సాక్షి, ముంబై: కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రమేశ్ పాటిల్‌ను బరిలోకి దింపాలని ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే నిర్ణయిం చినట్టు తెలియవచ్చింది. ఈ స్థానం నుంచి ఎన్సీపీ తరఫున ఆనంద్ పరాంజపే, శివసేన తరఫున శ్రీకాంత్ షిండే పేర్లు ఖరారైన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శివసేనకు దూకుడుకు కళ్లెం వేసేందుకుగాను రాజ్... ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 20 నుంచి 25 స్థానాల్లో మాత్రమే తమ పార్టీ పోటీ చేస్తుందని రాజ్‌ఠాక్రే ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలోనే తొలి విడత అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ ప్రకటించే అవకాశముంది.
ఇదిలాఉండగా 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఠాణే, ముంబై స్థానాల్లో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అయితే కల్యాణ్ స్థానం నుంచి ఆనంద్ పరాంజపే విజయఢంకా మోగించడంతో కొంత పరువు దక్కింది. అయితే అధిష్టానం తీరుతో విసిగిపోయిన ఆనంద్... ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని ఎన్సీపీలో చేరారు. దీంతో ఈ నియోజక వర్గంలో సమర్థుడైన నాయకుణ్ణి ఎంపిక చేయడం శివసేనకు సంక్లిష్టంగా మారింది. దీంతో పార్టీ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే తనయుడు శ్రీకాంత్ షిండేను అభ్యర్థిగా ప్రకటించాల్సి వచ్చింది. కల్యాణ్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయఢంకా మోగించాలని అటు ఎన్సీపీ, అటు శివసేన ప్రతిష్టగా భావిస్తున్నాయి. కాగా గోపాల్ లాండ్గే, దీపేశ్ మాత్రే, సునీల్ చౌదరి లాంటి దిగ్గజాలను పక్కనబెట్టి రాజకీయాల్లో అంత అనుభవంలేని శ్రీకాంత్ షిండేకు అభ్యర్థిత్వం ఇవ్వడంపై సహచర నాయకులు అసంతృప్తితో ఉన్నారు.
2009లో జరిగిన ఎన్నికల్లో కల్యాణ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెన్నెస్ తరఫున పోటీ చేసిన వైశాలి దరేకర్‌కు లక్షకుపైగా ఓట్లు వచ్చినప్పటికీ మూడో స్థానంలో నిలిచారు. ఆ సమయంలో ఎన్సీపీ పరాజయాన్ని చవిచూసినప్పటికీ శివసేన ఓట్లు కూడా తగ్గాయి. కాగా ఈ ఎన్నికల్లో కూడా ఎమ్మెన్నెస్ తమ అభ్యర్థిని బరిలో దింపడంవల్ల శివసేనకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కల్యాణ్ గ్రామీణ ప్రాంత ఎమ్మెల్యే రమేశ్ పాటిల్, అడ్వొకేట్ సుహాస్ తెలంగ్ పేర్లు చర్చల్లో ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి బయటపడి ఎమ్మెన్నెస్‌లో చేరిన రమేశ్ పాటిల్ శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
దీంతో 20 ఏళ్ల రాజకీయ అనుభవమున్న రమేశ్ పాటిల్ వైపే ఎమ్మెన్నెస్ అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఎక్కువగా ఉంది. ఆనంద్ పరాంజపే సిట్టింగ్ ఎంపీ కావడంతో ఎన్సీపీ కూడా తన శక్తినంతా కూడగట్టుకుని ఈ ఎన్నికల బరిలో దిగనుంది. అయితే ఎమ్మెన్నెస్ దీటైన అభ్యర్థిని బరిలో దింపితే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. దీంతో కల్యాణ్ లోక్‌సభ నియోజక వర్గంలో ఏ ఒక్క పార్టీ తామే గెలవగలమని గట్టిగా చెప్పగలిగే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది.
లోక్‌సభ ఎన్నికలు ‘కల్యాణ్’ నుంచి రమేశ్?
Published Tue, Mar 4 2014 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM
Advertisement
Advertisement