలుగుతాం. ప్రజాసమస్యలపై పోరాటాల్లో నాయకులు చురుగ్గా వ్యవహరించాల్సిందే..’అని రేవంత్‌ స్పష్టం చేశారు. 

వరంగల్‌ దండోరా సభకు రాహుల్‌! 
మరోవైపు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాలున్న వరంగల్‌ పార్లమెంటు పరిధిలో వచ్చే నెల 7 నుంచి 17వ తేదీ మధ్య పెద్ద ఎత్తున ఆత్మగౌరవ దండోరా సభ నిర్వహించాలని, దానికి రాహుల్‌గాంధీని తీసుకురావాలని రేవంత్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రెండు సభల తర్వాత ఉత్తర తెలంగాణ పార్టీ పరిస్థితిలో మరింత మార్పు కనిపిస్తుందనే ధీమా రేవంత్‌ శిబిరంలో వ్యక్తమవుతోంది. ఇలావుండగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పార్టీ అనుబంధ సంఘాల బలోపేతంపై కూడా రేవంత్‌ దృష్టి సారించారు. పార్టీకి పట్టుకొమ్మలైన అనుబంధ సంఘాలు నిర్లిప్తంగా ఉండకూడదని, అనుబంధ సంఘాలు క్రియాశీలంగా పనిచేస్తే ఎన్నికలను ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదనే భావనలో ఆయన ఉన్నట్టు సమాచారం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement