మాధవ్ శింగరాజు
శరద్ పవార్, నేను, నానా పటోలే ఒక దగ్గర కూర్చొని ఉన్నాం. ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్‌జీ హఠాత్తుగా! 83 ఏళ్ల వయసులో కూడా ఆయన, మెలకువలోంచి కళ్లు తెరిచినట్లుగా... హఠాత్తుగా, ‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నాం’’ అనే ప్రశ్న వేయగలిగారంటే అది ఆయనలోని తరగని రాజకీయ చైతన్యానికి ఒక స్పష్టమైన సంకేతమనే అనుకోవాలి.
ఎక్కడ కూర్చొని ఉన్నామో చెప్పబోయాన్నేను. ‘‘ఉద్ధవ్‌జీ! మీరాగండి నేను చెబుతాను’’ అన్నారు నానా పటోలే!! విస్మయంగా ఆయన వైపు చూశాను.
‘‘సరే, మీరే చెప్పండి నానాజీ’’ అన్నాను. నానాజీ ఏం చెప్పినా – మేము కూర్చొని ఉన్నది ముంబై హెర్డియా మార్గ్‌లోని ఎన్సీపీ పార్టీ ఆఫీసు తప్ప మరొకటి అవటానికి లేదు.
‘‘మనమిప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నామంటే శరద్‌జీ... సరిగ్గా ఒక పరాజయ పీఠం మీద! అది కూడా ముగ్గురం సర్దుకుని కూర్చున్నాం...’’ అన్నారు నానాజీ!
అంటే... ఎన్సీపీ–శివసేన–కాంగ్రెస్. ‘‘మీరేమంటున్నారు నానాజీ, కలిసి పోటీ చేయటం వల్ల మన మూడు పార్టీలు ఓడిపోయాయనేనా?’’ అన్నాను.
‘‘ఉద్ధవ్‌జీ... అక్కడ బీజేపీ కూటమిలో శివసేన ఉంది, ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ శివసేన ఉంది. అక్కడ బీజేపీ కూటమిలో ఎన్సీపీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ కూటమిలోనూ ఎన్సీపీ ఉంది. అయినప్పటికీ వాళ్లే ఎందుకు గెలిచారో తెలుసా?’’ అన్నారు నానాజీ.
‘‘కానీ నానాజీ, మనమిక్కడ కూర్చున్నది వాళ్లెందుకు గెలిచారు అని కాక, మనం ఎందుకు ఓడిపోయామో ఒకర్నుంచి ఒకరం తెలుసుకోటానికి కదా...’’ అన్నాను.
‘‘అదే అంటున్నాను ఉద్ధవ్‌జీ... వాళ్లెందుకు గెలిచారో తెలిస్తే, మనమెందుకు ఓడిపోయామో తెలుస్తుంది. పోనీ, మీరన్నట్లు మనం ఎందుకు ఓడిపోయామో తెలుసుకుంటే వాళ్లెందుకు గెలిచారో తెలుస్తుంది కానీ, వాళ్ల గెలుపుతో మనకు పనేమిటి? మన ఓటమి గురించి మనం ఆలోచించాలి కానీ...’’ అన్నారు నానాజీ!
ఆలోచనలో పడ్డాన్నేను. గెలుపోటములు అన్నవి రెండు భిన్నమైన స్థితులా లేక, పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండే పరిస్థితులా?
‘‘సరే చెప్పండి నానాజీ! వాళ్లెందుకు గెలిచారని మీరు అనుకుంటున్నారు?’’ అన్నాను.
‘‘గెలవకుండా ఎలా ఉంటారు ఉద్ధవ్‌జీ! ‘విడిపోతే దెబ్బతింటాం. కలిసుంటే భద్రంగా ఉంటాం’ అని కదా వాళ్ల నినాదం. అది పట్టేసింది మహారాష్ట్రా వాళ్లకు, మహారాష్ట్రలో ఉండే గుజరాతీలకు; ఇంకా... హిందువులకు, ముస్లిములకు! పైకే నినాదం. లోపల అది బెదిరింపు. ఓట్లు విడిపోతే పాట్లు తప్పవని...’’ అన్నారు నానాజీ.
‘‘అందుకే ఓడామా మనం?’’ అన్నాను.
‘‘కాదు’’ అన్నారు.
‘‘మరి?’’ అన్నాను.
‘‘శివసేన నుంచి శివసేన, ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయి, ఒకదాన్ని ఒకటి ఓడించాయి. రెండూ కలిసి కాంగ్రెస్‌ను ఓడించాయి’’ అన్నారు నానాజీ... ‘మీతో కలిసి మేం దెబ్బతిన్నాం’ అనే అర్థంలో!!
నేను మౌనంగా ఉండిపోయాను. నానాజీ కూడా కాసేపు మౌనం పాటించారు.
‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అన్నారు శరద్‌జీ హఠాత్తుగా!
అప్పుడు గానీ... ఆయన్ని పట్టించు కోకుండా మేమిద్దరమే చాలాసేపటిగా మాట్లాడుకుంటూ ఉన్నామన్న సంగతి మాకు స్పృహలోకి రాలేదు!
‘ఎక్కడ కూర్చొని ఉన్నాం’ అనే తన ప్రశ్నకు, ‘‘పరాజయ పీఠం’’ మీద అన్న నానాజీ జవాబు ఆయన్ని సంతృప్తి పరిచే ఉండాలి.
లేకుంటే – ‘‘మనమిక్కడ ఎంతసేపటిగా కూర్చొని ఉన్నాం?’’ అనే కొనసాగింపు ప్రశ్న వేసి ఉండేవారు కాదు శరద్‌జీ.
Comments
Please login to add a commentAdd a comment