కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతానికి బీజేపీ, ఆర్పీఐలు కృషి చేస్తుండడంతో శివసేన ఇరకాటంలో పడింది.
సాక్షి, ముంబై: కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతానికి బీజేపీ, ఆర్పీఐలు కృషి చేస్తుండడంతో శివసేన ఇరకాటంలో పడింది. ఇప్పటిదాకా ఈ నియోజకవర్గం శివసేన అధీనంలో ఉంది. అయితే మిత్రపక్షాలైన బీజేపీ, ఆర్పీఐలు ఈ నియోజవర్గంలో పోటీ చేయాలనే కోరికను పరోక్షంగా ఇలా వెల్లడిస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు. కాగా మిత్రపక్షాల వైఖరిపై శివసేన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా ఓ పార్టీ నియోజకవర్గంపై మిత్రపక్షంలోని మరోపార్టీ దృష్టి సారించడంతో మహాకూటమిలో బీటలువారే ప్రమాదముందనే అభిప్రయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కాషాయకూటమి సీట్ల పంపకంలో కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం శివసేనకు, భివండీ నియోజక వర్గం బీజేపీ వాటాలోకి వెళ్లాయి.
కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంలో శివసేన టికెట్‌పై ఆనంద్ పరాంజపే విజయం సాధించగా, భివండీ లోక్‌సభ నియోజక వర్గంలో బీజేపీ టికెటుపై పోటీచేసిన జగన్నాథ్ పాటిల్ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇదిలాఉండగా కల్యాణ్ నుంచి ఎన్నికైన పరాంజపే ఎన్సీపీవైపు చూస్తున్నట్లు, ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయన తప్పక ఎన్సీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన అనుయాయులు సూచనప్రాయంగా వెల్లడించడంతో బీజేపీ, ఆర్పీఐలు ఈ నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్నాయి. పరాంజపే ప్రత్యర్థి పార్టీలోకి జంప్ చేస్తే ఆ నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలనే డిమాండ్‌ను చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే కల్యాణ్ శివసైనికులు మాత్రం అందుకు అంగీకరించడంలేదు. శివసేన కూడా ఈ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు ఇష్టపడడంలేదు. కల్యాణ్‌లో కేవలం పరాంజపేవల్ల పార్టీ గెలవలేదని, అక్కడ పార్టీకి బలమైన కార్యకర్తలున్నారని శివసేన నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. నేతలు ఎవరు నిలబడినా గెలిపించే సత్తా అక్కడి శివసైనికులకు ఉందని, దీంతో కల్యాణ్‌ను వదులకునే ప్రసక్తే లేదని చెప్పాడు.
వీరివైఖరి ఇలా ఉండగా అటు బీజేపీ మాత్రం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కల్యాణ్‌లో సదస్సు ఏర్పాటుచేసిన బీజేపీ తమ బలమేంటో నిరూపించుకుంది. ఒకవేళ కల్యాణ్ కావాలని ఆర్పీఐ పట్టుబట్టినా ఆ పార్టీలో సమర్థులైన అభ్యర్థులెవరూ లేరు. దీంతో ఇక్కడ ఆర్పీఐకి విజయం అంత సులభంగా దక్కే అవకాశం లేదు. దీంతో శివసేన లేదా బీజేపీ అభ్యర్థులనే బరిలో దింపాల్సి ఉంటుంది. అయితే ఎవరు బెట్టు చేస్తారు? ఎవరు పట్టువిడుపులు పాటిస్తారనేది ఎన్నికలు సమీపిస్తేగానీ తెలియదు.