kalyan lok sabha constituency
-
ఓటరు జాబితాలో 66చోట్ల ఒకే వ్యక్తి పేరు
సాక్షి, ముంబై: మోటే లక్ష్మణ్‌దాస్ హిరా చందాని.. పేరు కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గ ఓటరు జాబితాలో ఏకంగా 66 చోట్ల ప్రత్యక్షమైంది. అయితే తన పేరుతో ఉన్న వేర్వేరు వ్యక్తులుగా ముందు భావించిన మోటే పక్కన గుర్తింపు నంబర్ కూడా అదే ఉండడంతో అవాక్కయ్యాడు. అయితే జాబితాలో 66 చోట్ల ఫొటోలు మాత్రం వేర్వేరుగా ఉన్నాయి. కొన్ని చోట్ల తన పేరు, పక్కన మహిళ ఫొటో కూడా ఉంది. దీంతో మోటే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ఓటింగ్ జరుగుతుండడంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ నెల 24న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఓటరు జాబితాలో తన పేరు ఉందో? లేదో? ఉంటే తన పోలింగ్ బూత్ ఎక్కడ? తదితర వివరాలను తెలుసుకునేందుకు భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన వెబ్సైట్లో మోటే తన పేరును వెతుక్కుంటుండగా అసలు విషయం తెలిసొచ్చింది. తన పేరు మాత్రమే కాకుండా, తనకు కేటాయించిన గుర్తింపు నంబర్‌తో ఏకంగా 66 మంది ఉన్నట్లు గుర్తించాడు. అయితే పక్కన ఉన్న ఫొటోలు వేర్వేరు వ్యక్తులవి ఉండడంతో అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన పొరపాటుగా భావించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అయినా అప్పటికే సమయం మించిపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇదిలాఉండగా ఒకే వ్యక్తి పేరు జాబితాలో 66సార్లు కనిపించగా వందలాది మంది పేర్లు అసలు జాబితాలో కనిపించకుండా పోయాయి. ఇలా ఒకే వ్యక్తి పేరు పలుమార్లు రావడంతో అసలు ఉండాల్సిన పేర్లు గల్లంతయ్యాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. -
లోక్‌సభ ఎన్నికలు ‘కల్యాణ్’ నుంచి రమేశ్?
సాక్షి, ముంబై: కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రమేశ్ పాటిల్‌ను బరిలోకి దింపాలని ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే నిర్ణయిం చినట్టు తెలియవచ్చింది. ఈ స్థానం నుంచి ఎన్సీపీ తరఫున ఆనంద్ పరాంజపే, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే పేర్లు ఖరారైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శివసేనకు దూకుడుకు కళ్లెం వేసేందుకుగాను రాజ్... ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 20 నుంచి 25 స్థానాల్లో మాత్రమే తమ పార్టీ పోటీ చేస్తుందని రాజ్‌ఠాక్రే ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే తొలి విడత అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించే అవకాశముంది. ఇదిలాఉండగా 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఠాణే, ముంబై స్థానాల్లో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే కల్యాణ్ స్థానం నుంచి ఆనంద్ పరాంజపే విజయఢంకా మోగించడంతో కొంత పరువు దక్కింది. అయితే అధిష్టానం తీరుతో విసిగిపోయిన ఆనంద్... ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని ఎన్సీపీలో చేరారు. దీంతో ఈ నియోజక వర్గంలో సమర్థుడైన నాయకుణ్ణి ఎంపిక చేయడం శివసేనకు సంక్లిష్టంగా మారింది. దీంతో పార్టీ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండేను అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది. కల్యాణ్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయఢంకా మోగించాలని అటు ఎన్సీపీ, అటు శివసేన ప్రతిష్టగా భావిస్తున్నాయి. కాగా గోపాల్ లాండ్గే, దీపేశ్ మాత్రే, సునీల్ చౌదరి లాంటి దిగ్గజాలను పక్కనబెట్టి రాజకీయాల్లో అంత అనుభవంలేని శ్రీకాంత్ షిండేకు అభ్యర్థిత్వం ఇవ్వడంపై సహచర నాయకులు అసంతృప్తితో ఉన్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో కల్యాణ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెన్నెస్ తరఫున పోటీ చేసిన వైశాలి దరేకర్‌కు లక్షకుపైగా ఓట్లు వచ్చినప్పటికీ మూడో స్థానంలో నిలిచారు. ఆ సమయంలో ఎన్సీపీ పరాజయాన్ని