రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు మారినప్పటికీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా ప్రధాన పోటీ డెమోక్రటిక్ ఫ్రంట్ (కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి), బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి మధ్యనే జరగనుంది. అయితే కొన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లో మాత్రం మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సమాజ్‌వాదీ పార్టీ, ఇతర పార్టీల ప్రభావం కన్పిస్తోంది.
దాంతో కొన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ, బహుముఖ పోటీ జరగనుంది. ఈసారి కూడా తమ పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తుండగా, బలం పెంచుకునేందుకు బీజేపీ, శివసేన, ఆర్‌పీఐ, స్వాభిమానీ, శివసంగ్రామ్‌ల మహాకూటమి ప్రయత్నిస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. - సాక్షి, ముంబై
మహాకూటమి..
గత ఎన్నికల్లో కాషాయ కూటమిగా పోటీ చేసిన శివసేన, బీజేపీలు ఈసారి ఆర్‌పీఐ, స్వాభిమాని, శివసంగ్రామ్ తదితర పార్టీలతో కలిసి మహాకూటమిగా ఏర్పడింది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ కూటమికే అత్యధిక స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. సర్వేలు కూడా దాన్నే స్పష్టం చేస్తున్నాయి.
అయితే ఈ కూటమి విజయావకాశాలపై అంతర్గత విభేదాలతోపాటు ఎమ్‌ఎన్‌ఎస్ ప్రభావం పడే అవకాశం కన్పిస్తోంది. బీజేపీ సంప్రదాయ ఓటుకు గండికొట్టడంలో ఎమ్‌ఎన్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఈసారి నరేంద్ర మోడీ హవా ఉందని, దీంతోపాటు ప్రజల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ నాయకుల అవినీతి కుంభకోణాల కారణంగా మహారాష్ట్ర నుంచి కనీసం 30కిపైగా సీట్లు గెలుచుకోగలమని బీజేపీ విశ్వసిస్తోంది.పార్టీలోని సీనియర్ నేతలు నితిన్ గడ్కరీ, గోపీనాథ్ ముండే మధ్య.. బీజేపీ, శివసేనల మధ్య నెలకొని ఉన్న విభేదాలు ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఎమ్‌ఎన్‌ఎన్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ భేటీ కావడంపై శివసేన గుర్రుగా ఉంది.
మరోవైపు పలు ప్రాంతాల్లో బీజేపీని టార్గెట్ చేసేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. బీజేపీ తరఫున బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ(నాగ్‌పూర్), గోపీనాథ్‌ముండే(బీడ్), దివంగత ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్ మహాజన్(ముంబై నార్త్ సెంట్రల్) బరిలో ఉన్నారు.
శివసేనలో ఇటీవల పార్టీ ఫిరాయింపులు పెద్ద ఎత్తున జరిగాయి. పార్టీకి చెందిన సిటింగ్ ఎంపీలు సైతం పార్టీని వీడారు. మరోవైపు ఎమ్‌ఎన్‌ఎస్ ప్రభావం శివసేన అభ్యర్థులపై పడే అవకాశముంది. ఇప్పటికే శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే, ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ థాకరేలు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకోవడం ప్రారంభించారు. అయితే, శివసేన ముంబై సహా మహారాష్ట్రలోని పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉంది.
‘మహా’ సంగ్రామం
Published Sun, Apr 6 2014 12:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement