సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్ల పంపకాల విషయమై మహాకూటమిలోని పార్టీల మధ్య ఇంకా సయోధ్య కుదరలేదు. పంపకాల ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు శివసేన, బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ శేత్కారీ సంఘటనల మధ్య మంగళవారం బాంద్రాలోని రంగ్‌శారదా సభాగృహంలో జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. తమకంటే తమకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని అన్ని పార్టీలూ పట్టుబట్టడంతో ఎటూ తేలకుండానే చర్చలు ముగిశాయి. దీంతో పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయమై సయోధ్య కుదిర్చేందుకు ఉద్ధవ్‌ఠాక్రే, గోపీనాథ్ ముండే, రాందాస్ ఆఠవలే, రాజుశెట్టి, మహాదేవ్ జాన్కర్‌లతో కూడిన ఓ ఉన్నత స్థాయి కమిటీని వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే, బీజేపీ నాయకుడు గోపినాథ్ ముండే, ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే, స్వాభిమాన్ శేత్కారీ సంఘటన ఎంపీ రాజుశెట్టి, రాష్ట్రీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు మహాదేవ్ జాన్కర్ హాజరయ్యారు. వీరితోపాటు శివసేనకు చెందిన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి, సుభాష్ దేశాయ్, సంజయ్ రావుత్, ఆదిత్య ఠాక్రే, బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ ఖడ్సే, వినోద్ తావ్డే, ఆర్పీఐకి చెందిన అవినాశ్ మహాతేకర్, అర్జున్ డాంగ్లే తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తమకు నాలుగు లోక్‌సభ స్థానాలు కావాలంటూ రాజుశెట్టి పట్టుబట్టడంతో ఆఠవలే తమకు కూడా మూడు లోక్‌సభ స్థానాలు కావాలని భీష్మించుకు కూర్చున్నారు.
మహాదేవ్ జాన్కర్ మాఢా నియోజక వర్గాన్ని తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాజుశెట్టి స్పందిస్తూ మాఢాను తమకే కేటాయించాలని పట్టుబట్టారు. ఇద్దరూ అదే నియోజకం వర్గం కావాలంటూ డిమాండ్ చేశారు. గతంలో జాన్కర్ మాఢా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఇటీవల మహాకూటమిలో చేరిన సమయంలో రాజుశెట్టి కూడా మాఢా నియోజకవర్గాన్ని తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మాఢా నియోజక వర్గంపై మహాకూటమి నాయకులు ఎటూ తేల్చలేకపోయారు. దీంతో మిగతా విషయాల జోలికి వెళ్లకుండానే సమావేశం ముగిసింది. సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని చివరకు నిర్ణయం తీసుకున్నారు. కమిటీ నిర్ణయాన్ని అన్ని పార్టీలు అంగీకరించాల్సిందేనని షరతులు విధించారు.
సీట్లకోసం సిగపట్లు!
Published Wed, Jan 15 2014 11:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement