The Union Cabinet
-
మంగళగిరి ఎయిమ్స్‌కి గ్రీన్‌సిగ్నల్
విజయవాడ బ్యూరో : మంగళగిరి ఎయిమ్స్‌కు సంబంధించి మరో ముందడుగు పడింది. ఎయిమ్స్ నిర్మాణ పనులకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని నాగ్‌పూర్, కల్యాణి ప్రాంతాలతో పాటు మన రాష్ట్రంలోని మంగళగిరిలో నిర్మించే ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం 2015-16 వార్షిక బడ్జెట్లో రూ.1618 కోట్లు కేటాయించే వీలుందని సూత్రప్రాయంగా తెలిపింది. ఫలించిన ఎదురుచూపులు... రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల్లో భాగంగా మంగళగిరిలోని పాత టీబీ శానిటోరియం స్థలంలో అన్ని సదుపాయాలతో కూడిన ఎయిమ్స్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి పంపింది. కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ 2014 డిసెంబర్లో గుంటూరు జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి టీబీ శానిటోరియం స్థలాన్ని పరిశీలించింది. ప్రభుత్వం కేటాయించిన 193 ఎకరాల విస్తీర్ణంలో 960 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడి కల్ కళాశాల, పరిపాలనా భవనాలను నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించింది. మే 14న పనులు ప్రారంభించేందుకు శంకుస్థాపన ముహూర్తం కూడా ఖరారైంది. అయితే చివరి క్షణంలో శంకుస్థాపన వాయిదా పడింది. ఇక్కడున్న స్థలం సరిపోదన్న వాదనలు బయటకు రావడంతో పక్కనే ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీ సంస్థలకు కేటాయించిన మరో 50 ఎకరాలను కూడా ఎయిమ్స్‌కు కేటాయించారు. ఆ తరువాత కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి సుజనాచౌదరి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోదం లభించగానే ఎయిమ్స్ పనులు ప్రారంభమవుతాయన్నారు. బుధవారం ఈ మేరకు కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. అన్నీ సవ్యంగా జరిగితే నవంబరు 14 లోపే నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగవచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
కేంద్ర పదవే ముద్దు..
సాక్షి, ముంబై: తనకు రాష్ట్ర మంత్రి పదవి అవసరం లేదని.... కేంద్ర మంత్రివర్గంలో చోటు కావాలని ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే స్పష్టం చేశారు. శాసన సభ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నాగపూర్‌లో జరగనున్న శీతాకాల సమావేశాలకు ముందు ఫడ్నవిస్ మంత్రివర్గ విస్తరణ చేయనున్నారు. అందులో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఆర్పీఐకి క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ అంశంపై ఇంతవరకు తనతో చర్చ జరగలేదని ఆఠవలే స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌తో కలిసిమెలసి ఉన్న ఆఠవలే అనంతరం కాషాయకూటమితో జతకూడారు. గత లోక్‌సభ ఎన్నికల్లో దళితులు కాషాయ కూటమికి దగ్గరవ్వడంతో వారికి భారీగా సీట్లు వచ్చాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల విషయంలో పొత్తు బెడిసికొట్టడంతో ఆ కూటమిలోని బీజేపీ, శివసేన ఒంటరి పోరుకు సిద్ధపడ్డాయి. కాగా, బీజేపీ మిత్రపక్షంగానే ఉండేందుకు ఆర్పీఐ ఆసక్తి చూపింది. ఈ సమయంలో కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని బీజేపీ తనకు హామీ ఇచ్చిందని ఆఠవలే గుర్తు చేస్తున్నారు. అయితే మోదీ సర్కార్‌లో రెండో విడత మంత్రివర్గ విస్తరణలోనూ ఆర్పీఐకి చోటు దక్కకపోవడంతో రాందాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో రాందాస్‌ను బుజ్జగించేందుకు బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఆ పార్టీకి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, తమకు రాష్ట్ర మంత్రివర్గంలో పదవులు అవసరంలేదని, కేంద్రంలో ఇస్తేనే తీసుకుంటామని ఆయన నొక్కివక్కాణిస్తున్నారు. -
కేంద్ర కేబినెట్ నుంచి తప్పుకోను: అనంత్ గీతే
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గం నుంచి తాను వైదొలగబోనని శివసేన నేత, కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీతో పొత్తు విచ్ఛిన్నమైనప్పటికీ.. తమ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కొనసాగుతుందని చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు ఆయన పై విధంగా స్పందించారు. అనంత్ గీతే శివసేన నుంచి కేంద్ర కేబినెట్లో ఏకైక మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకంపై ఏర్పడిన ప్రతిష్టంభనతో శివసేనతో పొత్తును బీజేపీ వదులుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ నుంచి శివసేన తప్పుకుం టుందని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై గీతే స్పందిస్తూ.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో శివసేన కీలక పాత్ర పోషించిందని, అందువల్లే రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత బీజేపీ, శివసేన కలిసే అవకాశం ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. భవిష్యత్తు గురించి ఇప్పుడే మాట్లాడటం సరికాదన్నారు. -
కేంద్ర ఉద్యోగులకు 7% డీఏ పెంపు
కేంద్ర కేబినెట్ నిర్ణయం * 107%కు పెరిగిన కరువు భత్యం * ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తింపు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) కేంద్రం మరో 7 శాతం పెంచింది. దీంతో మూలవేతనంలో ప్రస్తుతం 100 శాతంగా ఉన్న డీఏ 107 శాతానికి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ డీఏ పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తించేలా సాధారణ ప్రభుత్వోద్యోగులకు డీఏ అదనపు ఇన్స్టాల్మెంట్, పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) అదనపు ఇన్స్టాల్మెంట్ విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపు 30 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, సుమారు 50 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. నిత్యావసరాల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ, డీఆర్‌ను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 2014-15 ఆర్థిక సంవత్సరంలో (2014 జూలైనుంచి 2015 ఫిబ్రవరి వరకూ మొత్తం 8 నెలలు) ఖజానాపై డీఏ వల్ల రూ. 7,691 కోట్లు, డీఆర్ వల్ల రూ. 5,127 కోట్ల ఆర్థిక భారం పడనుంది. పారిశ్రామిక కార్మికులపై వినియోగదారుల ధరల సూచీ 12 నెలల సగటు ఆధారంగా ప్రభుత్వం డీఏను లెక్కించింది. దీనిప్రకారం 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 30 వరకూ పారిశ్రామిక కార్మికులపై ద్రవ్యోల్బణం సగటు రేటు 7.25 శాతంగా ఉండటంతో ఉద్యోగులకు డీఏను కేంద్రం పెంచిం ది. గత యూపీఏ ప్రభుత్వం ఫిబ్రవరి 28న డీఏను 90 శాతం నుంచి 100 శాతానికి పెంచింది. కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు... సంప్రదాయ ఔషధ విధానంతోపాటు హోమియోపతిని బంగ్లాదేశ్‌లో ప్రోత్సహించేందుకు ఆ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. దేశంలో పర్యావరణ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై చర్చించేందుకు కమిటీ వేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రులు గడ్కారీ, అనంత్ కుమార్, గోయల్, జవదేకర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. కాగా, ప్రధాని మోడీ తన జపాన్ పర్యటనను విజయవంతంగా, పూర్తి చేసినందుకు ప్రశంసిస్తూ హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఇతర మంత్రులంతా మద్దతు తెలిపారు.