24 గంటలు గడవకముందే చిచ్చు
సాక్షి, ముంబై: మహాకూటమిలోకి స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ చేరి 24 గంటలు గడవకముందే లోక్‌సభ సీట్ల పంపకంపై చిచ్చు మొదలైంది. ఆ పార్టీ నాయకుడు, ఎంపీ రాజు శెట్టి మంగళవారం మహాకూటమిలో చేరిన సంగతి తెలిసిందే. పశ్చిమ మహారాష్ట్రలో రైతుల సమస్యలపై పోరాడుతున్న శెట్టికి అక్కడ మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించిన మహాకూటమి నాయకులు శెట్టితో సంప్రదింపులు జరిపి తమలో చేర్చుకున్నారు.
అంతవరకూ బాగానే ఉన్నప్నటికీ సీట్ల పంపకాల విషయంలో అప్పుడే రగడ మొదలైంది. స్వాభిమాన్ కంటే తమ పార్టీ పెద్దదని, అందువల్ల ఆ పార్టీకి రెండు సీట్లు కేటాయిస్తే తమకు కనీసం మూడు లోక్‌సభ స్థానాలు ఇవ్వాలంటూ ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. మరోవైపు ఆర్‌పీఐకి ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై బీజేపీ, శివసేనలు ఇప్పటికే మల్లగుల్లాలు పడుతుండగా స్వాభిమాన్‌కంటే తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఆర్‌పీఐ డిమాండ్ చేయడం మహాకూటమికి తలనొప్పిగా పరిణమించింది. ఇది మున్ముందు మరింత జటిలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.