
డీఎస్పీగా దీప్తి శర్మ(PC: Instagram)
భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ(Deepti Sharma)కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగం ఇచ్చింది. ‘డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(Deputy Superintendent Of Police-డీఎస్పీగా)’గా ఆమెను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు దీప్తి కృతజ్ఞతలు తెలియజేసింది. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తానని పేర్కొంది.
కాగా భారత మహిళా క్రికెట్ జట్టు(Indian Women Cricket Team)లో దీప్తి శర్మ గత కొంతకాలంగా కీలక సభ్యురాలిగా ఉంది. రెండేళ్ల క్రితం కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్ రజత పతకం గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది.
గతేడాది అత్యుత్తమంగా
నిలకడైన ఆట తీరుతో ఐసీసీ వుమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్-2024 జట్టులో దీప్తి స్థానం దక్కించుకుంది. గతేడాది ఆమె బంతితో అత్యుత్తమంగా రాణించింది. 6.01 ఎకానమీతో అంతర్జాతీయ టీ20లలో ముప్పై వికెట్లు కూల్చింది.
ఇక రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన 27 ఏళ్ల దీప్తి శర్మ.. ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడి 319 పరుగులు చేయడంతో పాటు 20 వికెట్లు తీసింది. అదే విధంగా.. 101 వన్డేల్లో 2154 రన్స్ సాధించడంతో పాటుగా.. 130 వికెట్లు పడగొట్టింది. భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లలో 124 మ్యాచ్‌లు ఆడిన దీప్తి శర్మ 1086 పరుగులు చేసింది. అదే విధంగా.. 138 వికెట్లతో సత్తా చాటింది.
రూ. 3 కోట్ల క్యాష్ రివార్డుతో పాటు
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. క్రీడా రంగంలో ఆమె సేవలకు గుర్తింపుగా రూ. 3 కోట్ల క్యాష్ రివార్డుతో పాటు డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వనున్నట్లు గతేడాది ప్రకటించింది. తాజాగా విధుల్లో చేరేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా మొరదాబాద్‌లో సోమవారం అధికారికంగా ఉద్యోగంలో చేరిన దీప్తి శర్మ.. డీఎస్పీ యూనిఫామ్‌లో మెరిసింది. ఆమె తండ్రి భగవాన్ శర్మ, సోదరులు సుమిత్ శర్మ, ప్రశాంత్ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆగ్రా ఆల్‌రౌండర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది.
ప్రతిజ్ఞ చేస్తున్నా
‘‘ఈ మైలురాయిని చేరినందుకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. నాకు మద్దతుగా నిలిచి.. ఈస్థాయికి చేరుకునేలా ప్రోత్సహించిన నాకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నా.
అలాగే.. ప్రజలకు సేవ చేసేందుకు వీలుగా ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞురాలినై ఉంటాను. ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా నా కొత్త పాత్రలో ఒదిగిపోవడంతో పాటుగా.. విధి నిర్వహణలో పూర్తి అంకితభావంతో పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా’’ అని దీప్తి శర్మ పోలీస్ యూనిఫామ్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మన క్రికెటర్లలో మరో డీఎస్పీ
ఈ క్రమంలో దీప్తికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘తొలుత సిరాజ్.. ఇప్పుడు మన క్రికెటర్లలో మరో డీఎస్పీ’’ అంటూ ఓ నెటిజన్ పేర్కొనడం హైలైట్‌గా నిలిచింది. కాగా టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇటీవలే అధికారికంగా అతడికి నియామక ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే.
చదవండి: 13 ఏళ్ల తర్వాత రంజీ బరిలో కోహ్లి.. పోటెత్తిన జనం.. తొక్కిసలాట..
Comments
Please login to add a commentAdd a comment