చవిచూసినప్పటికీ శివసేన ఓట్లు కూడా తగ్గాయి. కాగా ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెన్నెస్ తమ అభ్యర్థిని బరిలో దింపడంవల్ల శివసేనకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కల్యాణ్ గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యే రమేశ్ పాటిల్, అడ్వొకేట్ సుహాస్ తెలంగ్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి బయటపడి ఎమ్మెన్నెస్‌లో చేరిన రమేశ్ పాటిల్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో 20 ఏళ్ల రాజకీయ అనుభవమున్న రమేశ్ పాటిల్ వైపే ఎమ్మెన్నెస్ అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఎక్కువగా ఉంది. ఆనంద్ పరాంజపే సిట్టింగ్ ఎంపీ కావడంతో ఎన్సీపీ కూడా తన శక్తినంతా కూడగట్టుకుని ఈ ఎన్నికల బరిలో దిగనుంది. అయితే ఎమ్మెన్నెస్ దీటైన అభ్యర్థిని బరిలో దింపితే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. దీంతో కల్యాణ్ లోక్‌సభ నియోజక వర్గంలో ఏ ఒక్క పార్టీ తామే గెలవగలమని గట్టిగా చెప్పగలిగే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. -
కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంపై పట్టుసాధిస్తున్న బీజేపీ
సాక్షి, ముంబై: కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతానికి బీజేపీ, ఆర్పీఐలు కృషి చేస్తుండడంతో శివసేన ఇరకాటంలో పడింది. ఇప్పటిదాకా ఈ నియోజకవర్గం శివసేన అధీనంలో ఉంది. అయితే మిత్రపక్షాలైన బీజేపీ, ఆర్పీఐలు ఈ నియోజవర్గంలో పోటీ చేయాలనే కోరికను పరోక్షంగా ఇలా వెల్లడిస్తున్నారని రాజకీయ పండితులు చెబుతున్నారు. కాగా మిత్రపక్షాల వైఖరిపై శివసేన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా ఓ పార్టీ నియోజకవర్గంపై మిత్రపక్షంలోని మరోపార్టీ దృష్టి సారించడంతో మహాకూటమిలో బీటలువారే ప్రమాదముందనే అభిప్రయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కాషాయకూటమి సీట్ల పంపకంలో కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం శివసేనకు, భివండీ నియోజక వర్గం బీజేపీ వాటాలోకి వెళ్లాయి. కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గంలో శివసేన టికెట్‌పై ఆనంద్ పరాంజపే విజయం సాధించగా, భివండీ లోక్‌సభ నియోజక వర్గంలో బీజేపీ టికెటుపై పోటీచేసిన జగన్నాథ్ పాటిల్ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇదిలాఉండగా కల్యాణ్ నుంచి ఎన్నికైన పరాంజపే ఎన్సీపీవైపు చూస్తున్నట్లు, ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయన తప్పక ఎన్సీపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన అనుయాయులు సూచనప్రాయంగా వెల్లడించడంతో బీజేపీ, ఆర్పీఐలు ఈ నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్నాయి. పరాంజపే ప్రత్యర్థి పార్టీలోకి జంప్ చేస్తే ఆ నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలనే డిమాండ్‌ను చేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే కల్యాణ్ శివసైనికులు మాత్రం అందుకు అంగీకరించడంలేదు. శివసేన కూడా ఈ నియోజకవర్గాన్ని వదులుకునేందుకు ఇష్టపడడంలేదు. కల్యాణ్‌లో కేవలం పరాంజపేవల్ల పార్టీ గెలవలేదని, అక్కడ పార్టీకి బలమైన కార్యకర్తలున్నారని శివసేన నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. నేతలు ఎవరు నిలబడినా గెలిపించే సత్తా అక్కడి శివసైనికులకు ఉందని, దీంతో కల్యాణ్‌ను వదులకునే ప్రసక్తే లేదని చెప్పాడు. వీరివైఖరి ఇలా ఉండగా అటు బీజేపీ మాత్రం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ కల్యాణ్‌లో సదస్సు ఏర్పాటుచేసిన బీజేపీ తమ బలమేంటో నిరూపించుకుంది. ఒకవేళ కల్యాణ్ కావాలని ఆర్పీఐ పట్టుబట్టినా ఆ పార్టీలో సమర్థులైన అభ్యర్థులెవరూ లేరు. దీంతో ఇక్కడ ఆర్పీఐకి విజయం అంత సులభంగా దక్కే అవకాశం లేదు. దీంతో శివసేన లేదా బీజేపీ అభ్యర్థులనే బరిలో దింపాల్సి ఉంటుంది. అయితే ఎవరు బెట్టు చేస్తారు? ఎవరు పట్టువిడుపులు పాటిస్తారనేది ఎన్నికలు సమీపిస్తేగానీ తెలియదు.