డీఎఫ్ ఢమాల్! | NDTV-Hansa Research survey: BJP projected to win 195 seats | Sakshi
Sakshi News home page

డీఎఫ్ ఢమాల్!

Published Fri, Apr 4 2014 10:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

NDTV-Hansa Research survey: BJP projected to win 195 seats

సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి మహారాష్ట్రలో శివసేన, బీజేపీల మహాకూటమి అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు అనేక సంస్థలు సర్వేలు నిర్వహించాయి. వీటిలో దాదాపు అన్ని సర్వేలు మహాకూటమికే అధిక స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. ముఖ్యంగా ఎన్‌డీటీవీ కోసం హన్సా రీసెర్చ్ చేసిన సర్వేలో రాష్ట్రంలోని 48 స్థానాల్లో ఏకంగా 36 స్థానాలను శివసేన, బీజేపీల మహాకూటమి కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీల డీఎఫ్ కూటమి కేవలం 10 స్థానాలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలిపింది.

మిగతా రెండు స్థానాల్లో ఎమ్మెన్నెస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో పేర్కొంది. మరోవైపు ఐబీఎన్ నెట్‌వర్క్, ది వీక్ మీడియా సంస్థల కోసం సీఎస్‌డీఎస్ సర్వే చేపట్టింది. ఈ సంస్థ ప్రతినెలా రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రభావం హెచ్చుతగ్గులపై సర్వే చేస్తోంది. తాజాగా చేసిన ఈ సర్వేలో ఫిబ్రవరి కంటే మార్చిలో మహాకూటమి మరింత బలోపేతమైనట్టు తెలిపింది. మార్చి నెలలో చేసిన సర్వేలో మహాకూటమికి 24 నుంచి 30 స్థానాలు, డీఎఫ్ కూటమికి 16 నుంచి 22 స్థానాలు వస్తాయని పేర్కొంది.

 ఇదిలాఉండగా  ‘టైమ్స్ నౌ’ సర్వే కూడా మహాకూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెప్పింది. ఫిబ్రవరిలో చేసిన సర్వేలో మహాకూటమికి 30 స్థానాలు వస్తాయని పేర్కొనగా, డీఎఫ్ కూటమికి కేవలం 14 స్థానాలు మాత్రమే వస్తాయని పేర్కొంది.
 ఇక ఎమ్మెన్నెస్, ఆప్ తదితర ఇతర పార్టీలు కూడా నాలుగు స్థానాలు గెలుచుకుంటాయని చెప్పింది. ఇలా వివిధ సర్వేలు మహాకూటమి అత్యధిక లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేశాయి. దీనిపై కాషాయ నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు మాత్రం సర్వేల ఫలితాలను కొట్టిపారేస్తున్నారు.

 మోడీ ప్రభావమే కారణం...
 ఐదారునెలల క్రితం వరకు మహాకూటమి పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండగా ఒక్కసారిగా గాలి అటువైపు మళ్లడంపై రాజకీయ పండితులు అనేక విశ్లేషణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కూటమికి జనాదరణ పెరగడానికి మోడీ మేనియానే కారణమని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా మోడీ హవా వీస్తుండడంతో రాష్ట్రంలోని ప్రజలు కూడా అటువైపే మొగ్గుచూపుతున్నారని, ఇది మరోరకంగా మహాకూటమికి కలిసొస్తుందని చెబుతున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య అంతర్గత కుమ్ములాటలు, పాలనాపరంగా డీఎఫ్ కూటమిపై అసంతృప్తి ప్రజలను ప్రత్యామ్నాయ కూటమివైపు మొగ్గు చూపేలా చేస్తోందంటున్నారు.
 
 ఏ సర్వేలో ఎవరికెన్ని?
 సర్వే సంస్థ          మహాకూటమి         డీఎఫ్           ఇతరులు
 హన్సా రీసెర్చ్       36                      10                2
 టైమ్స్ నౌ             30                     14                 4
 సీఎస్‌డీఎస్         24-30                  16-22           02-04
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement