సౌరవ్‌ గంగూలీ కుమార్తె సనా కారుకు యాక్సిడెంట్‌ | Sourav Ganguly Daughter Sana Escapes Unhurt After Bus Hits Her Car In Kolkata | Sakshi
Sakshi News home page

సౌరవ్‌ గంగూలీ కుమార్తె సనా కారుకు యాక్సిడెంట్‌.. తప్పిన ప్రమాదం

Published Sat, Jan 4 2025 11:01 AM | Last Updated on Sat, Jan 4 2025 11:27 AM

Sourav Ganguly Daughter Sana Escapes Unhurt After Bus Hits Her Car In Kolkata

టీమిండియా మాజీ కెప్టెన్‌, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ(Sourav Ganguly) కుమార్తె సనా గంగూలీకి పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. కోల్‌కతాలోని తమ ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం కారులో బయల్దేరిన సనా గంగూలీ బెహాలా చౌరాస్తాకు చేరుకున్న సమయంలో ఓ ప్రైవేటు బస్సు ఆమె కారును బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో సనా(Sana Ganguly)తో పాటు కారులో ఉన్న మిగతా వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, కారును ఢీకొట్టిన తర్వాత ఆ బస్సు వేగంగా అక్కడి నుంచి కదిలింది. ఈ క్రమంలో స్థానికులతో పాటు.. పోలీసులు బస్సును వెంబడించారు. దాదాపు కిలోమీటరు దూరం ప్రయాణించిన తర్వాత.. ఎట్టకేలకు సఖేర్‌బజార్‌ క్రాసింగ్‌ వద్ద బస్సును ఆపగలిగారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిని విచారిస్తున్నారు.

అప్పటి నుంచి పోలీసు నిఘాలో 
కాగా బెహాలా చౌరాస్తా వద్ద గత ఏడాదిన్నర కాలంగా పోలీసు బందోబస్తు ఉంది. 2023లో బెహాలా చౌరాస్తా వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో ఎనిమిదేళ్ల విద్యార్థిని ట్రక్కు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అతడు తవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందాడు. రెండో తరగతి చదువుతున్న ఆ పిల్లాడు పరీక్ష రాసేందుకు వెళ్తూ దుర్మరణం పాలు కావడంతో స్థానికుల్లో ఆగ్రహం, ఆవేదన పెల్లుబికాయి.

పరిస్థితి చేయిదాటంతో పోలీసులు వచ్చి వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి చౌరాస్తా ప్రాంతం పోలీసు నిఘాలో ఉంది. ఈ క్రమంలోనే సనా గంగూలీ కారును ఢీకొట్టిన ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించగలిగారు. 

ఇక రాయ్‌చక్‌ నుంచి కోల్‌కతా మార్గంలో వెళ్తున్న బస్సు.. సనా కారును ఢీకొట్టిందని.. అయితే, ఈ ఘటనలో కారు పెద్దగా డ్యామేజ్‌ కాలేదని.. అలాగే అందులోని ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఏకైక సంతానం
కాగా భారత దిగ్గజ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ- డోనా దంపతులకు ఏకైక సంతానం సనా. 1997లో పెళ్లి చేసుకున్న సౌరవ్‌- డోనాలకు 2001లో కుమార్తె సనా జన్మించింది. తల్లిలాగే సనా కూడా ఒడిస్సీ డాన్సర్‌. లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌ నుంచి ఎకనామిక్స్‌లో ఆమె పట్టా పుచ్చుకుంది. 

చదవండి: IND vs AUS: టీమిండియాకు భారీ షాక్‌.. ఆస్పత్రికి జస్ప్రీత్‌ బుమ్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement