కేంద్ర కేబినెట్ నిర్ణయం
* 107%కు పెరిగిన కరువు భత్యం
* ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! ఉద్యోగుల కరువు భత్యాన్ని (డీఏ) కేంద్రం మరో 7 శాతం పెంచింది. దీంతో మూలవేతనంలో ప్రస్తుతం 100 శాతంగా ఉన్న డీఏ 107 శాతానికి చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ డీఏ పెంపు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ ఏడాది జూలై 1 నుంచి వర్తించేలా సాధారణ ప్రభుత్వోద్యోగులకు డీఏ అదనపు ఇన్‌స్టాల్‌మెంట్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) అదనపు ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
ప్రభుత్వ నిర్ణయం వల్ల దాదాపు 30 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, సుమారు 50 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. నిత్యావసరాల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ, డీఆర్‌ను పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల 2014-15 ఆర్థిక సంవత్సరంలో (2014 జూలైనుంచి 2015 ఫిబ్రవరి వరకూ మొత్తం 8 నెలలు) ఖజానాపై డీఏ వల్ల రూ. 7,691 కోట్లు, డీఆర్ వల్ల రూ. 5,127 కోట్ల ఆర్థిక భారం పడనుంది.
పారిశ్రామిక కార్మికులపై వినియోగదారుల ధరల సూచీ 12 నెలల సగటు ఆధారంగా ప్రభుత్వం డీఏను లెక్కించింది. దీనిప్రకారం 2013 జూలై 1 నుంచి 2014 జూన్ 30 వరకూ పారిశ్రామిక కార్మికులపై ద్రవ్యోల్బణం సగటు రేటు 7.25 శాతంగా ఉండటంతో ఉద్యోగులకు డీఏను కేంద్రం పెంచిం ది. గత యూపీఏ ప్రభుత్వం ఫిబ్రవరి 28న డీఏను 90 శాతం నుంచి 100 శాతానికి పెంచింది.
కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు...
సంప్రదాయ ఔషధ విధానంతోపాటు హోమియోపతిని బంగ్లాదేశ్‌లో ప్రోత్సహించేందుకు ఆ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలన్న ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.
దేశంలో పర్యావరణ నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై చర్చించేందుకు కమిటీ వేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రులు గడ్కారీ, అనంత్ కుమార్, గోయల్, జవదేకర్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. కాగా, ప్రధాని మోడీ తన జపాన్ పర్యటనను విజయవంతంగా, పూర్తి చేసినందుకు ప్రశంసిస్తూ హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఇతర మంత్రులంతా మద్దతు తెలిపారు.
కేంద్ర ఉద్యోగులకు 7% డీఏ పెంపు
Published Fri, Sep 5 2014 1:53 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement