సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శివసేన, బీజేపీ, ఆర్పీఐ నేతృత్వంలోని మహాకూటమి వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా విజయం తథ్యమనే ధీమాతో ఉంది. ఒకవేళ అదే జరిగితే మహాకూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న శివసేన, బీజేపీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలనే విషయంపై అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి భారీ మెజారిటీ రావడంతో ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అక్కడ మంత్రివర్గం పూర్తిగా కొలువుదీరక ముందే కొందరు వచ్చే శాసనసభ ఎన్నికలపై బేరీజు వేసుకోవడం మొదలుపెట్టారు. కొందరు బీజేపీ నాయకులు ఢిల్లీలో నరేంద్ర.. మహారాష్ట్రలో దేవేంద్ర (బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు దేవేం ద్ర ఫడ్నవీస్) అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు.
దీనిపై శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తను కూడా ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నానని ఇప్పటికే సంకేతాలిచ్చారు. మరోపక్క బీజేపీ నుంచి గోపినాథ్ ముండే మొదలుకుని వినోద్ తావ్డే పేర్లు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చర్చల్లో ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేందుకు ఎన్నికలకు ముందే ఇరు పార్టీల్లో పోటీ ప్రారంభమైంది. ఇరుపార్టీల మధ్య గొడవలు రాకుండా ఉండాల ంటే రెండున్నరేళ్ల చొప్పున రెండు పార్టీలు సీఎం పదవిని పంచుకోవాలనే అంశం తెరమీదకు వచ్చింది. కాని ఈ రెండు పార్టీల మధ్య ముందుగా జరిగిన ఒప్పందం ప్రకారం.. శాసనసభలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే సీఎం పదవి చేపట్టాలి. ఈ లెక్కన శివసేన ఎక్కువ స్థానాల్లో పోటీచేయడంవల్ల బీజేపీ కంటే ముందుంటుంది. కాని లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీచేసి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. కాని ఈ విషయంలో శివసేన తన ఆలోచనను మార్చుకుంటుందా.. అనేది అంతుచిక్కడం లేదు.
సీఎం పీఠం కోసం ‘మహా’ పోటీ
Published Fri, May 30 2014 11:38 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement