గిట్టుబాటు ధర కోసం ఉద్యమించిన చెరకు రైతులు
సాక్షి, ముంబై: చెరకు రైతులు మళ్లీ రోడ్డెక్కారు. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో అనేక ఇబ్బందులు పడుతున్న తమకు సర్కార్ కనీస మద్ధతు ధర రూ.మూ డు వేలు కల్పించి ఆదుకోవాలంటున్నారు. గిట్టుబాట ధర కోసం ఢిల్లీలో మంగళవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో అఖిల పక్ష బృందం భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ప్రధాని నుంచి ఎటువంటి హామీ రాలేదని తెలుసుకున్న రైతులు, ‘స్వాభిమాని శేత్కారీ సంఘటన్’ కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. మంగళవారం రాత్రి నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసు వాహనాలతోపాటు ఎంఎస్ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు బుధవారం ఉదయం కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. ఆందోళనకారులు పోలీసులు, ఆర్టీసీ, ట్రక్కులతోపాటు ఇతర వాహనాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు. కరాడ్-తాస్గావ్ మార్గంలో మంగళవారం రాత్రి వివిధ వాహనాల టైర్లకు నిప్పంటించారు. ఆపేందుకు వచ్చిన పోలీసుల జీపులపై రాళ్ల దాడికి దిగారు. బుధవారం ఉదయం శెరెపాటా వద్ద రోడ్డుపై చెట్లు నరికి అడ్డంగా పడేశారు. వడగావ్ హవేలి వద్ద టైర్లకు నిప్పం టించారు. ఆందోళన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ముందుజాగ్రత్తగా కరాడ్ నుంచి పుణే-ముంబై వైపు వెళ్లే బస్సు సేవలను నిలిపివేసింది. తాస్గావ్ మార్గంలో మంగళవారం సాయంత్రం నుంచి రాకపోకలపై ప్రభావం పడడంతో ఆ మార్గంవైపు ఒక్క బస్సు కూడా వెళ్లలేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
రూ.మూడు వేలు ఇవ్వాలి....
చెరుకుకు తొలి విడతలో కనీస మద్ధతు ధరను క్వింటాల్‌కు రూ.మూ డు వేల ధర చెల్లించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ‘స్వాభిమాని శేత్కారీ సంఘటన్’ నాయకుడు రాజు శెట్టి తెలిపారు. అయితే ఢిల్లీలో చర్చలు విఫలం కావడంతో రైతులు కోపంగా ఉన్నారన్నారు. అయితే ఎవరూ దాడులకు దిగవద్దని పిలుపునిచ్చారు. వాహనాలను ధ్వంసం చేయవద్దని కోరారు.
తీవ్ర ఇబ్బందులకు గురైన విద్యార్థులు...
ఆందోళన తీవ్రం కావడంతో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ఈ రోజు జరిగిన పరీక్షలకు కూడా హాజరుకాలేకపోయారని తెలిసింది.
గుండ్లు గీయించుకుని నిరసన...
గిట్టుబాటు ధరలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ అనేక మంది ఆందోళనకారులు గుండ్లు గీయిం చుకున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శరద్ పవార్, సీఎం పృథ్వీరాజ్ చవాన్‌ల దిష్టిబొమ్మలను దగ్ధంచేసినట్టు సమాచారం.
గతేడాది కూడా ఇదే పరిస్థితి...
2012 నవంబర్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ సమయంలో గిట్టుబాటు ధరల కోసం చెరకు రైతులు చేపట్టిన ఆందోళనలో ఒకరు ట్రక్కు కింద నలిగి, మరొకరు పోలీసు కాల్పుల్లో ఇద్దరు రైతులు మరణించారు. దీంతో ఆ సమయంలో ఆందోళన తీవ్రరూపందాల్చింది. మరోవైపు ఈసారి కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.