లతాలో తెలిసిన మనిషి ఎంత ఉన్నదో తెలియని మనిషి అంత ఉన్నది. పట్టుదల జాస్తి. గెలవాలన్న మొండితనం. తన సామర్థ్యం తనకు తెలుసు కనుక మిగిలిన వారు అక్కర్లేదన్నంత అహం. పొగడ్తలు ఆమెకే. విమర్శలూ ఆమెకే. లతా చిన్నా పెద్ద తగాదాలు పెట్టుకోని సంగీత దర్శకులు లేరు. సి.రామచంద్ర, ఎస్.డి.బర్మన్‌లను ఆమె కొన్నాళ్లు బాయ్‌కాట్ చేసింది. పాట పాడి రెమ్యూనరేషన్ తీసుకున్నాక ఇక దాని సంగతి పట్టించుకోవాల్సిన పని లేదు అని రఫీ అభిప్రాయం.
కాని రికార్డులు అమ్ముడైనంత కాలం రాయల్టీ ఇవ్వాల్సిందే అని లతా వ్యాపారసూత్రం. తన మాటను పడనివ్వడం లేదని రఫీతో కొన్నాళ్లు పాడటం మానేసింది. ఆమె దగ్గర చాలా పదునైన వ్యంగ్యం ఉంది. శంకర్ జైకిషన్‌లోని శంకర్ గాయని శారదతో పాటలు పాడించడం ఆమెకు ఇష్టం లేదు. శారద, శంకర్ సన్నిహితం అని ఆమెకు తెలుసు. ‘ప్రేమ గుడ్డిదని తెలుసుగాని చెవిటిదని మొదటిసారి తెలుసు కున్నాను’ అని కామెంట్ చేసింది శారద అపస్వరాలను శంకర్ భరిస్తున్నాడు అనే అర్థంలో.
తండ్రి మరణించి కుటుంబం నానా కష్టాల్లో ఉండగా చెల్లెలు ఆశా భోంస్లే తమ మేనేజర్ గణపత్ రావు భోంస్లేతో పెళ్లి పేరుతో వెళ్లి పోవడం లతా అసలు సహించలేదు. ఎన్నో ఏళ్లు ఆశాను దూరం పెట్టింది. భర్త ఇంటి నుంచి ఆశా పారిపోయి వచ్చినా కనికరించలేదు. వాళ్లిద్దరూ డ్యూయెట్స్ పాడాల్సి వచ్చినప్పుడు తను ఆశా ముఖం చూడకుండా డైరీ అడ్డు పెట్టుకుని పాడేది. క్యాబరే పాటలు చేస్తున్న హెలెన్ తనకు లతా పాడదు కాబట్టి ఆశాను నిలబెట్టింది. లతాతో జీవితంలో ఒక్క పాటా పాడించని ఓ.పి.నయ్యర్ కూడా. ఆ తర్వాత కాలంలో అక్కచెల్లెళ్లు కలిశారు. ‘వీరిద్దరూ కొంచెమైనా చదువుకుని ఉంటే ప్రవర్తనా దోషాలు తగ్గి ఉండేవి’ అని నౌషాద్ అన్నాడు.
ముంబైలో కొత్త గాయనులు వీరి ప్రాభవం వల్ల ఊపిరి పీల్చడానికి ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా లతాకు భయపడి ఇండస్ట్రీ కొత్త గాయని గొంతును ఎదగనిచ్చేది కాదు. సుమన్ కల్యాణ్‌పూర్, హేమలత, వాణి జయరామ్ ఆల్‌మోస్ట్ ముంబై ఖాళీ చేశారు. నాజియా హసన్ వచ్చి ‘ఆప్ జైసా కోయి మేరే జిందగీ మే ఆయే’ పాడితే ఆ ఫ్రెష్‌నెస్‌కు నాజియా దుమారానికి లతా బెంబేలెత్తిందని అంటారు.
అనురాధా పౌడ్వాల్ టి సిరిస్ గుల్షన్ కుమార్ వల్ల నెగ్గుకొని వచ్చింది. లతా కొంత దారి ఇచ్చింది అల్కా యాగ్నిక్, కవితా కృష్ణమూర్తిలకే. ఇప్పటి కాలంలో శ్రేయ ఘోషాల్, సునిధి చౌహాన్ ఇష్టం అని ఆమె చెప్పుకుంది. లతా తన పాటలు తాను వినదు... తప్పులు కనపడతాయని. ఎప్పుడైనా తానే పాడిన మీరా భజన్స్ మాత్రం వింటానని చెప్పుకుంది. లతా తన ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డు మీద ఫ్లై ఓవర్ వేయడానికి ఒప్పుకోలేదు... ట్రాఫిక్ అంతరాయం అని. ముంబై ఖాళీ చేస్తాను అనంటే ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇంత మొండితనం ఉన్న లతా అంతే మొండితనంతో తండ్రి పేరున దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్‌ను కట్టి ప్రజలకు అప్పజెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment