ముంబై: భారత క్రికెట్ దిగ్గజం, భారత రత్న అవార్డు గ్రహిత సచిన్ టెండూల్కర్ భద్రతా సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య పాల్పడటం కలకలం రేపుతోంది. స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు (SRPF) చెందిన జవాన్ ప్రకాష్ కపడే తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెలవులపై తన స్వస్థలం మహారాష్ట్రలోని జలగావ్‌జిల్లా జమ్నేర్‌కు వెళ్లిన ప్రకాష్.. అక్కడే ఈ ఘటనకు పాల్పినట్లు పేర్కొన్నారు. 39 ఏళ్ల కపడే తన సర్వీస్ గన్‌తో మెడపై కాల్చుకుని మరణించినట్లు వెల్లడించారు.
మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, ఓ సోదరుడు ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు జమ్నేర్ పోలీస్ స్టేషన్ సీఐ కిరణ్ షిండే పేర్కొన్నారు. అయితే ఆత్మహత్యకు గల ఖచ్చిత కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు
ప్రాథమిక విచారణ ద్వారా వ్యక్తిగత కారణాల వల్ల జవాన్ బలవన్మరణానికి పాల్పడినట్లు తేలిందన్నారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. కపడే మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆత్మహత్య ఘటనపై జమ్మేర్ పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నారు. వీవీఐపీకి సెక్యూర్టీ కల్పిస్తున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎస్ఆర్పీఎఫ్ వ్యక్తిగతంగా ఈ కేసును దర్యాప్తు చేయనున్నది.
మరోవైపు, వీవీఐవీ భద్రత కోసం నియమించిన గార్డు ఆత్మహత్యకు పాల్పడటంతో.. ఈ ఘటనపై SRPFస్వతంత్ర విచారణ చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment