మహారాష్ట్రలో ఎన్నికల తేదీ దగ్గరపడుతోన్నకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ఓవైపు నామినేషన్ వేసిన వారు ప్రచారాలతో విజయం కోసం హోరెత్తిస్తుండటంతో.. మరోవైపు టికెట్ దక్కని వారు నిరశలో కూరుకుపోయారు.
ఈ క్రమంలో ఓ అనూహ్య విషయం వెలుగులోకి వచ్చింది. టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనను కాదని మరొకరికి టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురై కనిపించకుండాపోయారు. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. పాల్ఘర్ స్థానం నుంచి ఆయనకు బదులు మాజీ ఎంపీ రాజేంద్ర గోవిట్‌ను బరిలోకి దింపింది. దాంతో శ్రీనివాస్ తీవ్ర వేదనకు గురైన శ్రీనివాస్ సోమవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు.
కాగా 2022లో ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని వీడి చీలికవర్గమైన షిండేతో వెళ్లిన నేతల్లో శ్రీనివాస్ వంగా ఒకరు. ఎమ్మెల్యే అదృశ్యంతో సీఎం షిండే వంగా భార్యతో ఫోన్ మాట్లాడారు. అతను కనిపించకుండా పోయే ముందు.. వంగా మీడియాతో మాట్లాడుతూ.. షిండే కోసం దేవుడిలాంటి వ్యక్తిని (ఉద్ధవ్ ఠాక్రే) విడిచిపెట్టానని, ప్రస్తుతం తనకు తగిన శాస్తి జరిగిందని చెప్పారు.షిండేకు విధేయుడిగా ఉన్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నట్లు తెలిపారు.
ఇక ఆ తర్వాత నుంచి శ్రీనివాస్ జాడ తెలియరావడం లేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తనకు సీటు ప్రకటించకపోయే సరికి తీవ్ర నిరాశకు గురైనట్లు శ్రీనివాస్ భార్య తెలిపారు. సోమవారం బ్యాగ్ సర్దుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే.. మళ్లీ అందుబాటులోకి రాలేదని చెప్పారు. అయితే అదృశ్యమయ్యే ముందు తాను షిండే వర్గంలో చేరినందుకు పశ్చాత్తాపడుతున్నానని, ఉద్దవ్ ఠాక్రేను కలిసి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు తనతో చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.
ప్రస్తుతం పోలీసులు ఆయనకోసం గాలిస్తున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment