సాక్షి, ముంబై: తనకు రాష్ట్ర మంత్రి పదవి అవసరం లేదని.... కేంద్ర మంత్రివర్గంలో చోటు కావాలని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. శాసన సభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నాగపూర్‌లో జరగనున్న శీతాకాల సమావేశాలకు ముందు ఫడ్నవిస్ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. అందులో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఆర్పీఐకి క్యాబినెట్‌లో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
అయితే ఈ అంశంపై ఇంతవరకు తనతో చర్చ జరగలేదని ఆఠవలే స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌తో కలిసిమెలసి ఉన్న ఆఠవలే అనంతరం కాషాయకూటమితో జతకూడారు. గత లోక్‌సభ ఎన్నికల్లో దళితులు కాషాయ కూటమికి దగ్గరవ్వడంతో వారికి భారీగా సీట్లు వచ్చాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల విషయంలో పొత్తు బెడిసికొట్టడంతో ఆ కూటమిలోని బీజేపీ, శివసేన ఒంటరి పోరుకు సిద్ధపడ్డాయి. కాగా, బీజేపీ మిత్రపక్షంగానే ఉండేందుకు ఆర్పీఐ ఆసక్తి చూపింది. ఈ సమయంలో కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని బీజేపీ తనకు హామీ ఇచ్చిందని ఆఠవలే గుర్తు చేస్తున్నారు.
అయితే మోదీ సర్కార్‌లో రెండో విడత మంత్రివర్గ విస్తరణలోనూ ఆర్పీఐకి చోటు దక్కకపోవడంతో రాందాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాందాస్‌ను బుజ్జగించేందుకు బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఆ పార్టీకి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, తమకు రాష్ట్ర మంత్రివర్గంలో పదవులు అవసరంలేదని, కేంద్రంలో ఇస్తేనే తీసుకుంటామని ఆయన నొక్కివక్కాణిస్తున్నారు.
కేంద్ర పదవే ముద్దు..
Published Mon, Nov 24 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement