సాక్షి, నేషనల్ డెస్క్: అసలైన శివసేన ఎవరిదో తేలిపోయింది. మరాఠా పులి బాల్‌ఠాక్రే రాజకీయ వారసుడు ఎవరన్నదానిపై మహారాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చేశారు. శివ సైనికులు ఏక్‌నాథ్ శంభాజీ షిండేను తమ నాయకుడిగా గుర్తించారు. కుట్రదారుడిగా ప్రత్యర్థుల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న షిండే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తుఫాను సృష్టించారు. గర్జించిన బెబ్బులిలా అత్యంత బలమైన మరాఠా నాయకుడిగా అవతరించారు.
బీజేపీ నేతృత్వంలోని మహాయుతిలో భాగమైన శివసేన(షిండే) 81 స్థానాల్లో పోటీ చేసింది. 57 సీట్లు సాధించింది. మహా వికాస్ అఘాడీలో భాగస్వామి అయిన శివసేన మరో చీలిక వర్గం శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) 95 సీట్లలో పోటీ చేసి కేవలం 20 సీట్లలో గెలిచింది. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 15 సీట్లలో పోటీ చేసిన శివసేన(షిండే) 7 సీట్లు గెలుచుకుంది. 21 సీట్లలో పోటీ చేసిన శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) 9 సీట్లు సొంతం చేసుకుంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ చక్కటి ఫలితాలు సాధించిన షిండే అసలైన శివసేన అధినేతగా తన స్థానం పదిలపర్చుకున్నారు.
ఉపకరించిన సంక్షేమ పథకాలు
ముఖ్యమంత్రిగా షిండే అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మహా యుతి విజయానికి దోహదపడ్డాయి. ప్రధానంగా లాడ్లీ బెహన్ యోజన విశేషమైన ప్రభావం చూపింది. ఈ పథకం కింద 2.5 కోట్ల మంది పేద మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున అందజేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఈ మొత్తాన్ని రూ.2,100కు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతిఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, వృద్ధులకు ఉచితంగా యాత్రలు, పేద విద్యారి్థనులకు ఉచితంగా వృత్తి విద్య వంటి హామీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. శివసేన వాస్తవానికి హిందుత్వ పారీ్టగా పుట్టుకొచి్చంది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఆ పార్టీ అభిమానులకు నచ్చలేదు. షిండే వర్గం బీజేపీతో జట్టుకట్టడం హిందుత్వవాదులను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.
కార్మిక ఉద్యమాలతో రాజకీయ ప్రస్థానం
ఏక్‌నాథ్ షిండే 1964 ఫిబ్రవరి 9న సతారా జిల్లాలో జన్మించారు. మరాఠా సామాజికవర్గానికి చెందిన షిండే శివసేన వైపు ఆకర్షితులయ్యారు. తొలుత కారి్మక ఉద్యమాల్లో పాల్గొన్నారు. బలమైన కారి్మక నాయకుడిగా గుర్తింపు పొందారు. 2004లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. వరుసగా నాలుగు పర్యాయాలు విజయం సాధించారు. 2014 నుంచి 2019 దాకా మంత్రిగా సేవలందించారు. పలు కీలక శాఖలను నిర్వర్తించారు.
2022లో ఏక్‌నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి శివసేన నుంచి బయటకు వచ్చారు. శివసేన(షిండే) పారీ్టగా గుర్తింపు పొందారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2022 జూన్ 30న ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నందుకు షిండే రాజకీయ జీవితం అంతమవుతుందని అప్పట్లో విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, తాను ఎంచుకున్న దారే సరైనదేనని షిండే నిరూపించారు.
Comments
Please login to add a commentAdd a comment