సాక్షి, ముంబై : మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, గాయని లతా మంగేష్కర్‌ల ప్రతిష్టను వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం çపణంగా పెట్టిందని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్‌ఠాక్రే మండిపడ్డారు. ఇరువురితో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించాల్సి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. సచిన్, లతా మంగేష్కర్‌లు వారివారి వృత్తిలో గొప్ప పేరు, ప్రఖ్యాతలు సంపాదించారని, కానీ, కొద్దిరోజుల కిందట వారు పెట్టిన పోస్టుల కారణంగా సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల ఆందోళనకు మద్దతుగా ప్రముఖ గాయని రిహానా పోస్టుపెట్టినపుడు కనీసం ఆమె గురించి భారతీయుల్లో చాలామందికి తెలియదని, అక్కడితో వదిలేస్తే బాగుండేదని కానీ, కేంద్రం భారత్‌లోని పలువురు సెలబ్రెటీలతో రిహానాకు కౌంటర్‌గా ప్రత్యేక హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెట్టించారని విమర్శించారు.
అయితే రిహానా, గ్రెటా థన్‌బెర్గ్‌లను భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోందని, కానీ, అమెరికాలోని హోస్టన్‌లో డోనాల్డ్ ట్రంప్ కు మద్దతుగా మోదీ అగ్‌లీబార్ ట్రంప్ సర్కార్ ర్యాలీ ఎంతవరకు సమంజసమని చురకలంటించారు. ఈ గొడవల్లోకి అనవసరంగా అక్షయ్‌కుమార్ లాంటి సెలబ్రెటీలనూ లాగారని రాజ్‌ఠాక్రే అభిప్రాయపడ్డారు. ఇపుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారంతా విమర్శలు ఎదుర్కొనే స్టేజిలో ఉన్నారని రాజ్‌ఠాక్రే వ్యాఖ్యానించారు.
రైతుల వద్ద అంతమంది పోలీసులెందుకు?
ఢిల్లీలో రైతుల ఆందోళన వద్ద బందోబస్తు చూస్తుంటే.. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల వద్ద కూడా ఇంత పెద్ద ఎత్తున ఉండదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్‌ఠాక్రే మండిపడ్డారు. టోల్‌నాకా కేసుపై వాషీ కోర్టులో శనివారం హాజరైన ఆయన బెయిల్ లభించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన రైతు చట్టాలపై రాజ్‌ఠాక్రే మాట్లాడుతూ.. ‘‘ఈ చట్టాలలో తప్పులేమీ లేవు. కానీ, వాటిలో కొన్ని లోపాలు ఉండి ఉంటాయి. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులతో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలి. చట్టాలను అమలు చేయాల్సింది’’ అని పేర్కొన్నారు. ఇక రైతుల ఆందోళనపై మాట్లాడుతూ.. ఈ ఆందోళన అవసరంకంటే అధికంగా తీవ్రమైందన్నారు. ఇండియా–పాకిస్తాన్, ఇండియా–చైనా సరిహద్దులలో ఉండే భద్రతకంటే అధికంగా రైతుల ఆందోళన వద్ద పోలీసులను మొహరించడంపై కేంద్రాన్ని విమర్శించారు. అయోధ్య పర్యటపై ఇంకా తేదీ ఖరారు కాలేదని రాజ్‌ఠాక్రే మీడియాకు బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment